సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
భారతీయ సాంప్రదాయ జానపద, గిరిజన సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం, ప్రోత్సహించడం కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, యూట్యూబ్ మధ్య కుదిరిన ఒప్పందం
దేశంలోని విభిన్న జానపద సంప్రదాయాలను పరిరక్షించడం, ప్రోత్సహించడం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యం: శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
నాడు పోస్టు చేయడమైనది:
25 MAR 2026 6:12PM by PIB Hyderabad
భారత్‌లోని సాంప్రదాయ జానపద, గిరిజన సంగీతాన్ని ప్రోత్సహించేందుకు, దానికి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, యూట్యూబ్ మధ్య నేడు న్యూఢిల్లీలో ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్, యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి గుంజన్ సోని పాల్గొన్నారు.
దేశంలోని వైవిధ్యభరితమైన జానపద సంప్రదాయాలను పరిరక్షించడం, ప్రోత్సహించడం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రధాన లక్ష్యమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. యూట్యూబ్‌తో కుదిరిన ఈ భాగస్వామ్యం మన సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, కళాకారులను సాధికారత వైపు నడిపించడంలో కీలక అడుగుగా అభివర్ణించారు. మన జానపద కళాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు, ఆదాయం, వేదికలను కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు.
దేశం నలుమూలల నుంచి వచ్చే జానపద కళాకారులు తమ సంస్కృతి, సంప్రదాయాలను గర్వంగా కాపాడుకుంటూనే, స్వతంత్ర సృజనాత్మక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చేయడమే తమ లక్ష్యమని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్ తెలిపారు. యూట్యూబ్ ప్రపంచవ్యాప్త విస్తృతిని, మంత్రిత్వ శాఖ మౌలిక సదుపాయాలతో అనుసంధానించడం ద్వారా తాము కేవలం ఒక వేదికను మాత్రమే కాకుండా, లక్షలాది మంది జానపద కళాకారులు స్వయం సమృద్ధి సాధించడానికి, విజయంతంగా వ్యాపారాలు కొనసాగించడానికి పునాది వేస్తున్నామని చెప్పారు.
ఈ ప్రకటనపై యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి గుంజన్ సోని స్పందిస్తూ. భారత్‌లోని నలుమూలల నుంచి ప్రతిభావంతులైన కళాకారులు, సృజనాత్మకత కలిగిన వ్యక్తులు తమ ప్రతిభను ప్రపంచంతో పంచుకోవడానికి యూట్యూబ్ ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు. జానపద సంగీతం అనేది భారతదేశ సంస్కృతిలో ఒక శక్తిమంతమైన భాగమని, ఈ ముఖ్యమైన సంప్రదాయాలను పరిరక్షించడానికి, విస్తరించడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖతో కుదిరిన ఈ భాగస్వామ్యం ఒక అమూల్యమైన అవకాశంగా పేర్కొన్నారు. మంత్రిత్వ శాఖకు ఉన్న లోతైన సాంస్కృతిక అనుబంధం, ఐఎంఓసీ మౌలిక సదుపాయాలను, కళాకారులకు మద్దతునిచ్చే యూట్యూబ్ ప్రత్యేక సామర్థ్యంతో అనుసంధానం చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్త వేదికపై కళాకారుల ప్రతిభను చాటడమే కాకుండా, ప్రతి చోటా ఉన్న సృజనాత్మక వ్యక్తులకు సమాన అవకాశాలు కల్పించడం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రతిభావంతులైన కళాకారులకు కేవలం డిజిటల్ నైపుణ్యాలను అందించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కొత్త ప్రేక్షకులతో అనుసంధానమవ్వడానికి, ఆన్‌లైన్‌లో విజయవంతమైన వృత్తిని నిర్మించుకోవడానికి స్థిరమైన మార్గాలను చూపడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ అపురూపమైన కళారూపాలు రాబోయే తరాలకు కూడా చేరువయ్యేలా చూడటం మా బాధ్యత అని ఆమె తెలిపారు.
దేశంలోని జానపద, సాంప్రదాయ సంగీత కళాకారుల సమాజానికి డిజిటల్ సాధనాలు, జ్ఞాన వ్యవస్థలు, అధిక సంఖ్యలో ప్రేక్షకులను అందుబాటులోకి తెచ్చి వారిని సాధికారత వైపు నడిపించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఇది డిజిటల్ నైపుణ్యం, మేధో సంపత్తి హక్కులపై అవగాహన, సహకారం, మెరుగైన సహకార అవకాశాలు, కళాకారులకు స్థిరమైన వృత్తి మార్గాల ద్వారా భారతీయ సాంప్రదాయ, జానపద సంగీత వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతుంది.
భారతీయ జానపద, గిరిజన, సాంప్రదాయ సంగీత వారసత్వం ఎంతో వైవిధ్యమైనది, శక్తిమంతమైనది. అయినప్పటికీ ఆధునిక కంటెంట్ ప్రపంచంలో అంతర్జాతీయ గుర్తింపు, డిజిటల్ పంపిణీ, హక్కుల పట్ల అవగాహన వంటి విషయాల్లో ఈ కళారూపాలు తరచుగా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. క్రమబద్ధమైన శిక్షణా కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, నిరంతర సంస్థాగత మద్దతు ద్వారా ఈ లోపాలను పూరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక నాయకత్వం, పర్యవేక్షణను అందిస్తుంది. ఇది జానపద సంగీత ఆధారిత సృజనాత్మక ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించడంతో పాటు, ఒక ఉమ్మడి టాస్క్ ఫోర్స్ ఈ పథకం అమలును, దాని ప్రభావాన్ని అంచనా వేస్తుంది. మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంపిక చేసిన స్వయంప్రతిపత్తి కలిగిన కళా, ప్రదర్శన సంస్థల ద్వారా కళాకారులకు రికార్డింగ్ పరికరాలు, ఇతర వసతులు కల్పిస్తారు. అలాగే స్థానిక విద్యా సామగ్రిని రూపొందించడం, మార్గదర్శకులను గుర్తించడం వంటి పనులు చేపడతారు.
ఈ ఒప్పందం ప్రకారం డిజిటల్ కంటెంట్ తయారీలో ఉత్తమ పద్ధతులు, ఛానల్ నిర్వహణ, మానిటైజేషన్ వ్యూహాలు, కాపీరైట్ల నిర్వహణ, యూట్యూబ్ అనలిటిక్స్ ద్వారా ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకోవడం వంటి అంశాలపై జానపద, గిరిజన, సాంప్రదాయ కళాకారులకు శిక్షణ ఇవ్వడంలో మంత్రిత్వ శాఖకు, దాని అనుబంధ సంస్థలకు యూట్యూబ్ సహాయం చేస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 2245460)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12