మంత్రిమండలి
‘ప్రాంతీయ అనుసంధాన పథకం - సవరించిన ఉడాన్’కు కేబినెట్ ఆమోదం: మొత్తం వ్యయం రూ. 28,840 కోట్లు
నాడు పోస్టు చేయడమైనది:
25 MAR 2026 4:16PM by PIB Hyderabad
ప్రాంతీయ అనుసంధాన పథకం- సవరించిన ఉడాన్ ప్రారంభం, అమలుకు.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బడ్జెటు పరంగా భారత ప్రభుత్వం రూ. 28,840 కోట్ల సాయాన్ని అందించే ఈ పథకాన్ని 2026-27 నుంచి 2035-36 వరకు పదేళ్ల కాలానికి అమలు చేయనున్నారు.
ప్రభావం:
- విమాన సేవలు తక్కువగా ఉన్న లేదా అందుబాటులో లేని ప్రాంతాలకు ప్రాంతీయ విమాన అనుసంధానాన్ని మెరుగుపరచడం
- ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, పర్యాటక రంగాలకు ప్రోత్సాహం
- అందుబాటు ధరలతో విమాన ప్రయాణాన్ని సామాన్య పౌరులకు అందుబాటులోకి తేవడం
- మారుమూల, కొండ ప్రాంతాల్లో అత్యవసర సేవలు, ఆరోగ్య రక్షణ సదుపాయాలను మెరుగ్గా అందుబాటులోకి తేవడం
- ప్రాంతీయ విమానాశ్రయాలు, విమానయాన సంస్థల కార్యకలాపాలను ఆర్థికంగా నిలకడగా మార్చడం
- ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా దేశీయ వైమానిక రంగాన్ని ప్రోత్సహించడం
- ‘వికసిత్ భారత్ - 2047’ లక్ష్యం దిశగా పురోగతి.
పథకంలోని ముఖ్య భాగాలు:
(a) విమానాశ్రయాల అభివృద్ధి (మూలధన వ్యయం)
మౌలిక సదుపాయాల విస్తరణతోపాటు ప్రపంచ స్థాయిలో పోటీపడగల విమానయాన వ్యవస్థగా భారత్‌ను నిలపాలన్న వికసిత భారత్- 2047 లక్ష్యానికి అనుగుణంగా – ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా.. వచ్చే ఎనిమిదేళ్ల కాలంలో మొత్తం రూ. 12,159 కోట్ల వ్యయంతో ప్రస్తుతం విమాన సేవలు అందుబాటులో లేని 100 ప్రాంతాల్లో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సవరించిన ఉడాన్ పథకం ద్వారా ప్రతిపాదించారు.
(b) విమానాశ్రయాల కార్యకలాపాలు, నిర్వహణ
ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్సీఎస్) పరిధిలోకి మాత్రమే వచ్చే విమానాశ్రయాల్లో కార్యకలాపాలు, నిర్వహణ కోసం అధిక వ్యయాలు పునరావృత్తమవడమే కాకుండా, ఆదాయ వనరులు కూడా పరిమితంగానే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని, దాదాపు 441 విమానాశ్రయాలకు ఈ పథకం కింద మూడేళ్ల పాటు నిర్వహణపరమైన సాయాన్ని అందించాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ప్రతి విమానాశ్రయానికి ఏడాదికి గరిష్టంగా రూ. 3.06 కోట్లు, ప్రతి హెలిపోర్ట్/ వాటర్ ఏరోడ్రోమ్‌కు ఏడాదికి గరిష్టంగా రూ. 0.90 కోట్ల వరకు ఆర్థిక సాయాన్ని అందించాలని ప్రతిపాదించారు. ఇందుకోసం రూ. 2,577 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు.
(c) ఆధునిక హెలిపాడ్ల అభివృద్ధి
మారుమూల, కొండ ప్రాంతాలూ, ద్వీప ప్రాంతాలూ, అభిలషణీయ ప్రాంతాల్లో రవాణాపరమైన సవాళ్లను అధిగమించడం లక్ష్యంగా.. వచ్చే ఎనిమిదేళ్లలో 200 ఆధునిక హెలిప్యాడ్లను అభివృద్ధి చేయాలని ఈ పథకం ప్రతిపాదించింది. ఇందుకోసం ఒక్కోదానికి రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.3,661 కోట్లు (ద్రవ్యోల్బణం ప్రకారం సర్దుబాటు చేస్తారు) అవసరమని అంచనా. ప్రాధాన్య ప్రాంతాలు, అభిలషణీయ జిల్లాల్లో క్షేత్రస్థాయి వరకూ అనుసంధానాన్నీ, అత్యవసర సేవలనూ మెరుగుపరచడంపై ఈ పథకం ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
(d) ఆదాయ లోప పూరక నిధి (వయబలిటీ గ్యాప్ ఫండింగ్ – వీజీఎఫ్)
ప్రాంతీయ అనుసంధాన పథకం కింద, కేటాయించిన మార్గాల్లో కార్యకలాపాల నిర్వహణకుగాను.. వీజీఎఫ్ రూపంలో విమానయాన సంస్థలకు ఆర్థిక సాయం లభిస్తుంది. మార్కెట్ అభివృద్ధికి ఎక్కువ సమయం పడుతుందన్న అంశాన్ని గుర్తించి.. వచ్చే పదేళ్ల కాలానికి విమానయాన సంస్థలకు రూ. 10,043 కోట్ల మేర వీజీఎఫ్ ద్వారా చేయూతనివ్వాలని ప్రతిపాదించారు.
(e) ఆత్మనిర్భర భారత్ ఎయిర్ క్రాఫ్టుల కొనుగోలు
మారుమూల, కష్టతరమైన భూభాగాలలో కార్యకలాపాలకు అవసరమైన చిన్న ఫిక్స్డ్ వింగ్ విమానాలు, హెలికాప్టర్ల కొరతను అధిగమించడానికీ, ఆత్మనిర్భర భారత్ లక్ష్యం దిశగా పురోగమించడానికీ... పవన్ హన్స్ సంస్థ కోసం రెండు హెచ్‌ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్లనూ, అలయన్స్ ఎయిర్ సంస్థ కోసం రెండు హెచ్‌ఏఎల్ డోర్నియర్ విమానాలనూ కొనుగోలు చేయాలని ఈ పథకం ప్రతిపాదించింది.
నేపథ్యం:
విమాన ప్రయాణాన్ని అందుబాటు ధరలో అందించడంతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా.. మౌలిక ఉడాన్ పథకాన్ని 2016 అక్టోబరులో ప్రభుత్వం ప్రారంభించింది. అది అమలైన తొమ్మిదేళ్ల కాలంలో: -
- 95 విమానాశ్రయాలు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్‌లలో 663 విమానయాన మార్గాలు అందుబాటులోకి వచ్చాయి (2026 ఫిబ్రవరి 28 నాటికి).
- 3.41 లక్షలకు పైగా విమానాలు నడిచాయి. 162.47 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి.
- మారుమూల, కొండ ప్రాంతాలు, ద్వీప ప్రాంతాల్లో రవాణా అనుసంధానం ఏర్పడింది. దీంతో పర్యాటకం, వైద్య సదుపాయాలు, అత్యవసర సేవలు విశేషంగా మెరుగయ్యాయి.
- ప్రాంతీయ విమానయాన సంస్థల వృద్ధినీ, విభిన్నమైన వైమానిక కార్యకలాపాలనూ ఈ పథకం ప్రోత్సహించింది. తద్వారా సవరించిన ఉడాన్ పథకానికి బలమైన పునాదులు వేసింది.
***
(రిలీజ్ ఐడి: 2245337)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14