హోం మంత్రిత్వ శాఖ
సైబర్ ఘటనలను ఎదుర్కోవడంలో రాష్ట్రాలకు సహాయం
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 4:24PM by PIB Hyderabad
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000లోని సెక్షన్ 70B నిబంధనల ప్రకారం, సైబర్ భద్రతా ఘటనలకు ప్రతిస్పందించడానికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను (సీఈఆర్‌టీ-ఐఎన్) జాతీయ ఏజెన్సీగా నియమించారు. సీఈఆర్‌టీ-ఐఎన్‌కు నివేదించిన, అది పర్యవేక్షించిన సమాచారం ప్రకారం... గత ఐదు సంవత్సరాల్లో గమనించిన మొత్తం సైబర్ భద్రతా ఘటనల సంఖ్య కింది విధంగా ఉంది:
|
సంవత్సరం
|
సైబర్ భద్రతా ఘటనల సంఖ్య
|
|
2021
|
14,02,809
|
|
2022
|
13,91,457
|
|
2023
|
15,92,917
|
|
2024
|
20,41,360
|
|
2025
|
29,44,248
|
సీఈఆర్‌టీ-ఐఎన్ ప్రకారం, వివిధ రంగాలు సహా అత్యధిక సంఖ్యలో సైబర్ ఘటనలు జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ నుంచే నమోదయ్యాయి. సైబర్ ఘటనల కారణంగా సంభవించిన అంచనా ఆర్థిక నష్టానికి సంబంధించిన వివరాలను సీఈఆర్‌టీ-ఐఎన్ నిర్వహించడం లేదు.
సైబర్ భద్రతను పెంపొందించడానికి, సైబర్ దాడులను నివారించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం అందించడానికి సీఈఆర్‌టీ-ఐఎన్ కింది చర్యలను చేపట్టింది:
కంప్యూటర్లు, నెట్‌వర్క్‌లు, డేటా భద్రత కోసం తాజా సైబర్ ముప్పులు/లోపాలు, నివారణ చర్యలకు సంబంధించి సీఈఆర్‌టీ-ఐఎన్ నిరంతరం హెచ్చరికలు, సూచనలను జారీ చేస్తుంది.
సీఈఆర్‌టీ-ఐఎన్ ద్వారా అమలయ్యే జాతీయ సైబర్ సమన్వయ కేంద్రం, సైబర్ భద్రతా ముప్పులను గుర్తించడానికి సైబర్‌స్పేస్‌ను పరిశీలిస్తుంది. చర్యలు తీసుకోవడం కోసం ఇది ఆ సమాచారాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రంగాలకు చెందిన సంస్థలు, సంబంధిత ఏజెన్సీలతో పంచుకుంటుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రంగాల్లోని సంస్థలు ముప్పు నివారణ చర్యలను చురుగ్గా చేపట్టేందుకు వీలుగా, వారికి అనుగుణంగా రూపొందించిన హెచ్చరికలను ముందుగానే సేకరించి, విశ్లేషించి, పంచుకోవడానికి సీఈఆర్‌టీ-ఐఎన్ ముందస్తు ముప్పు నివారణ చర్యలను నిర్వహిస్తుంది.
సైబర్ స్వచ్ఛతా కేంద్రం (సీఎస్‌కే)... సీఈఆర్‌టీ-ఐఎన్ అందించే ఒక సేవ. ఇది స్వచ్ఛ భారత్ దార్శనికతను సైబర్ ప్రపంచానికి విస్తరింపజేస్తుంది. సైబర్ స్వచ్ఛతా కేంద్రం హానికరమైన ప్రోగ్రామ్‌లను, లోపభూయిష్ట సేవలను గుర్తించడం ద్వారా వివిధ రాష్ట్రాలు, రంగాల్లోని సంస్థలకు నివారణ చర్యలను అందించడంలో సహాయపడుతుంది.
సమాచార భద్రత కోసం ఉత్తమ పద్ధతులను అమలు చేయడంలో మద్దతునివ్వడానికి, ఆడిట్ చేయడానికి 237 భద్రతా ఆడిటింగ్ సంస్థలను సీఈఆర్‌టీ-ఐఎన్ ఏర్పాటు చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, కీలక రంగాల్లోని సంస్థల సైబర్ భద్రతా స్థితిని, సంసిద్ధతను అంచనా వేయడానికి వీలుగా సైబర్ భద్రతా మాక్ డ్రిల్స్ క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. సైబర్ భద్రతా రంగంలో సమన్వయం, సమాచార బదిలీని సులభతరం చేయడం కోసం ఈ డ్రిల్స్‌తో పాటు రాష్ట్రాల్లోనూ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్ భద్రత సంస్కృతిని ప్రోత్సహించడంపై దృష్టి సారించేందుకు “సైబర్ భారత్ సేతు” పేరుతో ప్రత్యేక సైబర్ భద్రతా కార్యక్రమాన్ని సీఈఆర్‌టీ-ఐఎన్ ప్రారంభించింది. మధ్యప్రదేశ్, త్రిపుర, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాలు 2025లో ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు... ప్రభుత్వేతర, ప్రైవేట్ సంస్థల్లోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న సైబర్ భద్రతా సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరచడం కోసం సీఈఆర్‌టీ-ఐఎన్ పారిశ్రామిక భాగస్వాములతో కలిసి సంయుక్తంగా సైబర్ భద్రత శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం 'పోలీస్', 'ప్రజా శాంతిభద్రతలు' రాష్ట్ర పరిధిలోని అంశాలు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు... చట్టాలను అమలు చేసే తమ సంస్థల ద్వారా సైబర్ మోసాలు సహా నేరాల నివారణ, గుర్తింపు, దర్యాప్తు, ఫిర్యాదుల స్వీకరణ, రికవరీ చర్యలు, బాధితుల సహాయ వ్యవస్థలు, విచారణల కోసం ప్రాథమికంగా బాధ్యత వహిస్తాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలను అమలు చేసే సంస్థల సామర్థ్యాలను పెంపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా సూచనలు, ఆర్థిక సహాయం అందిస్తూ వారి కార్యక్రమాలకు తోడ్పాటునందిస్తోంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తన “క్రైమ్ ఇన్ ఇండియా” ప్రచురణలో నేరాలకు సంబంధించిన గణాంక సమాచారాన్ని సంకలనం చేసి ప్రచురిస్తుంది. తాజాగా ప్రచురించిన నివేదిక 2023 సంవత్సరానికి సంబంధించినది. ఎన్‌సీఆర్‌బీ ప్రచురించిన సమాచారం ప్రకారం, 2019 నుంచి 2023 వరకు కాలంలో సంవత్సరం వారీగా సైబర్ నేరాల (కమ్యూనికేషన్ పరికరాలను మాధ్యమంగా/లక్ష్యంగా ఉపయోగించి చేసేవి) కింద నమోదైన కేసులు, శిక్షపడిన వ్యక్తుల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
|
సంవత్సరం
|
నమోదైన కేసులు
|
శిక్షపడిన వ్యక్తులు
|
|
2019
|
44735
|
486
|
|
2020
|
50035
|
1369
|
|
2021
|
52974
|
736
|
|
2022
|
65893
|
1407
|
|
2023
|
86420
|
1104
|
రికవరీ చేసిన మొత్తం గురించిన డేటాను ఎన్‌సీఆర్‌బీ నిర్వహించదు.
సైబర్ నేరాలను సమగ్రంగా, సమన్వయంతో ఎదుర్కొనే యంత్రాంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కింది విధంగా ఉన్నాయి:
దేశంలోని అన్ని రకాల సైబర్ నేరాలను సమన్వయంతో, సమగ్రంగా ఎదుర్కోవడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’ (ఐ4సీ)ని ఒక అనుబంధ కార్యాలయంగా ఏర్పాటు చేసింది.
మహిళలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ, అన్ని రకాల సైబర్ నేరాలకు సంబంధించిన ఘటనలనూ ప్రజలు నివేదించడానికి వీలుగా ఐ4సీలో ‘జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’ (ఎన్‌సీఆర్‌పీ)ని (https://cybercrime.gov.in) ప్రారంభించారు. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో నివేదించిన సైబర్ నేర ఘటనలు, వాటి కోసం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం, తదుపరి చర్యలు అంటే ఛార్జిషీట్ల దాఖలు, అరెస్టులు, ఫిర్యాదులను పరిష్కరించడం వంటి పనులను చట్టంలోని నిబంధనల ప్రకారం సంబంధిత రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన చట్టాలను అమలు చేసే సంస్థలు నిర్వహిస్తాయి.
ఆర్థిక మోసాలను తక్షణం నివేదించడానికి, మోసగాళ్లు నిధులను దుర్వినియోగం చేయడాన్ని అరికట్టడానికి, ఐ4సీ ఆధ్వర్యంలో ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎమ్ఎస్) ను 2021 సంవత్సరంలో ప్రారంభించారు. ఐ4సీ నిర్వహిస్తున్న సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎమ్ఎస్ ప్రకారం, 31.01.2026 నాటికి అందిన 24.65 లక్షలకు పైగా ఫిర్యాదుల్లో రూ. 8,690 కోట్లకు పైగా ప్రజా ధనాన్ని రక్షించారు. ఆన్‌లైన్‌లో సైబర్ ఫిర్యాదులు చేయడానికి సహాయం అందించేందుకు ‘1930’ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు.
సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి తక్షణ చర్యలు, నిరంతర సహకారం కోసం ఐ4సీలో అత్యాధునిక సైబర్ మోసాల నివారణ కేంద్రం (సీఎఫ్ఎమ్‌సీ)ని ఏర్పాటు చేశారు. ప్రధాన బ్యాంకులు, ఆర్థిక మధ్యవర్తులు, పేమెంట్ అగ్రిగేటర్లు, టెలికాం సేవా ప్రదాతలు, ఐటీ మధ్యవర్తులతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన చట్టాలను అమలు చేసే సంస్థల ప్రతినిధులూ దీని కోసం కలిసి పనిచేస్తున్నారు.
ఉత్తమ పద్ధతులను పంచుకోవడం, సామర్థ్య నిర్మాణాన్ని మెరుగుపరచడం మొదలైన వాటి కోసం ఐ4సీ, ఎంహెచ్ఏ ఎప్పటికప్పుడు ‘స్టేట్ కనెక్ట్’, ‘థానా కనెక్ట్’, పీర్ లెర్నింగ్ సెషన్‌లను నిర్వహిస్తోంది.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల దర్యాప్తు అధికారులకు (ఐవోలకు) ప్రారంభ దశ సైబర్ ఫోరెన్సిక్ సహాయాన్ని అందించడం కోసం ఐ4సీలో భాగంగా న్యూఢిల్లీలో (18.02.2019న), అస్సాంలో (29.08.2025న) అత్యాధునిక జాతీయ-డిజిటల్ దర్యాప్తు సహాయక కేంద్రాన్ని (గతంలో జాతీయ సైబర్ ఫోరెన్సిక్ ప్రయోగశాల (దర్యాప్తు) {ఎన్‌సీఎఫ్ఎల్(ఐ)}గా పిలిచేది) ఏర్పాటు చేశారు. 31.01.2026 వరకు న్యూఢిల్లీలోని జాతీయ-డిజిటల్ దర్యాప్తు సహాయక కేంద్రం సైబర్ నేరాలకు సంబంధించిన 13,417కు పైగా కేసుల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన చట్టాలను అమలు చేసే సంస్థలకు (ఎల్ఈఏలకు) తన సేవలను అందించింది.
'మహిళలు, పిల్లలపై సైబర్ నేరాల నివారణ (సీసీపీడబ్ల్యూసీ)' పథకం కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రూ. 132.93 కోట్ల ఆర్థిక సహాయాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సైబర్ ఫోరెన్సిక్-కమ్-శిక్షణ ప్రయోగశాలల ఏర్పాటు... జూనియర్ సైబర్ కన్సల్టెంట్ల నియామకం... చట్టాలను అమలు చేసే సంస్థల (ఎల్ఈఏ) సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయాధికారులకు శిక్షణనివ్వడం ద్వారా వారి సామర్థ్యాలను పెంపొందించడం కోసం ఈ నిధులను కేటాయించారు. 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్ ఫోరెన్సిక్-కమ్-శిక్షణ ప్రయోగశాలలను ప్రారంభించారు. చట్టాలను అమలు చేసే సంస్థలకు చెందిన 24,600 మందికి పైగా సిబ్బందికి, న్యాయాధికారులు, ప్రాసిక్యూటర్లకు సైబర్ నేరాల అవగాహన, దర్యాప్తు, ఫోరెన్సిక్స్ మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చారు.
సైబర్ నేరాల దర్యాప్తు, ఫోరెన్సిక్స్, ప్రాసిక్యూషన్ మొదలైన కీలక అంశాలపై ఆన్‌లైన్ కోర్సుల ద్వారా పోలీసు అధికారులు, న్యాయాధికారుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గానూ ఐ4సీ ఆధ్వర్యంలో ‘సైట్రెయిన్’ పోర్టల్ పేరుతో మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుల (ఎమ్ఓఓసీ) వేదికను రూపొందించారు. 31.01.2026 నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,51,081 మందికి పైగా పోలీసు అధికారులు, న్యాయాధికారులు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. 1,42,025 కు పైగా సర్టిఫికెట్లనూ వారికి జారీ చేశారు.
బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో ఐ4సీ 10.09.2024న సైబర్ నేరగాళ్ల గుర్తింపులతో అనుమానితుల రిజిస్ట్రీని ప్రారంభించింది. 31.01.2026 వరకు, బ్యాంకుల నుంచి స్వీకరించిన 23.05 లక్షలకు పైగా అనుమానితుల గుర్తింపు డేటాను, 27.37 లక్షల లేయర్ 1 మ్యూల్ ఖాతాలను అనుమానితుల రిజిస్ట్రీలో పాల్గొంటున్న సంస్థలతో పంచుకున్నారు. రూ. 9518.91 కోట్ల విలువైన అక్రమ లావాదేవీలనూ తిరస్కరించారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన చట్టాలను అమలు చేసే సంస్థల మధ్య సమన్వయ వ్యవస్థను మెరుగుపరచడానికి, బహుళ అధికార పరిధి సమస్యలు ఉన్న సైబర్ నేరాల హాట్‌స్పాట్‌లు, కీలక ప్రాంతాల ఆధారంగా ఐ4సీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మేవాత్, జామ్తారా, అహ్మదాబాద్, హైదరాబాద్, చండీగఢ్, విశాఖపట్నం, గౌహతి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను చేర్చుకొని ఏడు సంయుక్త సైబర్ సమన్వయ బృందాలను (జేసీసీటీలను) ఏర్పాటు చేశారు.
సైబర్‌క్రైమ్ డేటా షేరింగ్, విశ్లేషణల కోసం చట్టాలను అమలు చేసే సంస్థలకు (ఎల్ఈఏలకు) ఒక మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎమ్ఐఎస్) ప్లాట్‌ఫామ్‌గా, డేటా రిపోజిటరీగా, సమన్వయ వేదికగా ఈ సమన్వయ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు. ఇది వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సైబర్‌క్రైమ్ ఫిర్యాదులతో ప్రమేయం ఉన్న నేరాలు, నేరస్థుల మధ్య విశ్లేషణల ఆధారిత అంతర్ రాష్ట్ర సంబంధాలను అందిస్తుంది. సంబంధిత అధికారులకు స్పష్టతనివ్వడానికి నేరస్థుల స్థానాలను, నేర మౌలిక సదుపాయాలను 'ప్రతిబింబ్' మాడ్యూల్ మ్యాప్‌పై చూపిస్తుంది. చట్టాలను అమలు చేసే సంస్థలు, ఐ4సీ, ఇతర ఎస్ఎమ్ఈల నుంచి సాంకేతిక-చట్టపరమైన సహాయాన్ని కోరడానికి, స్వీకరించడానికీ ఈ మాడ్యూల్ వీలు కల్పిస్తుంది. దీని ఫలితంగా 21,857 మందికి పైగా నిందితులను అరెస్టు చేయడంతో పాటు, సైబర్ దర్యాప్తు సహాయం కోసం 1,49,636కు పైగా అభ్యర్థనలు అందాయి.
2026 జనవరి 2న ఒక సమగ్ర ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్ఓపీని) కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ), పౌరుల ఆర్థిక సైబర్ మోసాల నివేదన-నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎమ్ఎస్)ల ద్వారా ఫిర్యాదులను నిర్వహించడానికి ఇది ఏకరీతి, బాధితుల-కేంద్రిత విధానాన్ని అందిస్తుంది. ఎన్‌సీఆర్‌పీ- సీఎఫ్‌సీఎఫ్ఆర్ఎమ్ఎస్ కోసం గల ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్ఓపీ)... ముఖ్యంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సహకారాన్ని పెంపొందించడానికి ఒక ప్రత్యేక సమన్వయ యంత్రాంగాన్ని వివరిస్తుంది. ఈ వ్యవస్థలో ఆయా రాష్ట్రాల పోలీసు ఏజెన్సీలు అంతర్భాగమై భాగస్వాములుగా ఉంటారు.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2244753)
సందర్శకుల సూచీ సంఖ్య : : 23