రైల్వే మంత్రిత్వ శాఖ
రైళ్ల సంధానాన్నీ, సామర్థ్యాన్నీ పటిష్ఠపరచడానికి గుజరాత్ లో కోశాంబ రైల్ ఓవర్ ఫ్లయ్ ఓవరుకూ, బీహార్లో భాగల్పూర్ బైపాస్‌కూ భారతీయ రైల్వే ఆమోద ముద్ర
• కీలక మార్గాల్లో రైళ్ల నిరంతరాయ, సురక్షిత రాకపోకల్ని దృష్టిలో పెట్టుకొని
రూ.647.58 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చ జెండా
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 11:38AM by PIB Hyderabad
పశ్చిమ రైల్వేలోనూ, తూర్పు రైల్వేలోనూ రెండు ముఖ్య రైల్వే మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు రైల్వేల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు అనుసంధానాన్ని పెంచడం, రద్దీని తగ్గించడంతో పాటు నిర్వహణ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఈ ప్రాజెక్టుల్లో.. గుజరాత్ లోని కోశాంబ-ఉమ్రపాద గేజ్ మార్పిడి సెక్షనుకు అనుసంధాన సదుపాయాన్ని సమకూర్చడానికి ఉద్దేశించిన కోశాంబ రైల్ ఓవర్ రైల్ (ఆర్ఓఆర్) ఫ్లయ్ఓవర్ నిర్మాణంతో పాటు, బీహార్‌లోని భాగల్పూరులో ఒక కొత్త రైలు ఉపమార్గాన్ని అభివృద్ధిపరచడం భాగంగా ఉన్నాయి.
పశ్చిమ రైల్వేలోని కోశాంబ-ఉమ్రపాద జీసీ సెక్షన్లో రైల్-ఓవర్-రైల్ (9.20 కి.మీ.)కి అనుమతి
కోశాంబ-ఉమ్రపాద గేజ్ మార్పిడి (జీసీ) సెక్షన్లో 9.20 కిలోమీటర్ల పొడవున ఒక రైల్-ఓవర్-రైల్ ఫ్లయ్ఓవరును నిర్మించడానికి భారతీయ రైల్వేలు ఆమోదం తెలిపింది. ఆర్ఓఆర్ నిర్మాణానికి రూ.344.38 కోట్లు ఖర్చు చేస్తారు. ముంబయి-వడోదరా ప్రధాన మార్గానికి తూర్పు దిశలో కోశాంబ-ఉమ్రపాద సెక్షను ఉంది. దీని గేజ్ మార్పిడి పనులను ఇప్పటికే కొంత పూర్తి చేశారు.
సరకు రవాణాకంటూ ప్రత్యేక కారిడార్‌ను ఏర్పరిచినందువల్ల, గేజ్ మార్పిడి చేసిన మార్గాన్ని ప్రధాన మార్గంతో నేరుగా నేల మీద నుంచి దాటి పోయేటట్టు సంధానించే వీలు లేదు. ఆమోదం తెలిపిన రైల్ ఓవర్ రైల్ ఫ్లయ్ఓవర్ ఈ సమస్యను పరిష్కరించి, జీసీ సెక్షనును ముంబయి-వడోదరా ప్రధాన మార్గంతో నిరాటంకంగా కలపడానికి దోహద పడుతుంది. దీంతో ఈ కీలక దారుల్లో రైళ్లు ఏ అడ్డంకీ లేకుండా సురక్షితంగా సాగిపోయేందుకు అవకాశం లభిస్తుంది. ఫలితంగా గేజ్ మార్పిడి ప్రాజెక్టు ప్రయోజనాలు సంపూర్ణంగా సిద్ధిస్తాయి.
తూర్పు రైల్వే పరిధిలో భాగల్పూర్ బైపాస్ (13.38 కి.మీ.)కి అనుమతి
రూ. 303.20 కోట్లతో తూర్పు రైల్వేలో 13.38 కిలోమీటర్ల పొడవున భాగల్పూర్ ఉపమార్గ నిర్మాణానికి కూడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ బైపాస్.. బారాహాత్-భాగల్పూర్ సెక్షన్లోని గోనుధామ్ మజిలీని భాగల్పూర్-సాహిబ్‌గంజ్ సెక్షన్లోని సాబూర్తో కలుపుతుంది. ఫలితంగా భాగల్పూర్ జంక్షన్లో రద్దీ తగ్గుతుంది.
ప్రస్తుతం, బారాహాత్-భాగల్పూర్ సెక్షన్లో సామర్థ్య ఉపయోగం 125 శాతానికి మించిపోయి, తీవ్ర రద్దీకి దారి తీస్తోంది. బారాహాత్-భాగల్పూర్, భాగల్పూర్-సాహిబ్‌గంజ్ సెక్షన్ల మధ్య తిరిగే రైళ్లు భాగల్పూర్లో ఇంజన్లను వెనక్కి మరలించుకోవాల్సివస్తోంది. ఇది ఆటంకానికీ, నిర్వహణ ప్రభావవంతంగా లేకపోవడానికీ కారణం అవుతోంది. ఇప్పుడు ఉపమార్గానికి ఆమోదం తెలిపినందువల్ల, సమయపాలనతోపాటు నిర్వహణ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడుతుంది.
ఈ మౌలిక సదుపాయాల పనులు గుజరాత్, బీహార్లలో రైలు ప్రయాణ సదుపాయాన్ని బలోపేతం చేసి, భద్రతను పెంచి, రద్దీని తగ్గించి రైళ్ల రాకపోకల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. దేశంలో నానాటికీ పెరుగుతున్న ప్రయాణికుల అవసరాల్నీ, సరకు రవాణా అవసరాల్నీ తీర్చేందుకు సామర్థ్యాన్ని పెంచడానికీ, నెట్వర్కు పరంగా రద్దీ తలెత్తకుండా చూడడానికీ రైల్వే శాఖ నిరంతర ప్రాధాన్యాన్ని ఇస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2244383)
సందర్శకుల సూచీ సంఖ్య : : 13