సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్న: ఆర్‌టీఐ చట్టాన్ని ఎంత సమర్థంగా అమలు చేస్తున్నారో గమనించడం

నాడు పోస్టు చేయడమైనది: 23 MAR 2026 3:14PM by PIB Hyderabad

ఆర్‌టీఐ దరఖాస్తుకు సమాధానం నిర్దేశిత కాల పరిమితి లోపల అందకపోయినా, లేదా ప్రభుత్వ సమాచార అధికారి (పీఐఓ) నిర్ణయంతో ఏకీభవించకున్నా దరఖాస్తుదారు ఫస్ట్ అపీలేట్ అథారిటీ ఎదుట అపీలు చేయడమో, కేంద్ర సమాచార సంఘం (సీఐసీ) ఎదుట రెండో విన్నపాన్ని సమర్పించడమో చేయవచ్చును. దీనికి అదనంగా, పీఐఓ ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా ఉన్నా, లేదా తప్పుదారి పట్టించేదిగా ఉన్నా, లేదా అసత్య సమాచారాన్ని ఇచ్చినట్లు భావించినా ఆయా కేసులను బట్టి సీఐసీకి గాని, రాష్ట్ర సమాచార సంఘాని (ఎస్ఐసీ)కి గాని నేరుగా ఫిర్యాదు చేయొచ్చు.
కేంద్ర ప్రభుత్వంలోని పబ్లిక్ అథారిటీల విషయంలో ఆర్‌టీఐ దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, ఎన్ని దరఖాస్తులకు సమాధానమిచ్చారు, దరఖాస్తుల్ని ఏయే కారణాలు చెప్పి తోసిపుచ్చారు వంటి వివరాలు సీఐసీ వద్ద సంబంధిత సంవత్సర వారీ వార్షిక నివేదికల రూపంలో అందుబాటులో ఉన్నాయి.  ఈ వివరాల్ని https://cic.gov.in/circular-reports-conventions లో చూడవచ్చును. ఆర్‌టీఐ దరఖాస్తుల తిరస్కరణ రేటు 2013-14 సంవత్సరంలో 7.21 శాతంగా ఉండగా, 2024-25 సంవత్సరంలో 3.26 శాతానికి తగ్గింది.

ఆర్‌టీఐ చట్ట ప్రణాళిక (ఫ్రేంవర్క్) ప్రభావశీలంగా అమలవుతోందీ లేనిదీ మదింపు చేయడానికి మదింపు, సమీక్షలు నిరంతరం కొనసాగుతున్నాయి. సంబంధిత పబ్లిక్ అథారిటీలు ప్రోయాక్టివ్ గానూ, సుమోటో పద్ధతిలోనూ వెల్లడించిన సమాచారాన్ని మూడో పక్షం ద్వారా పారదర్శక విధానంలో ఆడిట్ చేయాలంటూ మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. ఆడిట్ ప్రక్రియను చేపట్టాల్సిందిగా పబ్లిక్ అథారిటీలకు సూచించడంతో పాటు ఆడిట్ పారదర్శక విధానంలో పురోగమించేటట్లుగా సీఐసీ పర్యవేక్షిస్తుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర సైన్స్, టెక్నాలజీ, భూ విజ్ఞ‌ాన శాస్త్రాల శాఖ సహాయమంత్రి (స్వతంత్ర), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి విభాగం, అంతరిక్ష విభాగ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలియజేశారు.

 
***

(రిలీజ్ ఐడి: 2244039) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Urdu , Gujarati