వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
రిలీఫ్ (ఎగుమతి సౌలభ్యం కోసం పునరుద్ధరణ, వస్తు రవాణా చర్యలు)ను ఆమోదించిన ప్రభుత్వం
పశ్చిమాసియాలో సరుకు రవాణా అంతరాయాల నడుమ ఎగుమతిదారులకు దన్నుగా నిలిచేలా ఎగుమతి ప్రోత్సాహక మిషన్ కింద చర్యలు
సానుకూలమైన ఈపీఎం వ్యవస్థ వల్ల.. అసాధారణంగా పెరిగిన సరుకు రవాణా, బీమా వ్యయాలు, యుద్ధ సంబంధిత సంకటాలపై సకాలంలో స్పందించేందుకు అవకాశం
నాడు పోస్టు చేయడమైనది:
19 MAR 2026 2:20PM by PIB Hyderabad
ఇటీవలి పరిణామాలు, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి పరిసరాల్లో పెరిగిన భద్రతా ఆందోళనల వల్ల.. నౌకల ప్రయాణ మార్గాల మళ్లింపు, సుదీర్ఘ ప్రయాణ దూరాలు, సరుకు రవాణా మార్పిడి కేంద్రాల వద్ద రద్దీ, అత్యవసర ఘర్షణ వల్ల అదనపు ఛార్జీల విధింపు వంటి పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిణామాలు రవాణా వ్యయాన్ని పెంచడమే కాకుండా, ఆ ప్రాంతం గుండా లేదా ఆ ప్రాంతానికి వెళ్లే ఎగుమతి సరుకుల రవాణాలో అనిశ్చితిని కలిగించాయి.
పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ప్రస్తుత ధోరణులు, గల్ఫ్ ప్రాంతంలో నౌకా రవాణాపై వాటి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఎగుమతి ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం) కింద ‘రిలీఫ్ (ఎగుమతి సౌలభ్యం కోసం పునరుద్ధరణ, వస్తు రవాణా చర్యలు)’ పేరిట కార్యక్రమానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిర్దేశిత కాలపరిమితి, లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గల్ఫ్, విస్తృతమైన పశ్చిమాసియా సముద్ర మార్గాల్లో తలెత్తిన అంతరాయాల వల్ల అసాధారణంగా పెరిగిన సరుకు రవాణా ఖర్చులు, భారీగా పెరిగిన భీమా ప్రీమియంలు, యుద్ధ సంబంధిత ఎగుమతి సంకటాలతో ఇబ్బంది పడుతున్న భారతీయ ఎగుమతిదారులకు దన్నుగా నిలవడం దీని లక్ష్యం.
దేశ వాణిజ్య గమనానికి ఆటంకం కలిగించే బహిర్గత అంతరాయాలపై తక్షణం స్పందించడంలో ప్రభుత్వ అంకిత భావానికి ‘రిలీఫ్’ ఆమోదం నిదర్శనం.
ఈ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా ఏకమై చేపట్టిన సమన్వయ చర్యల్లో భాగంగా 2026 మార్చి 2న సరఫరా వ్యవస్థ పునరుద్ధరణపై ఒక అంతర మంత్రిత్వ శాఖల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బృందం 2026 మార్చి 3 నుంచి రోజువారీ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, ఆర్థిక సంస్థలు, రవాణా రంగ భాగస్వాములు, ఎగుమతిదారు సంఘాలను సమన్వయపరుస్తోంది. ఈ బృంద చర్చల ఆధారంగా పలు కార్యాచరణ చర్యలను ప్రభుత్వం అమలు చేసింది. నిలిచిపోయిన సరుకు రవాణాకు సంబంధించి నిబంధనల సడలింపు, ఓడరేవుల వద్ద మెరుగైన సమన్వయం, ప్రభావితమైన సరుకుపై ఓడరేవుల్లో స్టోరేజీ, వెయిటింగ్ చార్జీల మినహాయింపు వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. అలాగే సముద్ర మార్గాల్లో సరుకు రవాణా ధరల్లో పారదర్శకత కోసం సలహాలను అందించడంతోపాటు బీమా విషయంలో సంకటాలను, అంతర్గత రవాణా గమనాన్ని పర్యవేక్షించడం వంటి చర్యలను చేపట్టింది. క్షేత్రస్థాయి సవాళ్లను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి, నిర్దేశిత ఆర్థిక సంకటాలను తగ్గించేలా కార్యక్రమ రూపకల్పనకు ఈ సమన్వయ చర్యలు దోహదపడ్డాయి.
అంతరాయ కాలంలో ఇప్పటికే బయలుదేరిన సరుకు రవాణాతోపాటు, అనంతరం కూడా ప్రభావిత ప్రాంతాలకు ఎగుమతి చేయాలని చేసిన నిర్ణయాలకు కూడా ఉపయోగపడేలా రిలీఫ్ కార్యక్రమాన్ని రూపొందించారు. తద్వారా ఎగుమతి ప్రక్రియలోని అన్ని దశల్లోనూ ఇది అండగా ఉంటుంది.
ఆమోదిత విధివిధానాల ప్రకారం ధ్రువీకరణ, క్లెయిముల ప్రాసెసింగ్, నిధుల విడుదల, పర్యవేక్షణలో నోడల్, అమలు సంస్థగా... పూర్తిగా భారత ప్రభుత్వ (వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ) యాజమాన్యంలో ఉన్న ఈసీజీసీ లిమిటెడ్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. వాణిజ్య, రాజకీయ పరమైన ముప్పులతోపాటు యుద్ధ సంబంధిత అత్యవసర పరిస్థితులలను ఎగుమతి క్రెడిట్ రిస్క్ పరిధిలోకి తేవడంలో ఈసీజీసీకి విస్తృతమైన అనుభవముంది. ఇది నమ్మదగ్గ రీతిలో, సకాలంలో ఎగుమతిదారులకు సాయమందించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.
ఈ ప్రాంతంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్, ఇజ్రాయెల్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, ఇరాక్, ఇరాన్, యెమెన్ వంటి దేశాలకు నేరుగా పంపే లేదా ఆయా దేశాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే సరుకు రవాణాకు సంబంధించి.. రిలీఫ్ కార్యక్రమంలో కింద పేర్కొన్న మూడు పరస్పరాధారిత విభాగాలున్నాయి.
· మొదటిది – అర్హత కలిగిన సరుకు రవాణా కోసం ఇప్పటికే ఈసీజీసీ క్రెడిట్ ఇన్సూరెన్స్ పరిధిలో ఉన్న ఎగుమతిదారులు.. నిర్దేశిత కాలపరిమితిలో (2026 ఫిబ్రవరి 14 నుంచి 2026 మార్చి 15 వరకు) ప్రస్తుతమున్న బీమాకు అదనంగా 100 శాతం వరకు రిస్క్ కవరేజీ ప్రయోజనాన్ని పొందుతారు. దీనివల్ల అదనపు ఆర్థిక భారం లేకుండానే వారికి మెరుగైన రక్షణ లభిస్తుంది.
· రెండోది – వచ్చే మూడు నెలల కాలంలో (2026 మార్చి 16 నుంచి 2026 జూన్ 15 వరకు) ఎగుమతులు చేయాలని భావిస్తున్న ఎగుమతిదారులను.. ప్రభుత్వ మద్దతుతో ఈసీజీసీ బీమా పొందేలా ప్రోత్సహిస్తారు. ప్రస్తుతమున్న ఈసీజీసీ బీమాకు అదనంగా 95 శాతం వరకు రిస్క్ కవరేజీని ప్రభుత్వం కల్పిస్తుంది. రవాణా వ్యవస్థల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ.. ఎగుమతిదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి, అంతరాయం లేకుండా సరుకు రవాణా కొనసాగడానికి ఈ చర్య దోహదపడుతుంది.
· మూడోది – కొంతమంది ఎంఎస్ఎంఈ ఎగుమతిదారులకు (2026 ఫిబ్రవరి 14 నుంచి 2026 మార్చి 15 వరకు) క్రెడిట్ ఇన్సూరెన్స్ లేకపోవచ్చని ప్రభుత్వం గుర్తించింది. అసాధారణంగా పెరిగిన రవాణా ఖర్చులు, భీమా సర్‌చార్జీల భారాన్ని వారు కూడా ఎదుర్కొంటున్నందున.. వారి కోసం రిలీఫ్ కార్యక్రమంలో ఒక వెసులుబాటును కల్పించింది. దీని ప్రకారం ఈసీజీసీ బీమా లేని అర్హత కలిగిన ఎంఎస్ఎంఈ ఎగుమతిదారులు పాక్షికంగా రీయింబర్స్‌మెంటు (50శాతం వరకు) పొందే అవకాశం ఉంటుంది. నిర్దేశిత నిబంధనలు, పత్రాల ధ్రువీకరణ, ప్రకటించిన గరిష్ట పరిమితులకు (ఒక్కో ఎగుమతిదారునికి రూ. 50 లక్షల వరకు) లోబడి ఈ ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఘర్షణ కారణంగా అసాధారణంగా పెరిగిన రవాణా ఖర్చుల నుంచి ఎగుమతిదారులకు సకాలంలో ఉపశమనాన్ని అందించడం దీని ముఖ్యోద్దేశం.
ఎగుమతి ప్రోత్సాహక మిషన్ కింద ‘రిలీఫ్’ను అమలు చేయడం కోసం రూ. 497 కోట్ల ఆర్థిక వ్యయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. క్లెయిమ్‌ల పరిష్కారాన్నీ, నిధుల వినియోగాన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం.. డ్యాష్‌బోర్డ్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ఈసీజీసీ నిర్వహిస్తుంది. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా.. ఈ పథకం పనితీరును ఈపీఎం స్టీరింగ్ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. పరిస్థితులను బట్టి దీనిని సవరించడం, కొనసాగించడం లేదా ఉపసంహరించుకోవడం వంటి సిఫార్సులను ఈ కమిటీ చేయవచ్చు.
రవాణా వ్యవస్థలో అంతరాయాల వల్ల తక్షణ ప్రభావాన్ని తగ్గించడం, ఎగుమతిదారులలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, ఆర్డర్లు రద్దు కాకుండా చూడడం, ఎగుమతి ఆధారిత రంగాలలో ఉపాధిని కాపాడడం.. ‘రిలీఫ్’ ద్వారా ప్రభుత్వం ఆశిస్తున్న ప్రధాన లక్ష్యాలు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ వాణిజ్యంలో బలాన్నీ, పోటీతత్వాన్నీ నిలుపుకోవడంలో దేశ నిబద్ధతను కూడా ప్రభుత్వం చేపట్టిన ఈ చర్య చాటిచెబుతోంది.
ఈపీఎం కింద చేపట్టిన ‘రిలీఫ్’లోని ముఖ్యాంశాలు:
· ‘రిలీఫ్’కు ప్రభుత్వ ఆమోదం – ఎగుమతి ప్రోత్సాహక మిషన కింద.. ఎగుమతుల సౌలభ్యం కోసం పునరుద్ధరణ, సరుకు రవాణా చర్యలు (రెజిలియన్స్ అండ్ లాజిస్టిక్స్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్‌పోర్ట్ ఫెసిలిటేషన్).
· గల్ఫ్, పశ్చిమాసియా నౌకాయాన మార్గంలో రవాణా అంతరాయాలు, భారీగా వ్యయం పెరుగుదలపై స్పందిస్తూ, ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది.
· రిస్కు కవరేజీ, రీయింబర్స్‌మెంటు వ్యవస్థకు నోడల్ అమలు సంస్థగా ఈసీజీసీ వ్యవహరిస్తుంది.
· అర్హత కలిగిన గత సరుకు రవాణాతోపాటు అనంతర ఎగుమతులకు కూడా వర్తించేలా ‘రిలీఫ్’ను పథకాన్ని రూపొందించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ ఎగుమతిదారులకు చేయూతనివ్వడం దీని ప్రధాన లక్ష్యం.
· ఈపీఎం ద్వారా దీనికి నిధులందుతాయి. భౌగోళిక రాజకీయ పరిణామాలను బట్టి ఎప్పటికప్పుడు దీనిపై సమీక్షలు జరుగుతాయి.
***
(రిలీజ్ ఐడి: 2242695)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9