ప్రధాన మంత్రి కార్యాలయం
కువైట్ యువరాజుతో ప్రధానమంత్రి సంభాషణ
· ‘ఈద్’ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి... పశ్చిమాసియా పరిస్థితులపై ఉభయుల చర్చ
నాడు పోస్టు చేయడమైనది:
18 MAR 2026 6:18PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ కువైట్ యువరాజు మాననీయ షేక్ సబా అల్-ఖాలెద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయనకు ఈద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ప్రాంతీయ భద్రత పరిణామాలపై వారిద్దరూ సమీక్షించారు.
ఈ మేరకు పశ్చిమ ఆసియాలో ఇటీవలి పరిణామాలు, రోజురోజుకూ మారుతున్న పరిస్థితులపై శ్రీ మోదీ, యువరాజు ఇద్దరూ ఆందోళన వ్యక్తం చేస్తూ, పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. కువైట్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై దాడులను భారత్ ఖండిస్తున్నదని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత, స్వేచ్ఛాయుతమైన నౌకాయానానికి భరోసాయే అత్యంత ప్రాధాన్యాంశమని ఆయన స్పష్టం చేశారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం దిశగా నిరంతర దౌత్య సంబంధాలు అవసరమని నాయకులిద్దరూ అభిప్రాయపడ్డారు. కువైట్‌లోని భారతీయుల భద్రత, శ్రేయస్సును నిరంతరం పర్యవేక్షిస్తున్నందుకుగాను యువరాజుకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సమావేశం వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంచుకుంటూ:
“ఈ రోజు కువైట్ యువరాజు గౌరవనీయ షేక్ సబా అల్-ఖాలెద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాతో సంభాషించాను. ఈ సందర్భంగా ఈద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశాను.
అలాగే, పశ్చిమ ఆసియాలో పరిస్థితులపై మా అభిప్రాయాలను పంచుకుంటూ ఇటీవలి పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశాం. కువైట్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతపై దాడులను భారత్ ఖండిస్తున్నదని నేను పునరుద్ఘాటించాను. హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత, స్వేచ్ఛాయుత నౌకాయానానికి భరోసాయే మా అగ్ర ప్రాథమ్యం.
ప్రాంతీయ శాంతి, స్థిరత్వం దిశగా నిరంతర దౌత్య సంబంధాల ఆవశ్యకతపై మేం అంగీకారానికి వచ్చాం.
కువైట్‌లోని భారతీయుల భద్రత, శ్రేయస్సు దిశగా నిరంతర మద్దతుకుగాను ఆయనకు నేను ధన్యవాదాలు తెలిపాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2242220)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10