వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రైతులకు ఆదాయంతో పాటు భద్రతకూ గ్యారంటీ: లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్
పొగాకుకు బదులు వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తున్న కేంద్రం: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్
‘‘చిన్న కమతాలకు అధిక లాభాలు: ఏకీకృత వ్యవసాయ నమూనాలు సిద్ధంగా ఉన్నాయ’’న్న కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్
గోధుమ, ధాన్యం మొదలు పప్పుధాన్యాలు, నూనెగింజల వరకూ చూస్తే, ఎమ్ఎస్‌పీ పై చరిత్రాత్మక స్థాయిలో కొనుగోళ్లు: శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్
పంట బీమాలో విప్లవాత్మక సంస్కరణలు.. 21 రోజుల్లో పరిహారం, లేదంటే 12 శాతం వడ్డీ: శ్రీ శివ్‌రాజ్ సింగ్
‘‘నేను లంచాలు తీసుకోను, మరెవ్వరినీ తీసుకోనివ్వను’’...ఇదీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పం
కృషి రక్షక్ పోర్టల్‌తో అవకతవకలపై నేరుగా చర్యలుంటాయన్న శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 3:51PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుని రైతుల ఆదాయానికీ, భద్రతకీ అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చిందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఈ రోజు అన్నారు. ఆ చర్యల్లో.. పొగాకు వంటి హానికర పంటలకు బదులు లాభదాయక ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం, కనీస మద్దతు ధర (ఎమ్ఎస్‌పీ) కు చరిత్రాత్మక స్థాయిలో సేకరణ చేపట్టడం, పంట బీమా పథకంలో విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టడంతో పాటు ఖచ్చితమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయని ఆయన వివరించారు.

లోక్‌సభలో పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు శ్రీ చౌహాన్ సమాధానాన్నిస్తూ, కేంద్రం రైతుల్ని పొగాకు సాగును వదిలేయాల్సిందిగా కోరడమే కాకుండా, పొగాకును పండిస్తున్న ప్రాంతాల్లో లాభసాటి, ప్రత్యామ్నాయాలను కూడా గుర్తించిందన్నారు. ఈ ప్రత్యామ్నాయ పంటల్లో మిశ్ర జాతి మొక్కజొన్న, మిరప, చిలగడదుంప, పత్తి, బంగాళదుంప, చియా, ఫీడ్ బీన్స్, , బొబ్బర్లు/అలసందలు, రాగి, ఎర్ర పప్పు, చెరకు, సోయ్బీన్, జొన్న, వేరుసెనగ వంటివి కొన్ని.. వీటిని పండిస్తే రైతులకు సంపాదన సురక్షితంగా ఉంటుందన్నారు.
దేశంలో ఎక్కువ మంది రైతుల దగ్గర చిన్న కమతాలు ఉన్నాయనీ, ఈ స్థితిలో చిన్న రైతులు కేవలం ఒకే పంటపై ఆధారపడడం నష్టంతో కూడుకొని ఉంటుందనీ కేంద్ర మంత్రి అన్నారు. ఈ కారణంగా ప్రభుత్వం ఏకీకృత సాగు (ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్)కు సంబంధించిన అనేక నమూనాలను సిద్ధం చేసి వివిధ రాష్ట్రాల్లో వాటి ప్రదర్శన ప్రక్రియను మొదలుపెట్టిందని ఆయన చెప్పారు. ఈ నమూనాల్లో భాగంగా రైతులు తృణధాన్యాలు (గోధుమ, ధాన్యం), కాయగూరలు, పండ్లు, పశువుల పెంపకం, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, మేకల పెంపకం, వ్యవసాయ క్షేత్రాల్లో వనాల పెంపకం (అగ్రో-ఫారెస్ట్రీ) వంటి కార్యకలాపాలను చేపట్టవచ్చన్నారు. ఈ కార్యకలాపాలను ఒకే సారి అనుసరిస్తూ, ఏడాది పొడవునా నిలకడ కలిగిన, మెరుగైన ఆదాయాన్ని సంపాదించగలుగుతారని ఆయన అన్నారు.
రైతులకు ఉత్పాదన తాలూకు గిట్టుబాటు ధరలను ఇప్పించడానికి గోధుమ, ధాన్యం, నూనెగింజలు సహా ప్రధాన పంటల కనీస మద్దతు ధరను (ఎమ్ఎస్‌పీ) పెంచామనీ, ప్రస్తుత సీజన్లో ఎమ్ఎస్‌పీ పై పంటలను చరిత్రాత్మక స్థాయిలో సేకరిస్తున్నామనీ మంత్రి తెలిపారు. కందులు, ఎర్ర కందిపప్పు, మినప్పప్పు వంటి పప్పుధాన్యాల పంటలకు రైతులు నమోదు పూర్తి చేసుకొని ఎంత పంటను విక్రయించడానికి తీసుకు వచ్చినప్పటికీ, ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయడానికి కట్టుబడి ఉందనీ, దీంతో పప్పులను పండించే రైతులకు చెప్పుకోదగిన సహాయం లభించిందనీ మంత్రి వివరించారు.
ఇదివరకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రైతులు పరిహారాన్ని అందుకోవడానికి నెలల తరబడి ఎదురుచూడాల్సివచ్చేదని కేంద్ర వ్యవసాయ మంత్రి అన్నారు. ఏమైనా, ప్రభుత్వం నియమావళిలో సమగ్ర సవరణలను ప్రవేశపెట్టి, ఒక్క రైతు పంటకైనా సరే నష్టం వస్తే బీమా కంపెనీ ఆ నష్టానికి తప్పనిసరిగా పరిహారాన్ని ఇచ్చేలా చూసిందన్నారు.
దిగుబడికి సంబంధించిన సమాచారం అందాక, 21 రోజుల లోపలే రైతు ఖాతాలో బీమా క్లెయిము సొమ్ము జమ కాలేదంటే, అలాంటప్పుడు బీమా కంపెనీలూ, రాష్ట్ర ప్రభుత్వాలూ .. ఈ రెండు పక్షాలూ కూడా.. 12 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆలస్యం కారణంగా నష్టపోయే అగత్యం రైతులకు ఉండదనీ, వారు ఇటు పంటా నష్టపోయి అటు పరిహారమూ జాప్యమయ్యి.. ఇలా రెండు రకాల దెబ్బల్ని సహించనక్కర్లేకుండా పోతుందనీ మంత్రి అన్నారు.
‘‘నేను లంచాలు తీసుకోను, మరెవ్వరినీ తీసుకోనివ్వను’’ అన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగానే, పంట బీమాలోగాని ఇతర పథకాల్లో గాని ఏవైనా అవకతవకలుంటే సహించబోమని శ్రీ చౌహాన్ స్పష్టం చేశారు. కృషి రక్షక్ పోర్టల్ సహా డిజిటల్ వేదికల ద్వారా అందిన ఫిర్యాదులను గంభీరంగా పరిశీలిస్తున్నారనీ, ఎక్కడ అక్రమాలు జరిగినట్లు తేలినా చర్య తీసుకుంటారన్నారు.
వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా రాజస్థాన్లో ఇటీవల కొన్నేళ్లలో రైతుల ఖాతాలలోకి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్..డీబీటీ) వ్యవస్థ ద్వారా వేల కోట్ల రూపాయలను నేరుగా జమ చేశారని మంత్రి అన్నారు. ఇది రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం దృఢ నిబద్ధతతో ఉందనీ, సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు పెద్దపీట వేస్తోందని చాటిచెబుతోందనీ ఆయన అన్నారు.
ప్రభుత్వ విశాల దృష్టికోణాన్ని శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ పునరుద్ఘాటిస్తూ, ఈ కార్యక్రమాలన్నీ ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయన్నారు. ఈ వ్యవస్థ రైతులకు మెరుగైన ఆదాయానికి హామీని ఇవ్వడంతో పాటు నష్టభయాల నుంచి వారికి రక్షణను కూడా అందిస్తుందనీ, ఇది దేశంలో ఆటుపోటులకు తట్టుకొని నిలిచే, స్వయంసమృద్ధ వ్యవసాయ రంగానికి పునాదిని పటిష్ఠపరుస్తుందనీ ఆయన తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2241496)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18