పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
అయిదు రాష్ట్రాల్లో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,789 కోట్లకు పైగా 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిన కేంద్రం
ఛత్తీస్‌ఘడ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల్లోని పీఆర్ఐలకు లబ్ధి
నాడు పోస్టు చేయడమైనది:
17 MAR 2026 2:48PM by PIB Hyderabad
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఛత్తీస్‌ఘడ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల్లోని పంచాయతీ రాజ్ సంస్థ (పీఆర్ఐ)లు/గ్రామీణ స్థానిక సంస్థ (ఆర్ఎల్‌బీ)లకు పదిహేనవ ఆర్థిక సంఘం (XV-ఎఫ్‌సీ) షరతులు లేని నిధులు (అన్‌టైడ్ గ్రాంట్స్)ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామీణ స్థానిక పరిపాలన వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే వివిధ ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి విడుదల చేసిన ఈ నిధుల లక్ష్యం.
ఛత్తీస్‌ఘడ్‌లోని అర్హత కలిగిన 33 జిల్లా పంచాయతీ (డీపీ)లు, 146 బ్లాక్ పంచాయతీ (బీపీ)లు, 11,693 గ్రామ పంచాయతీ (జీపీ)లకు రెండో విడత కింద రూ.232.60 కోట్ల అన్‌టైడ్ నిధులు విడుదలయ్యాయి. దీనికి అదనంగా, ఒక డీపీ, 8 బీపీలు, 350 జీపీలకు సంబంధించి మొదటి విడతలో నిలిపివేసిన రూ.8.0238 కోట్లను విడుదల చేశారు. అదేవిధంగా, గుజరాత్లో 33 డీపీలు, 247 బీపీలు, 14,563 జీపీలకు రెండో విడతగా రూ.509.2177 కోట్లు విడుదలయ్యాయి. వీటితో పాటు మరో రెండు గ్రామ పంచాయతీలకు గతంలో నిలిపివేసిన రూ.14.64 లక్షల నిధులు కూడా విడుదలయ్యాయి.
మధ్యప్రదేశ్‌లోని 51 డీపీలు, 296 బీపీలు, 22,914 జీపీలకు మొదటి విడత షరతులు లేని నిధుల కింద రూ.630.6454 కోట్లు విడుదలయ్యాయి. వీటితో పాటుగా 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత సాధించిన 21 డీపీలు, 106 బీపీలు, 834 జీపీలకు మొదటి, రెండో విడతల్లో నిలిపివేసిన నిధుల నుంచి రూ.104.6556 కోట్లు విడుదలయ్యాయి. తెలంగాణాలోని 12,702 జీపీలకు రెండో విడతగా (2024-25 ఆర్థిక సంవ్సతరానికి) రూ.256.2101 కోట్లు విడుదలయ్యాయి. మహారాష్ట్ర విషయానికి వస్తే.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిలిపివేసిన మొదటి, రెండో విడతల నిధుల నుంచి రూ.151.1856 కోట్లు విడుదలయ్యాయి. వీటి వల్ల 12 డీపీలు, 125 బీపీలు, 324 జీపీలకు లబ్ధి చేకూరుతుంది.
పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, జల శక్తి మంత్రిత్వ శాఖ (తాగు నీరు, పారిశుద్ధ్య విభాగం) ద్వారా పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక ఆర్థిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రాలకు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేస్తుంది. అనంతరం ఆర్థిక శాఖ వీటిని విడుదల చేస్తుంది. సిఫారసు చేసిన విధంగా కేటాయించిన నిధులు ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా విడుదలవుతాయి. రాజ్యాంగంలోని పదకొండో షెడ్యూల్లో పొందుపరిచిన ఇరవై తొమ్మిది అంశాల పరిధిలో స్థానిక నిర్ధిష్ట అవసరాల కోసం అన్‌టైడ్ గ్రాంట్లను ఆర్ఎల్‌బీలు ఉపయోగిస్తాయి. జీతాలు, ఇతర సంస్థాగత ఖర్చులు దీనిలో భాగం కాదు. దిగువ పేర్కొన్న ప్రాథమిక సేవలకు షరతులతో కూడిన నిధులను (టైడ్ గ్రాంట్స్) ఉపయోగిస్తారు.
(ఎ) పారిశుద్ధ్యం, ఓడీఎఫ్ హోదా నిర్వహణ – దీనిలో గృహ వ్యర్థాల నిర్వహణ, శుద్ధి, మానవ విసర్జితాల నిర్వహణ ఉండాలి.
(బి) తాగునీటి సరఫరా, వర్షపు నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం.
***
(రిలీజ్ ఐడి: 2241491)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9