రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

మాజీ సైనికోద్యోగులకు ఢిల్లీలో ఉద్యోగ మేళాను నిర్వహించనున్న డీజీఆర్

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 11:38AM by PIB Hyderabad

మాజీ సైనికోద్యోగులను పౌర సమాజ శ్రమశక్తిలో భాగస్తులను చేయడంలో సహాయపడే ఒక ముఖ్య కార్యక్రమం ఇది. పూర్వ సైనికోద్యోగులకు ఉద్యోగ మేళాను మాజీ సైనికోద్యోగుల సంక్షేమ విభాగం (ఎమ్ఓడీ)కి చెందిన డైరెక్టరేట్ జనరల్ రీసెటిల్మెంట్ (డీజీఆర్) 2026 మార్చి నెల 20న న్యూఢిల్లీలో నిర్వహించనుంది.
ఈ ఉద్యోగ మేళా భారతీయ సైన్య, నౌకాదళ, వైమానిక దళ మాజీ సైనికోద్యోగులు సెక్యూరిటీ, ఐటీ, పరిపాలన, ఆధునిక రవాణా వ్యవస్థ, ఆరోగ్యసంరక్షణ, ఇంజినీరింగ్‌ల వంటి వివిధ రంగాల్లోని అగ్రగామి కార్పొరేట్ సంస్థలతోనూ, పరిశ్రమల ఎంప్లాయర్లతోనూ సంధానం కావడానికి ఒక డెడికేటెడ్ ప్లాట్‌ఫారంగా పనిచేస్తుంది.
మాజీ సైనికోద్యోగుల పునరావాసం పట్ల, వారి సంక్షేమం పట్ల రక్షణ శాఖ లోని పూర్వ సైనికోద్యోగుల విభాగం (ఎమ్ఓడీ) చాటుకొంటున్న నిరంతర నిబద్ధతకు ఈ కార్యక్రమం అద్దం పడుతోంది. మాజీ సైనికోద్యోగుల క్రమశిక్షణకీ, నాయకత్వ ప్రతిభకీ, సాంకేతిక ప్రావీణ్యాలకీ తగిన గుర్తింపు దక్కేటట్లు చేయాలన్నదే ఎమ్ఓడీ ఉద్దేశంగా ఉంది. ఈ మూడు అంశాలకీ పౌర సమాజ ఉద్యోగ మార్కెట్టులో విలువ అధికంగా ఉంది. డీజీఆర్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ అంతటా వివిధ ప్రాంతాల్లో మాజీ సైనికోద్యోగుల కోసం 18 రోజ్‌గార్ మేళాల్ని నిర్వహించదలచింది. వాటిలో 17 జాబ్ మేళాల్ని ఇప్పటికే ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, లఖ్‌నవూ, వారణాసి, కోల్‌కతా, సికిందరాబాద్, జమ్మూ, భోపాల్, కొచ్చి, గువాహాటీ, డెహ్రాడూన్, బెంగళూరు, పుణే, చండీగఢ్‌లలో నిర్వహించారు.
మాజీ సైనికోద్యోగులు తమ ప్రతిభను నియామక నిర్వహణదారుల ఎదుట కనబరచాల్సివుంటుంది. పూర్వ సైనికోద్యోగులందించే విశిష్ట తోడ్పాటును నియామక నిర్వహణదారులు సహజంగానే అర్థం చేసుకొని, అభినందిస్తుంటారు. నమోదు ప్రక్రియ పూర్తి చేసిన తరువాత ఎంప్లాయర్లకు అంకిత భావం కలిగిన, చేయి తిరిగిన, అప్పజెప్పిన పనిని వృత్తిపరమైన ప్రావీణ్యంతో నెరవేర్చగలిగిన అభ్యర్థుల రెజ్యూమేలను పరిశీలించే అవకాశం లభిస్తుంది. ఎంప్లాయర్లు ఉద్యోగ మేళా కాలంలో ముందుగానే తాత్కాలికంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలనూ, ఎంపిక ప్రక్రియనూ చేపట్టవచ్చును.
ఎంప్లాయర్లకూ, మాజీ సైనికోద్యోగులకూ  www.esmhire.com లో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఇది కృత్రిమ మేధ (ఏఐ) ద్వారా నిర్వహించే జాబ్ ప్లాట్‌ఫారమ్. దీనిని ప్రత్యేకంగా మాజీ సైనికోద్యోగులను దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దారు. రిజిస్ట్రేషన్ కోసం లింకును డీజీఆర్ వెబ్‌సైటు  www.dgrindia.gov.in లో ఉద్యోగ మేళా బటన్‌ ద్వారా అందుబాటులో ఉంచారు. రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ప్రస్తుతం మాజీ సైనికుల (ఈఎస్ఎమ్)తో పాటు ఎంప్లాయర్లకు కూడా తెరచి ఉంచారు. రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి రుసుమునూ చెల్లించనక్కరలేదు.
తేదీ, సమయం: 20 మార్చి 2026, ఉదయం 7:00 గంటల నుంచి
స్థలం:  ఆరావళి ఆడిటోరియమ్, శంకర్ విహార్ మెట్రో స్టేషన్ దగ్గర, ఢిల్లీ కంటోన్మెంట్,
న్యూఢిల్లీ-110010
మరింత సమాచారం కోసం సంప్రదించగలరు:-
డైరెక్టరు (ఎస్ఈ) డీజీఆర్ : dirsedgr@desw,gov.in | Phone: 011-20862532
సంయుక్త డైరెక్టరు (ఎస్ఈ) డీజీఆర్ :  seopadgr@desw.gov.in | ఫోన్: 011-20863432

 

***


(రిలీజ్ ఐడి: 2240638) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी