బొగ్గు మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలో రెండు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు భూమిపూజ నిర్వహించిన బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి
ముర్పార్ గని మూసివేతపై మైన్ క్లోజర్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో సమీక్ష
నాడు పోస్టు చేయడమైనది:
14 MAR 2026 7:26PM by PIB Hyderabad
మహారాష్ట్ర పర్యటనలో నేడు రెండవ రోజున కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, చంద్రపూర్‌లో రెండు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు భూమి పూజ నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముర్పార్ గని మూసివేత స్థలంలో జరుగుతున్న కార్యకలాపాలను శ్రీ కిషన్ రెడ్డి సమీక్షించారు. అనంతరం చిమూర్ వద్ద సంబంధిత భాగస్వాములతో కలిసి మైన్ క్లోజర్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
భూమి పూజ నిర్వహించిన ఈ రెండు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు భారత ప్రభుత్వ పథకం కింద ఆర్థిక ప్రోత్సాహకాలు పొందేందుకు ఎంపికైన ఏడు ప్రాజెక్టులలో ఉన్నాయి. ఈ రెండింటిలో ఒకటైన గ్రేటా ఎనర్జీ సంస్థ నిర్మిస్తున్న గ్యాసిఫికేషన్ టెక్నాలజీ ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. సుమారు 130 ఎకరాల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. 0.4 ఎంటీపీఏ సామర్థ్యం కలిగిన ఈ స్వతంత్ర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ (ఐఎస్పీ) రోజుకు 1490 టన్నుల సామర్థ్యం కలిగిన కార్బన్ క్యాప్చర్ అండ్ యుటిలైజేషన్ సిస్టమ్ (సీసీయూఎస్)ను కలిగి ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ కాంప్లెక్స్‌లో 'కోల్ గ్యాసిఫికేషన్ ఐలాండ్' ఉంటుంది, ఇది డైరెక్ట్ రిడ్యూస్డ్ ఐరన్ (డీఆర్ఐ) ఉత్పత్తి కోసం బొగ్గు ఆధారిత సిన్‌గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది.
రెండవ ప్రాజెక్టు న్యూ ఎరా క్లీన్‌టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన 'సమగ్ర బొగ్గు గ్యాసిఫికేషన్, క్లీన్ ఫ్యూయల్స్ (స్వచ్ఛమైన ఇంధనాలు)' ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు స్వదేశీ బొగ్గును ఎరువులు, మైనింగ్, టెక్స్‌టైల్స్, ప్యాకేజింగ్ వంటి వివిధ రంగాలలో ఉపయోగించే కీలకమైన పారిశ్రామిక రసాయనాలు, ఇంధనాలుగా మారుస్తుంది. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఏటా 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల పైగా బొగ్గును ప్రాసెస్ చేస్తాయని అంచనా.
కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇంధన స్వయం సమృద్ధి, పారిశ్రామిక అభివృద్ధి, వికసిత భారత్ లక్ష్యాల సాధనలో బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక ముఖ్యమైన ఆధారంగా మారుతోందని అన్నారు. మంజూరైన 7 బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులలో 4 మహారాష్ట్రలోనే రాబోతున్నాయని ఆయన తెలిపారు. బొగ్గు గ్యాసిఫికేషన్ వల్ల దిగుమతులు తగ్గడమే కాకుండా, విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని, పారిశ్రామిక సరఫరా వ్యవస్థలు బలోపేతం అవుతాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ రెండు ప్రాజెక్టులలో రూ. 10,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 2,000మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అంతకంటే ఐదు రెట్లు ఎక్కువమందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని శ్రీ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు నిర్ణీత గడువులోగా ఉత్పత్తిని ప్రారంభిస్తాయని, బాధ్యతాయుతమైన మైనింగ్, స్వచ్ఛమైన బొగ్గు సాంకేతికతలలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన ముర్పార్ అండర్ గ్రౌండ్ మైన్ (భూగర్భ గని) మూసివేత స్థలాన్ని కూడా మంత్రి శ్రీ కిషన్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ గనిలో బొగ్గు ఉత్పత్తి 2003లో ప్రారంభమైంది. అయితే, ఈ ప్రాంతాన్ని తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ కు చెందిన పర్యావరణ సున్నిత ప్రాంతం (ఎకో-సెన్సిటివ్ జోన్) గా ప్రకటించడంతో, 2022లో ఈ గనిని మూసివేశారు.
ఈ సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గని మూసివేత అనేది ఒక ప్రాజెక్టు ముగింపు కాదని, సుస్థిరాభివృద్ధి దిశగా ఒక కొత్త ఆరంభమని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడానికి, గనులు తవ్విన ప్రాంతంలో సహజ వనరులను సంరక్షించడానికి గని మూసివేత ప్రక్రియను శాస్త్రీయంగా, క్రమపద్ధతిలో అమలు చేయాలని ఆయన చెప్పారు. గని మూసివేత ప్రణాళికల్లో స్థానిక వర్గాల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న వివిధ చొరవల ద్వారా, మూసివేసిన గనులను సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణ పరంగా ఉపయోగకరమైన ఆస్తులుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
ముర్పార్ భూగర్భ గని గురించి వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ హరీష్ దుహన్ మాట్లాడుతూ, ఈ గని ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 9,95,926 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఈ గనికి సంబంధించిన తుది గని మూసివేత ప్రణాళిక)ను సంస్థ బోర్డు 2026, జనవరి 19న ఆమోదించింది. ఈ గనిలో పనిచేస్తున్న సుమారు 426 మంది ఉద్యోగులను ఉమ్రేర్ ప్రాంతంలోని ఇతర గనులకు బదిలీ చేసినట్లు ఆయన వివరించారు.
నిబంధనల ప్రకారం ముర్పార్ గనిలోని అన్ని మైనింగ్ మౌలిక సదుపాయాలను తొలగించడం జరిగింది. అయితే, జిల్లా యంత్రాంగం సిఫార్సు మేరకు మేనేజర్ కార్యాలయం, క్యాంటీన్ భవనాన్ని సామాజిక అవసరాల కోసం అలాగే ఉంచారు. గని మూసివేతకు సంబంధించిన అన్ని భౌతిక పనులు, మూడేళ్లపాటు నిర్వహించాల్సిన పర్యావరణ పర్యవేక్షణ కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. జబల్‌పూర్‌లోని ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (టీఎఫ్ఆర్ఐ) సహకారంతో 2026 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య గని ప్రాంతంలోని ఐదు హెక్టార్ల భూమిలో అడవుల పెంపకం పనులు చేపట్టనున్నారు. అలాగే, సమీప గ్రామాల ప్రజల కోసం ఎనిమిది ఉచిత ఆరోగ్య శిబిరాలను నిర్వహించగా, సుమారు 715 మంది లబ్ధి పొందారు.
చంద్రపూర్ జిల్లా యంత్రాంగం 2025, జూన్ 12న మైన్ క్లోజర్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. దీని ద్వారా గని మూసివేత తర్వాత ఆ ప్రాంత సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, స్థానిక వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. దీనితో పాటు, గని మూసివేత వల్ల కలిగే సామాజిక ప్రభావాలను అధ్యయనం చేయడానికి, సామాజిక అభివృద్ధి, జీవనోపాధి ప్రణాళిక)ను రూపొందించడానికి 'సోషల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్' ప్రక్రియను కూడా ప్రారంభించారు.
గని మూసివేత స్థలాన్ని సందర్శించిన అనంతరం శ్రీ కిషన్ రెడ్డి చిమూర్ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, మైన్ క్లోజర్ అడ్వైజరీ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ మైన్ క్లోజర్ నోడల్ ఆఫీసర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కన్సల్టెంట్లు, స్థానిక గ్రామ ప్రతినిధులు పాల్గొన్నారు. గని మూసివేత తర్వాత ఆ ప్రాంత సమగ్ర, సుస్థిరాభివృద్ధి గురించి ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సనోజ్ కుమార్ ఝా, కోల్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ శ్రీ బి. సాయిరాం, బొగ్గు మంత్రిత్వ శాఖ, సీఐఎల్, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బొగ్గు మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో, కోల్ ఇండియా లిమిటెడ్, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ వంటి దాని అనుబంధ సంస్థలు శాస్త్రీయ పద్ధతుల్లో గని మూసివేత రంగంలో నిరంతర కృషి చేస్తున్నాయి. దేశ ఇంధన భద్రతతో పాటు, పర్యావరణంపై ఎక్కువ ప్రభావం పడకుండా బొగ్గు మంత్రిత్వ శాఖ నిబద్ధతతో పని చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2240430)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12