విద్యుత్తు మంత్రిత్వ శాఖ
పరిశ్రమల పోటీతత్వాన్ని పెంపొందించడానికి, స్వీయ వినియోగ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థను
బలోపేతం చేయడానికి విద్యుత్ నిబంధనలను సవరించిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
14 MAR 2026 6:13PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం విద్యుత్ (సవరణ) నిబంధనలు- 2026ను నోటిఫై చేసింది. దీని ద్వారా స్వీయ వినియోగ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల (క్యాప్టివ్ పవర్ జనరేటింగ్ ప్లాంట్ల - సీజీపీ)కు సంబంధించిన 2005 నాటి విద్యుత్ నిబంధనలలోని రూల్ 3ని సవరించింది. వివరణాత్మక అస్పష్టతలను తొలగించడం, పరిశ్రమలకు వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడం, స్వీయ వినియోగ విద్యుత్ వ్యవస్థను భారతదేశ ఇంధన మార్పు, పారిశ్రామిక వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా మార్చడం ఈ సవరణల ప్రధాన ఉద్దేశ్యం.
2003 నాటి విద్యుత్ చట్టం ప్రకారం స్వీయ వినియోగ విద్యుత్ ఉత్పత్తి ఒక కీలకమైన వెసులుబాటు. పరిశ్రమలకు నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్ సరఫరాను అందించడంలో స్వీయ వినియోగ విద్యుత్ ఉత్పత్తి ఒక ముఖ్యమైన యంత్రాంగమని 2005 నాటి జాతీయ విద్యుత్ విధానం గుర్తించింది. విద్యుత్ సరఫరాలో అడ్డంకులను అధిగమించడానికి, విద్యుత్ ధరల హెచ్చుతగ్గులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ విధానం పరిశ్రమలకు తోడ్పడుతూ, పారిశ్రామిక వృద్ధికి వెన్నుదన్నుగా నిలిచింది.
సుస్థిర లక్ష్యాలను చేరుకోవడానికి, ఖర్చులను తగ్గించుకోవడానికి భారతీయ పరిశ్రమలు శిలాజ ఇంధనేతర ఇంధన వనరుల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో, పారిశ్రామిక పోటీతత్వాన్ని పెంపొందించడానికి, భారత దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడానికి స్వీయ వినియోగ విద్యుత్ ఉత్పత్తి కోసం స్పష్టమైన, అంచనా వేయదగిన, అమలు చేయగల వ్యవస్థను రూపొందించడం చాలా కీలకం.
వినియోగ కేంద్రానికి వీలైనంత దగ్గరగా విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం వల్ల ప్రసార నష్టాలు తగ్గుతాయి. వ్యవస్థ సామర్థ్యం పెరుగుతుంది. గ్రిడ్ పటుత్వం బలపడుతుంది. అందువల్ల, ఈ సవరణలు నిర్వహణ, యాజమాన్యం, వినియోగానికి సంబంధించిన చట్టబద్ధమైన రక్షణలను కొనసాగిస్తూనే, స్వీయ వినియోగ విద్యుత్ ఉత్పత్తి నిబంధనల అమలులో స్పష్టతను అందిస్తాయి.
విద్యుత్ (సవరణ) నిబంధనలు-2026ను ప్రవేశపెట్టడం ద్వారా స్వీయ వినియోగ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నియంత్రణ వ్యవస్థలో మరింత స్పష్టత, సౌలభ్యాన్ని కల్పించారు. దీనివల్ల పరిశ్రమలు సొంత అవసరాల కోసం విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం మరింత సులభతరం అవుతుంది. ఆధునిక కార్పొరేట్ నిర్మాణాలు, మారుతున్న పారిశ్రామిక ఇంధన అవసరాలకు అనుగుణంగా స్వీయ వినియోగ విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని మార్చడానికి ఈ సవరణలను ఉద్దేశించారు. ముఖ్యంగా, కంపెనీలు శిలాజ ఇంధనేతర ఆధారిత స్వీయ వినియోగ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులలో పెట్టుబడులు పెంచుతున్న తరుణంలో ఇవి చాలా కీలకం. యాజమాన్య నిబంధనలను స్పష్టం చేయడం, గ్రూప్ క్యాప్టివ్ ఏర్పాట్ల కోసం నియమాలను సరళీకరించడం, స్పష్టమైన ధృవీకరణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, నియంత్రణ పరమైన అస్పష్టతలను వివాదాలను తగ్గించడం ఈ సవరణల ప్రధాన లక్ష్యం. నిబంధనల్లోని అనేక అంశాల అమలును సులభతరం చేసేలా సరళీకరించారు. ముఖ్యంగా, క్యాప్టివ్ హోదా ధ్రువీకరణ పెండింగ్‌లో ఉన్న సమయంలో పంపిణీ సంస్థలు వినియోగదారులపై అదనపు ఛార్జీలు విధించకుండా ఉండేలా ఒక కొత్త నిబంధనను చేర్చారు. మొత్తంమీద, ఈ సవరణలు వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందిస్తాయని, స్వీయ వినియోగ విద్యుత్ ఉత్పత్తి ద్వారా పరిశ్రమలు నమ్మకంగా, తక్కువ ధరకే విద్యుత్తును పొందేలా చేస్తాయని భావిస్తున్నారు. ఇవి నియంత్రణ పరమైన అస్పష్టతలను, వివాదాలను తగ్గించడమే కాకుండా, క్యాప్టివ్ , శిలాజ ఇంధనేతర ఇంధన ప్రాజెక్టులలో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించే అవకాశం ఉంది.
వాటాదారులు/సంబంధిత వర్గాలతో విస్తృతంగా చర్చలు జరిపిన అనంతరమే ఈ సవరణలను ఖరారు చేశారు.
సవరణలలోని ముఖ్యాంశాలు
1. యాజమాన్య నిబంధనల స్పష్టమైన నిర్వచనం
స్వీయ వినియోగ విద్యుత్ ప్లాంట్‌ను స్థాపించే సంస్థ కు చెందిన అనుబంధ సంస్థలు, హోల్డింగ్ కంపెనీలు, ఆ హోల్డింగ్ కంపెనీకి చెందిన ఇతర అనుబంధ సంస్థలను కూడా యాజమాన్య పరిధిలోకి చేరుస్తూ నిబంధనలను స్పష్టం చేశారు. విద్యుత్ ఆస్తులను తరచుగా గ్రూప్ సంస్థలు లేదా స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా అభివృద్ధి చేసే ఆధునిక కార్పొరేట్ నిర్మాణాలను ఈ సవరణ గుర్తిస్తుంది. కేవలం సంస్థాగత నిర్మాణం కారణంగా కార్పొరేట్ గ్రూపులు చేసే చట్టబద్ధమైన క్యాప్టివ్ పెట్టుబడులకు 'క్యాప్టివ్ హోదా' నిరాకరించకుండా ఈ సవరణ భరోసా ఇస్తుంది.
2. ఏకరీతి ధ్రువీకరణ కాలం
క్యాప్టివ్ హోదా ధృవీకరణను ఇకపై మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దీనివల్ల నిబంధనల అమలులో స్పష్టత, ఏకరూపత వస్తుంది. ఒకవేళ క్యాప్టివ్ పవర్ ప్లాంట్‌ను ఒక ఆర్థిక సంవత్సరం మధ్యలో కొనుగోలు చేసినా లేదా యాజమాన్యం ముగిసినా (మొదటి లేదా చివరి సంవత్సరం), ఆ ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్ యాజమాన్యంలో ఉన్న సంబంధిత కాలానికి మాత్రమే ధ్రువీకరణ చేస్తారు.
3. వ్యక్తుల సంఘం ద్వారా ఏర్పాటు చేసే స్వీయ వినియోగ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు
వ్యక్తుల సంఘం (అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్) ద్వారా ఏర్పాటు చేసిన గ్రూప్ క్యాప్టివ్ ప్రాజెక్టుల నిర్వహణలో ఈ సవరణలు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తాయి. చట్టబద్ధమైన యాజమాన్యం, వినియోగ నిబంధనలకు లోబడి, క్యాప్టివ్ వినియోగదారులు తమ కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా విద్యుత్తును వాడుకునే వెసులుబాటు ఉంటుంది.
వ్యక్తుల సంఘం కింద ఉన్న వ్యక్తిగత వినియోగదారులు తమకు కేటాయించిన నిష్పత్తి కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగించినప్పటికీ, అది ప్లాంట్ క్యాప్టివ్ హోదా రద్దుకు దారితీయదు. అటువంటి అదనపు వినియోగాన్ని ఆ వ్యక్తిగత సభ్యుని 'క్యాప్టివ్ వినియోగం'గా పరిగణించరు. కానీ దానిని గ్రూప్ మొత్తం పాటించాల్సిన కనీస 51% ఉమ్మడి వినియోగ నిబంధన కింద లెక్కిస్తారు.
ఒకవేళ వ్యక్తుల సంఘం లోని ఏ సభ్యుడైనా 26 శాతం లేదా అంతకంటే ఎక్కువ యాజమాన్య వాటాను కలిగి ఉంటే, ఆ నిర్దిష్ట సంస్థకు 'నిష్పత్తి ప్రకారం వినియోగం' అనే నిబంధన వర్తించదు. ఆ సభ్యుడు వినియోగించే మొత్తం విద్యుత్తును 'క్యాప్టివ్ వినియోగం'గానే పరిగణిస్తారు.
నిష్పత్తి ప్రకారం వినియోగ లెక్కల కోసం, ఒక క్యాప్టివ్ వినియోగదారునితో పాటు ఆ సంస్థ అనుబంధ విభాగాలు, హోల్డింగ్ కంపెనీ, ఆ హోల్డింగ్ కంపెనీకి చెందిన ఇతర అనుబంధ సంస్థలను కలిపి ఒకే వ్యక్తిగా పరిగణిస్తారు.
4. క్యాప్టివ్ హోదా ధ్రువీకరణ కోసం నోడల్ ఏజెన్సీలు
2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా, రాష్ట్రంలోనే వినియోగించే క్యాప్టివ్ విద్యుత్ (ఇంట్రా-స్టేట్ క్యాప్టివ్ వినియోగం) సందర్భాల్లో క్యాప్టివ్ హోదా ధృవీకరణ కోసం రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు ఒక నోడల్ ఏజెన్సీని నియమించవచ్చు. రాష్ట్రాల మధ్య వినియోగించే క్యాప్టివ్ విద్యుత్ (ఇంటర్-స్టేట్ క్యాప్టివ్ వినియోగం) సందర్భాల్లో ధ్రువీకరణను నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ) నిర్వహిస్తుంది.
క్యాప్టివ్ హోదా ధ్రువీకరణ నిర్ణయాల వల్ల తలెత్తే వివాదాలను పరిష్కరించడానికి సంబంధిత ప్రభుత్వం (కేంద్రం లేదా రాష్ట్రం) ఒక ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఏర్పాటు చేస్తుంది.
5. క్రాస్-సబ్సిడీ సర్‌చార్జి, అదనపు సర్చార్జ్‌ల నిర్వహణ
క్యాప్టివ్ హోదా ధృవీకరణ పెండింగ్‌లో ఉన్న సమయంలో, వినియోగదారులు నిర్దేశించిన డిక్లరేషన్‌ను సమర్పిస్తే వారికి క్రాస్-సబ్సిడీ సర్ఛార్జ్ (సీఎస్ఎస్) అదనపు సర్ఛార్జ్(ఏఎస్) విధించరు. ఇందుకోసం అంతర్-రాష్ట్ర కేసుల్లో ఎన్ఎల్డీసీ జారీ చేసిన విధానాలను, రాష్ట్రాల కేసుల్లో రాష్ట్ర నోడల్ ఏజెన్సీ జారీ చేసిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
ఒకవేళ ధ్రువీకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత, సదరు ప్లాంట్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ హోదాను పొందేందుకు విఫలమైతే, అప్పటివరకు మినహాయించిన క్రాస్-సబ్సిడీ సర్ఛార్జ్, అదనపు సర్ఛార్జ్ మొత్తాలను క్యారీయింగ్ కాస్ట్ లేదా వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్యారీయింగ్ కాస్ట్‌ను విద్యుత్ (లేట్ పేమెంట్ సర్చార్జ్, సంబంధిత అంశాలు) నిబంధనలు - 2022 ప్రకారం నిర్దేశించిన లేట్ పేమెంట్ సర్చార్జ్ ప్రాథమిక రేటు ఆధారంగా లెక్కిస్తారు.
6. సవరణల అమలు
సమర్థవంతమైన అమలు కోసం, వ్యక్తుల సంఘాల నిర్మాణాలలో నిష్పత్తి ప్రకారం విద్యుత్ వినియోగం, ధృవీకరణ యంత్రాంగం, సీఎస్ఎస్, ఏఎస్ నిర్వహణకు చ సంబంధించిన కొన్ని నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తాయి. ఇతర సవరణలు తక్షణమే అమలులోకి వస్తాయి.
పారిశ్రామిక వృద్ధి, స్వచ్ఛ ఇంధన మార్పిడికి మద్దతుగా సంస్కరణలు
పరిశ్రమలకు క్యాప్టివ్ జనరేషన్ ద్వారా నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్తును అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, ఈ సంస్కరణలు పారిశ్రామిక పోటీతత్వాన్ని బలోపేతం చేస్తాయి. సుస్థిరమైన భారత్ ఇంధన భవిష్యత్తు వైపు మారేందుకు మద్దతునిస్తాయి. ఈ సంస్కరణలు ఇంధన స్వయం సమృద్ధికి సంబంధించిన ప్రభుత్వ విస్తృత దృక్పథానికి అనుగుణంగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడతాయి.
***
(రిలీజ్ ఐడి: 2240429)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12