ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అస్సాంలోని గువహటిలో రూ. 19,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది రైతులకు రూ. 18,000 కోట్ల పైగా 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' నిధుల విడుదల

అస్సాం అభివృద్ధిని వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చే అనేక ముఖ్యమైన సంక్షేమ, మౌలిక సదుపాయాల పథకాలు గువహటి నుంచి ప్రారంభమవుతున్నాయి: ప్రధాని

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, దేశంలోని చిన్న రైతులకు సామాజిక భద్రత కల్పించే సాధనంగా మారింది: ప్రధాని

కనీస మద్దతు ధర, తక్కువ వడ్డీ రుణాలు, పంట బీమా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలు రైతులకు ఎంతో భరోసా కల్పిస్తున్నాయి: ప్రధానమంత్రి

అంతర్జాతీయ స్థాయి సంక్షోభాలు వ్యవసాయం, సాగుపై ప్రభావం చూపకుండా చర్యలు తీసుకున్నాం: ప్రధాని
పునరుత్పాదక ఇంధన రంగంలో దేశ లక్ష్యాల సాధనలో అస్సాం కీలక పాత్ర పోషిస్తోంది; లోయర్ కోపిలి జల విద్యుత్ ప్రాజెక్టు అస్సాంతో పాటు మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు మేలు చేకూరుస్తుంది: ప్రధాని

దేశంలోని ప్రతి ప్రాంతం, ప్రతి వర్గం అభివృద్ధి మా ప్రాధాన్యత; ఇదే స్ఫూర్తితో నేడు అస్సాం తేయాకు తోటల కార్మికుల కోసం ఒక పెద్ద కార్యక్రమం చేపట్టాం: ప్రధాని

ఈశాన్య ప్రాంతం - అష్టలక్ష్మి సరికొత్త భవిష్యత్తుకు నేడు అస్సాం నమూనాగా మారుతోంది; ఇక్కడి ప్రగతి మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు సరికొత్త వేగాన్ని అందిస్తోంది: ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 13 MAR 2026 7:45PM by PIB Hyderabad

అస్సాంలోని గువహటిలో దాదాపు రూ. 19,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గువహటిలో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నగర ప్రజలకు ప్రధాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వర్చువల్ గా పాల్గొంటున్న రైతులకు, అలాగే తేయాకు తోటల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల ముందు  కామాఖ్య మాత పవిత్ర భూమిలో ఉండటం తన అదృష్టమని ప్రధానమంత్రి అన్నారు. "నవరాత్రులు ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు, కామాఖ్య మాత పుణ్య భూమిలో మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

కామాఖ్య మాత ఆశీస్సులతో దాదాపు రూ. 19,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కొద్దిసేపటి క్రితమే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించే లక్ష్యంతో పాటు, రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల సౌకర్యాలను పెంచే అనేక ప్రాజెక్టులు అస్సాంకు దక్కాయని ఆయన అన్నారు.  ఈ రోజు దేశ రైతులకు, అస్సాం తేయాకు తోటల కార్మికులకు ఎంతో ముఖ్యమైన  రోజని ప్రధానమంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది అన్నదాతల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 18,000 కోట్లకు పైగా నిధులను నేరుగా జమ చేసినట్లు శ్రీ మోదీ సభలో తెలియజేశారు. అస్సాం తేయాకు తోటలకు చెందిన అనేక కుటుంబాలకు భూ పట్టాలు పంపిణీ చేసినట్లు ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. "అస్సాం ప్రజలకు, ఇక్కడి కుటుంబాలందరికీ, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను" అని శ్రీ మోదీ పేర్కొన్నారు.  

కామాఖ్య మాత పవిత్ర భూమి నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో దేశవ్యాప్త రైతులు భాగస్వాములయ్యారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కోట్లాది మంది రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధి జమ అయినట్లు ఇప్పటికే వారికి సందేశాలు అందాయని శ్రీ మోదీ తెలిపారు. ఈ పథకం నిజంగా అసాధారణమైనదని ప్రధాని అభివర్ణించారు. 2014 సంవత్సరానికి  ముందు రైతు సోదరసోదరీమణులలో అధికశాతం మంది వద్ద మొబైల్ ఫోన్ కానీ, బ్యాంక్ ఖాతా కానీ లేవని శ్రీ మోదీ గుర్తు చేశారు. ఇప్పటివరకు కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.4.25 లక్షల కోట్లకు పైగా నగదు జమ అయినట్లు ప్రధానమంత్రి వివరించారు. ఒక్క అస్సాంలోనే సుమారు 19 లక్షల మంది రైతులు ఇప్పటిదాకా దాదాపు రూ.8.000 కోట్లు అందుకున్నారని  ప్రత్యేకంగా గుర్తుచేశారు. "ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు కూడా దీనిని అందుకోలేవు; ఒక్క క్లిక్‌తో కోట్ల మంది రైతులకు నేరుగా డబ్బు చేరుతోంది" అని శ్రీ మోదీ చెప్పారు.

"సమ్మాన్ నిధి పథకం  నేడు దేశంలోని చిన్న రైతులకు సామాజిక భద్రత కల్పించే సాధనంగా మారింది," అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వానికి రైతుల సంక్షేమం కంటే ముఖ్యమైనది మరేదీ లేదని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. గత 10 ఏళ్లలో రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) రూపంలో రూ.20 లక్షల కోట్లకు పైగా నిధులు అందాయని ఆయన పేర్కొన్నారు.

గత 11 ఏళ్లలో ప్రస్తుత ప్రభుత్వం దేశ రైతులకు ఒక బలమైన రక్షణ కవచం ఏర్పాటు చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కనీస మద్దతు ధర, తక్కువ వడ్డీ రుణాలు, పంట బీమా లేదా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాలు రైతులకు భారీ మద్దతు వ్యవస్థగా మారాయని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం వ్యవసాయం, సాగుపై పడకుండా ప్రభుత్వం జాగ్రత్త వహించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి, ఆ తర్వాత జరిగిన యుద్ధాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు అనేక రెట్లు పెరిగాయని, విదేశీ మార్కెట్ల నుంచి  ఎరువులు సేకరించడం అత్యంత కష్టతరంగా మారిందని శ్రీ మోదీ అన్నారు.  ఈ సంక్షోభం నుంచి న రైతులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని ప్రధానమంత్రి చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.3,000 ధర పలికే యూరియా బస్తాను తమ ప్రభుత్వం రైతులకు కేవలం రూ.300 కే అందించిందని ఆయన గుర్తుచేశారు. "ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరల పెరుగుదల భారం మన రైతులపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం తన  ఖజానా నుంచి రూ.12 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది" అని శ్రీ మోదీ వివరించారు.

గత దశాబ్ద కాలంలో ప్రస్తుత ప్రభుత్వం స్వయంసమృద్ధి దిశగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రధానమంత్రి చెప్పారు. బాహ్య సంక్షోభాల నుంచి  వ్యవసాయాన్ని రక్షించడానికి స్వయం సమృద్ధిని ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో యుద్ధాలు లేదా సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడినప్పుడు భారతీయ రైతులు పదేపదే కష్టాలు ఎదుర్కోవడం చూశామని, కొన్నిసార్లు ఎరువుల ధరలు పెరగడం, మరికొన్నిసార్లు డీజిల్, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం జరిగిందని ప్రధానమంత్రి వివరించారు

ప్రభుత్వ లక్ష్యం వ్యవసాయాన్ని సరికొత్త సాంకేతికతతో అనుసంధానించడం, రైతులను నూతన సాగు పద్ధతులతో ముడిపెట్టడం, పంటలకు మేలు చేకూర్చడమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం 'పర్ డ్రాప్ మోర్ క్రాప్' (ప్రతి నీటి చుక్కకు ఎక్కువ పంట) విధానాన్ని అవలంబించిందని, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెచ్చిందని శ్రీ మోదీ తెలిపారు.  దీని వల్ల సాగు నీటి సౌకర్యం మెరుగుపడటమే కాకుండా ఖర్చులు కూడా తగ్గాయని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. డీజిల్ కోసం రైతులు పెట్టే ఖర్చును తగ్గించడానికి పొలాలను సోలార్ పంపులతో అనుసంధానించే పనిలో ప్రభుత్వం ఉందని శ్రీ మోదీ తెలిపారు. ఇందుకోసమే కేంద్రం 'కుసుమ్' యోజనను రూపొందించిందని ప్రధాని పేర్కొన్నారు. "నేడు చాలా మంది రైతులు సోలార్ పంపుల ద్వారా సాగు చేయడమే కాకుండా, విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ దాని ద్వారా ఆదాయాన్ని కూడా పొందుతున్నారు" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

ఎరువులు, పురుగుల మందులపై రైతుల ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. మూతపడిన ఎరువుల కర్మాగారాలను ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరించిందని, రైతులను నానో యూరియా తో అనుసంధానించడానికి అనేక చర్యలు చేపట్టిందని, నేడు దేశంలోని రైతులు దాని ప్రయోజనాలను పొందుతున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టేలా ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు రైతులను ప్రోత్సహిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. "రైతులు భారీ ఎత్తున ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టినప్పుడు, నేల సురక్షితంగా ఉంటుంది. వారు ప్రపంచ సంక్షోభాల నుంచి  కూడా బయటపడతారు” అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. 

ప్రస్తుత ప్రభుత్వం రైతుల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, దేశాన్ని స్వయం సమృద్ధిగా మారుస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశంలో రిఫైనరీల అభివృద్ధికి, వాటి సామర్థ్యాన్ని విస్తరించడానికి ప్రస్తుత ప్రభుత్వం కృషి చేసిందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. నేడు, దేశీయంగా రిఫైనరీ సామర్థ్యం పెరగడమే కాకుండా, పెట్రోకెమికల్ రంగంలో కూడా భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ నేడు తన సొంత ఇంధన అవసరాలనే కాకుండా, ప్రపంచ ఇంధన అవసరాలను కూడా తీర్చగల సామర్థ్యం ఉన్న దేశమని శ్రీ మోదీ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా అస్సాంలోని రిఫైనరీలను కూడా విస్తరించినట్లు ప్రధానమంత్రి గుర్తుచేశారు. అస్సాంతో పాటు ఈశాన్య భారతం అంతటా గ్యాస్ పైప్‌లైన్ మౌలిక సదుపాయాల కోసం మునుపెన్నడూ లేని విధంగా పెట్టుబడులు పెడుతున్నామని శ్రీ మోదీ తెలిపారు. 

నుమాలిఘర్-సిలిగురి పైప్‌లైన్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయని, అస్సాంలోని గోలాఘాట్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి రెండో తరం బయో-ఇథనాల్ ప్లాంట్‌ను స్థాపించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. "ఈ ప్రాజెక్టులన్నీ ఈ ప్రాంతం మొత్తానికి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.

గత దశాబ్ద కాలంలో రైల్వేలు విదేశీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, చమురు దిగుమతులను కనీస స్థాయికి తగ్గించడానికి గణనీయమైన కృషి జరిగిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు దేశంలోని దాదాపు మొత్తం రైల్వే నెట్‌వర్క్ విద్యుత్ మార్గాలతో అనుసంధానమయిందని, 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని శ్రీ మోదీ తెలిపారు. "రైల్వే విద్యుదీకరణ కారణంగా దేశం దాదాపు 1.75 బిలియన్ లీటర్ల డీజిల్‌ను ఆదా చేస్తోంది. అస్సాం రైల్వే నెట్‌వర్క్ విద్యుద్దీకరణ కూడా వేగంగా జరుగుతోంది” అని శ్రీ మోదీ తెలిపారు. 

దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను నెరవేర్చడంలో అస్సాం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. లోయర్ కోపిలి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వల్ల కేవలం అస్సాం మాత్రమే కాకుండా మొత్తం ఈశాన్య భారతం ప్రయోజనం పొందుతుందని శ్రీ మోదీ తెలిపారు. "వేల కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులు అస్సాం యువతకు కొత్త ఉపాధి మార్గాలను సృష్టిస్తున్నాయి. రాష్ట్ర సంపదను పెంచుతున్నాయి" అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

ప్రస్తుత డబుల్ ఇంజిన్ ప్రభుత్వ గుర్తింపు దాని సున్నితత్వం, సుపరిపాలనలో ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి ప్రాంతం, సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇదే స్ఫూర్తితో, ఈరోజు అస్సాం తేయాకు తోటల కార్మికుల కోసం ఒక ప్రధాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రధానమంత్రి తెలిపారు. అస్సాం అంతర్జాతీయ గుర్తింపును వారి కష్టమే బలోపేతం చేసిందని, వారు పండించే టీ సువాసన ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక గుర్తింపుగా మారిందని శ్రీ మోదీ కొనియాడారు. నేడు ప్రస్తుత ప్రభుత్వం ఈ కార్మికులకు గౌరవం, సహాయం రెండింటినీ అందిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. టీ తోటలతో సంబంధం ఉన్న కుటుంబాల కోసం ప్రశంసనీయమైన పని చేస్తున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మను, ఆయన బృందాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ఈ చారిత్రక అన్యాయాన్ని అంతం చేసేందుకు అస్సాం ప్రభుత్వం ఇప్పుడు కృషి చేస్తోందని, ఈ కుటుంబాలకు ఇప్పుడు సొంత భూమి లభిస్తోందని, వారికి పక్కా ఇళ్లు లభించే మార్గం సుగమం అయిందని శ్రీ మోదీ పేర్కొన్నారు. తేయాకు తోటల్లో నివసించే మహిళలకు ఈ చొరవ వల్ల ముఖ్యంగా గొప్ప ప్రయోజనం కలుగుతుందని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ కార్మికుల కుటుంబాల్లోని పిల్లలు కూడా బాగా చదువుకుని జీవితంలో పురోగమించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఇందుకోసం ప్రస్తుత ప్రభుత్వం అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించిందని ఆయన తెలిపారు.

ప్రసిద్ధ నిమతి ఘాట్, బిశ్వనాథ్ ఘాట్‌ల వద్ద అత్యాధునిక క్రూయిజ్ టెర్మినల్స్ నిర్మించే పనులు కూడా ఈరోజు  ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి ప్రకటించారు. ఇది కేవలం ఒక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదని, అస్సాంలోని పర్యాటక రంగానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఒక కొత్త దిశను చూపే అడుగు అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పర్యాటకాన్ని కేవలం సందర్శనకు మాత్రమే పరిమితం చేయలేదని, దీనిని ఉపాధి అభివృద్ధికి ఒక గొప్ప అవకాశంగా చూస్తోందని అన్నారు.  బ్రహ్మపుత్ర నదిపై జల పర్యాటక అవకాశాలను ఇదే దార్శనికతతో విస్తరిస్తున్నట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ క్రూయిజ్ టెర్మినల్స్ నిర్మాణం పూర్తయిన తర్వాత బ్రహ్మపుత్ర నదిపై క్రూయిజ్ కార్యకలాపాలు మరింత ముందుకు సాగుతాయని, భారత్ తో పాటు ప్రపంచవ్యాప్త పర్యాటకులు అస్సాం చేరుకోవడం మరింత సులభతరం అవుతుందని ప్రధానమంత్రి తెలిపారు.  క్రూయిజ్ టూరిజం వృద్ధి చెందడం వల్ల స్థానిక యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని, కళాకారులు, హస్తకళా కార్మికులకు కొత్త మార్కెట్లు దొరుకుతాయని, చిన్న దుకాణదారులు, పడవ నడిపేవారు, హోటల్, రవాణా రంగాలకు చెందిన వారి ఆదాయం కూడా పెరుగుతుందని శ్రీ మోదీ తెలిపారు. "అస్సాంలో పర్యాటకం ఇకపై కేవలం ప్రయాణం, సందర్శనలకే పరిమితం కాదు, ఇది స్థానిక అభివృద్ధికి, ప్రజల అభ్యున్నతికి ఒక కొత్త చోదకంగా మారుతోంది" అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

అష్టలక్ష్మిగా పిలిచే భారత ఈశాన్య రాష్ట్రాల నూతన భవిష్యత్తుకు అస్సాం నేడు ఒక నమూనాగా ఎదుగుతోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అస్సాం సాధిస్తున్న పురోగతి మొత్తం ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి సరికొత్త వేగాన్ని ఇస్తోందని  అభిప్రాయపడ్డారు. “దేశంలో అస్సాం  ఆదర్శ రాష్ట్రంగా అభివృద్ధి చెందేలా 'వికసిత అస్సాం' కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి" అని శ్రీ మోదీ యువతకు, ప్రజలకు పిలుపనిచ్చారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2240058) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam