పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలో విమాన ప్రయాణ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్న ఎంవోసీఏ


రియాద్‌కు విమానాలను పునఃప్రారంభించిన భారతీయ విమానయాన సంస్థలు

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 8:31PM by PIB Hyderabad

పశ్చిమాసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితిని... భారత్, ఈ ప్రాంతంలోని దేశాల మధ్య విమాన ప్రయాణంపై దాని ప్రభావాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రయాణికుల భద్రత, విమాన కార్యకలాపాల క్రమబద్ధ నిర్వహణను నిర్ధారించడానికి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విమానయాన సంస్థలు అవసరమైన కార్యాచరణ సర్దుబాట్లను చేపడుతున్నాయి.

ఈ సందర్భంలో, భారత్ నుంచి రియాద్‌కు, అలాగే రియాద్ నుంచి భారత్‌కు భారతీయ విమానయాన సంస్థల విమాన కార్యకలాపాలు ఈ రోజు నుంచి పునఃప్రారంభమయ్యాయి. మొదటి రోజునే ఎయిర్ ఇండియా, ఇండిగో ముంబైకి మూడు సర్వీసులను... ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కాలికట్‌కు ఒక సర్వీసును నిర్వహిస్తున్నాయి. తద్వారా భారత్, సౌదీ అరేబియాలోని రియాద్ మధ్య ముఖ్యమైన విమాన కనెక్టివిటీని ఈ సంస్థలు పునరుద్ధరించాయి.

2026 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11 వరకు మొత్తం 1,50,457 మంది ప్రయాణికులు గల్ఫ్ దేశాల నుంచి విమానాల ద్వారా భారత్‌కు ప్రయాణించారు.

భారతీయ విమానయాన సంస్థలు ఈ రోజున పశ్చిమాసియాలోని అబుదాబి, దుబాయ్, ఫుజైరా, జెడ్డా, మస్కట్, రస్ అల్ ఖైమా, రియాద్, షార్జా సహా వివిధ నగరాల నుంచి 57 ఇన్‌బౌండ్ విమానాలను షెడ్యూల్ చేశాయి. ఇవి కార్యాచరణ సాధ్యాసాధ్యాలు, ప్రస్తుత పరిస్థితులకు లోబడి ఉంటాయి.

ప్రయాణికులు సజావుగా ప్రయాణించడానికి వీలు కల్పించడం కోసం విమానయాన సంస్థలు, సంబంధిత వాటాదారులతో మంత్రిత్వ శాఖ సన్నిహిత సమన్వయాన్ని కొనసాగిస్తోంది. టికెట్ ధరలు సహేతుకంగా ఉండేలా, ఈ కాలంలో అనవసరమైన పెంపు లేకుండా చూసుకోవడానికి విమాన ఛార్జీలనూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

విమాన షెడ్యూల్‌లు, ప్రయాణ ఏర్పాట్లకు సంబంధించిన తాజా సమాచారం కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.

మంత్రిత్వ శాఖ పరిస్థితిని సమీక్షిస్తూనే ఉంటుంది, అవసరానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2239639) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Marathi , Malayalam