ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈ నెల 14న పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి


కోల్‌కతాలో దాదాపు రూ. 18,680 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి

ఇవి రహదారి మౌలిక సదుపాయాలు, రైల్వేలు, ఓడరేవులు, జల రవాణా వంటి బహుళ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు

పశ్చిమ బెంగాల్‌లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన ఆరు రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 5:31PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 14న పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రధానమంత్రి కోల్‌కతాలో దాదాపు రూ.18,680 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు.

ఈ ప్రాంతంలో రహదారి మౌలిక సదుపాయాలకు ఊతమిస్తూ... 420 కిలోమీటర్లకు పైగా పొడవైన, దాదాపు రూ.16,990 కోట్ల విలువైన అనేక జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని ఎన్‌హెచ్-19 విభాగాలు, పశ్చిమ బెంగాల్‌లోని ఎన్‌హెచ్-114లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రహదారి భద్రతను మెరుగుపరుస్తాయని, ప్రయాణ సమయాన్ని తగ్గిస్తాయని, రద్దీతో పాటు కాలుష్యాన్ని తగ్గిస్తాయని, ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని భావిస్తున్నారు.

ప్రధానమంత్రి అనేక కొత్త జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. వీటిలో ఎన్‌హెచ్-116ఎ లోని 231 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల ఖరగ్‌పూర్-మోరేగ్రామ్ ఆర్థిక కారిడార్ విభాగంలోని ఐదు ప్యాకేజీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఖరగ్‌పూర్, సిలిగురి మధ్య ఆర్థిక కారిడార్‌లో భాగంగా ఉండి, పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్, బంకురా, హుగ్లీ, పుర్బా బర్ధమాన్, బీర్భూమ్, ముర్షిదాబాద్ జిల్లాల గుండా వెళుతుంది. నేరుగా ఖరగ్‌పూర్-మోరేగ్రామ్ కనెక్టివిటీ ప్రయాణ దూరాన్ని దాదాపు 120 కిలోమీటర్లకు తగ్గిస్తుంది. దాదాపు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ప్రయాణ సమయాన్నీ ఆదా చేస్తుంది. ఈ కారిడార్ ఎన్‌హెచ్-16, ఎన్‌హెచ్-19, ఎన్‌హెచ్-14, ఎన్‌హెచ్-12 వంటి కీలక జాతీయ రహదారులతోనూ అనుసంధానమవడం ద్వారా బహుళ-కారిడార్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది. ఎన్‌హెచ్-14 పై 5.6 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల దుబ్రాజ్‌పూర్ బైపాస్ నిర్మాణానికీ ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఇది దుబ్రాజ్‌పూర్ పట్టణంలోని రద్దీని తగ్గించడానికి, ప్రయాణ సమయాన్ని దాదాపు ఒక గంట తగ్గించడానికి సహాయపడుతుంది. ఎన్‌హెచ్-14 పై కాంగ్షాబాటి, శిలాబాటి నదులపై అదనంగా నాలుగు వరుసల ప్రధాన వంతెనల నిర్మాణానికీ ఆయన శంకుస్థాపన చేస్తారు.

ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి అనేక జల రవాణా, నౌకాశ్రయ సంబంధిత ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. హల్దియా డాక్ కాంప్లెక్స్‌లోని బెర్త్ నంబర్ 2 యాంత్రీకరణ ప్రాజెక్టునూ ఆయన ప్రారంభిస్తారు. ఇది సమర్థమైన, వేగవంతమైన, పర్యావరణ అనుకూలమైన కార్గో నిర్వహణకు వీలు కల్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కార్గో నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుతుంది. సమర్థమైన ఫుల్-రేక్ రైల్ లోడింగ్ వ్యవస్థలను సులభతరం చేస్తుంది. కీలక పనితీరు సూచికలను మెరుగుపరుస్తుంది. ప్రమాదకర కార్యకలాపాల్లో సిబ్బందికి ముప్పును తగ్గించడం ద్వారా భద్రతను పెంచుతుంది. ఉపాధిని సృష్టిస్తుంది. ఖిద్దర్‌పోర్ డాక్స్ (డాక్ 1 - వెస్ట్) వద్ద పునరుజ్జీవన ప్రాజెక్టునూ ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

రాష్ట్రంలో పలు నౌకాశ్రయాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఓడరేవులోని హల్దియా డాక్ కాంప్లెక్స్‌లోని 5వ బెర్త్‌ యాంత్రీకరణ వీటిలో భాగంగా ఉంది. కోల్‌కతా డాక్ సిస్టమ్‌లోని బాస్క్యూల్ వంతెన పునరుద్ధరణ... కిద్దర్‌పూర్ డాక్-I (తూర్పు), డాక్-II (తూర్పు) వద్ద డ్రైనేజీ వ్యవస్థలు సహా యార్డు అభివృద్ధి... హౌరా వంతెన పైలాన్ నుంచి నిమ్తలా ఘాట్ వరకు కోల్‌కతా నదీతీరం వెంబడి తీర రక్షణ పనులు... కోల్‌కతా డాక్ సిస్టమ్‌లోని ఇండేంచర్ మెమోరియల్ కాంప్లెక్స్ సమీపంలో రివర్ క్రూయిజ్ టెర్మినల్, రివర్ టూరిజం సౌకర్యం కోసం టెర్మినల్ భవన నిర్మాణం వంటి పనులు వీటిలో భాగంగా ఉన్నాయి.

రైల్వే రంగంలో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, దేశ రాజధాని ప్రాంతాల మధ్య రైలు కనెక్టివిటీని బలోపేతం చేసే పురులియా-ఆనంద్ విహార్ టెర్మినల్ (ఢిల్లీ) ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

అమృత్ స్టేషన్ పథకం కింద కామాఖ్యగురి, అనారా, తమ్లుక్, హల్దియా, బరాభూమ్, సియురి వంటి ఆరు పునరాభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్లనూ ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

రెండు రైల్వే ప్రాజెక్టులనూ ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఇవి బెల్డా-దంతన్ మధ్య 16 కిలోమీటర్ల పొడవైన మూడో రైలు మార్గం, కలైకుండ-కనిమొహులి మధ్య ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ. ఈ ప్రాజెక్టులు రైలు భద్రతను, సమయపాలనను మెరుగుపరుస్తాయి, రద్దీని తగ్గిస్తాయి. ఈ ప్రాంతంలోని ప్రయాణికులకు ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయి.

పశ్చిమ బెంగాల్, తూర్పు భారతంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, కనెక్టివిటీని మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంలో ప్రభుత్వ నిరంతర నిబద్ధతను ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2239218) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Gujarati , Tamil , Kannada , Malayalam