రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వేలు ఛార్జీలను వాణిజ్య రహస్యంగా పరిగణించవు: ప్రయాణీకుల ఛార్జీల హేతుబద్ధీకరణ, సవరణలు మొదలైన వాటిలో మార్పులను ఎప్పటికప్పుడు ప్రచురిస్తాం: శ్రీ అశ్విని వైష్ణవ్
వందే భారత్ స్లీపర్ ఛార్జీలు కిలోమీటరుకు రూ.2.40 నుంచి రూ.3.80 వరకు ఉన్నాయి... ఇలాంటి సేవలకే చైనా, జపాన్, ఫ్రాన్స్‌లలో కిలోమీటరుకు రూ. 7.00 నుండి రూ. 20.00 వరకు ఉన్న ఛార్జీలతో పోలిస్తే ఇది చాలా తక్కువ
భారతీయ రైల్వేలు 2024–25లో ప్రయాణీకుల టిక్కెట్లపై రూ.60,239 కోట్ల సబ్సిడీని అందించాయి. ఇది రైలులో ప్రయాణించే ప్రతి వ్యక్తికి సగటున 43 శాతం రాయితీ అందినట్టు.
స్లీపర్, 3ఏసీ/2ఏసీ, రిజర్వ్డ్ సీటింగ్ క్లాసులలో వృద్ధులు, దివ్యాంగులు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణులకు ప్రాధాన్యత ప్రాతిపదికన లోయర్ బెర్త్‌లు, ప్రత్యేక కోటాలను రైల్వే అందిస్తుంది.
నాడు పోస్టు చేయడమైనది:
11 MAR 2026 6:22PM by PIB Hyderabad
రైల్వే మంత్రిత్వ శాఖ టికెట్ ధరలను ‘‘వ్యాపార రహస్యం’’గా గా పరిగణించదు. అన్ని వర్గాల ప్రయాణికుల సేవల ఛార్జీలకు సంబంధించిన సమాచారం బహిరంగంగా, అందరికీ అందుబాటులో ఉంటుంది.
భారతీయ రైల్వే 2024-25లో ప్రయాణికుల టికెట్లపై రూ. 60,239 కోట్ల సబ్సిడీని అందించింది. అంటే రైల్వేలో ప్రయాణించే ప్రతి వ్యక్తికి సగటున 43శాతం రాయితీ లభిస్తోంది. మరో విధంగా చెప్పాలంటే ఒక ప్రయాణికుడికి సేవలు అందించడానికి రైల్వేకు రూ.100 ఖర్చవుతుంటే టికెట్ ధరగా కేవలం రూ. 57 మాత్రమే వసూలు చేస్తోంది. ఈ సబ్సిడీ ప్రయాణికులందరికీ కొనసాగుతోంది. దీనికి అదనంగా 4 వర్గాల దివ్యాంగులు, 11 రకాల రోగులు, ఎనిమిది వర్గాల విద్యార్థులు వంటి అనేక విభాగాలకు మరిన్ని ప్రత్యేక రాయితీలు అందుబాటులో ఉన్నాయి.
పూర్తి పారదర్శకతను నిర్ధారించడానికి, ప్రయాణికుల టికెట్ ధరలోని వివిధ అంశాల వివరాలను (బేస్ ఫేర్, రిజర్వేషన్ ఛార్జీ, సూపర్ ఫాస్ట్ ఛార్జీ, జీఎస్టీ మొదలైనవి) టికెట్లపై స్పష్టంగా ముద్రిస్తారు. ఈ వివరాలు భౌతికంగా, డిజిటల్ రూపంలో ఉంటాయి. కంప్యూటరీకరించిన టికెటింగ్ వ్యవస్థలు (ప్యాసింజర్ రిజర్వేషన్ వ్యవస్థ, అన్రిజర్వ్డ్ టికెటింగ్ వ్యవస్థ), మొబైల్ అప్లికేషన్లు (రైల్‌వన్) వంటి వాటిలో కూడా అందుబాటులో ఉంటాయి.
ప్రయాణికుల ఛార్జీల మార్పులు, సవరణలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రచురిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థగా భారతీయ రైల్వే ప్రజలకు, పార్లమెంటుకు పూర్తి జవాబుదారీగా ఉంటుంది. ఆర్థికంగా స్థిరమైన విధంగా సేవలను అందించడం దీని ముఖ్యమైన బాధ్యత. సేవలకు అయ్యే ఖర్చు, ఇతర రవాణా మార్గాల నుంచి పోటీ, ప్రజల చెల్లింపు సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రయాణికుల ఛార్జీలను నిర్ణయిస్తారు.
వృద్ధులు, దివ్యాంగులతో సహా ప్రయాణీకుల సౌలభ్యం కోసం వివిధ సౌకర్యాలను అందించడానికి భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తుంది. వారికి కల్పిస్తున్న ప్రధాన సదుపాయాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
i. దివ్యాంగులు, వృద్ధులు, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళా ప్రయాణీకులకు వారు ప్రత్యేకంగా కోరకపోయినా సరే లభ్యతను బట్టి సాఫ్ట్‌వేర్ ద్వారా స్వయంచాలకంగా లోయర్ బెర్త్‌లను కేటాయిస్తారు.
ii. స్లీపర్ క్లాస్‌లో కోచ్‌కు 6 నుంచి 7 లోయర్ బర్త్‌లు, 3వ ఏసీలో ప్రతి కోచ్‌కు 4 నుంచి 5 లోయర్ బర్త్‌లు, 2వ ఏసీలో ప్రతి కోచ్‌కు 3 నుంచి 4 లోయర్ బర్త్‌లను (రైలులో ఆ తరగతి కోచ్‌ల సంఖ్యను బట్టి) వృద్ధులు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేక కోటాను కేటాయించారు.
iii. రాజధాని/శతాబ్ది వంటి మెయిల్ ఎక్స్‌ప్రెస్/ రైళ్లలో దివ్యాంగులు, వారి సహాయకులకు రిజర్వేషన్ కోటా కేటాయించారు.
· .స్లీపర్ క్లాస్‌లో నాలుగు బెర్త్‌లు (రెండు లోయర్, రెండు మిడిల్ బెర్త్‌లతో సహా)
· 3 ఏసీ/3ఈలో నాలుగు బెర్త్‌లు (రెండు లోయర్, రెండు మిడిల్ బెర్త్‌లతో సహా)
· రెండు కంటే ఎక్కువ కోచ్‌లు రైలులో అందుబాటులో ఉన్న రిజర్వ్‌డ్ సెకండ్ సిట్టింగ్ (2ఎస్)/ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ (సీసీ)లో నాలుగు సీట్లు.
iv. రైలులో ఖాళీగా ఉన్న లోయర్ బెర్త్‌లను వృద్ధులు, దివ్యాంగులు లేదా గర్భిణీ స్త్రీలకు (మధ్య బెర్త్, పై బెర్త్ కేటాయించిన వారికి) ప్రాధాన్యతపై కేటాయించడం.
మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ సర్వీస్ (నెం. 27575/27576 హౌరా - కామాఖ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్)ను 2026 జనవరి 1న ప్రారంభించారు. వందే భారత్ స్లీపర్ వంటి కొత్త రైలు సర్వీసుల విస్తరణ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది.
· ఆయా రైల్వే సెక్షన్ల సామర్థ్యం
· రైలు ప్రయాణించడానికి మార్గం లభ్యత
· అవసరమైన కోచ్‌ల లభ్యత
· కోచ్‌ల నిర్వహణకు తగిన మౌలిక సదుపాయాలు
· రైల్వే ట్రాక్‌లు, ఇతర ఆస్తుల నిర్వహణ అవసరాలు
· ఆ మార్గంలో ప్రయాణికుల రద్దీ, అవసరాలు
ప్రయాణికుల అనుభూతిని మెరుగుపరచడానికి, వందే భారత్ స్లీపర్‌లో అధునాతన భద్రతా వ్యవస్థలు, జెర్క్-ఫ్రీ సెమీ పర్మనెంట్ కప్లర్లు, కవచ్, అధిక వేగం, మెరుగైన అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, సీలు చేసిన గ్యాంగ్‌వేలు, అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, అత్యవసర టాక్-బ్యాక్ యూనిట్, కేంద్రీకృత కోచ్ పర్యవేక్షణ వ్యవస్థ మొదలైన ప్రయాణీకుల సౌకర్యాలతో కూడిన ఆధునిక కోచ్‌లను అందించారు.
వందే భారత్ స్లీపర్ రైలు ఛార్జీల విధానం ప్రతి ప్రయాణికుడికి.. ప్రతి కిలోమీటరు ప్రాతిపదికన ఉంటుంది. అంటే 3ఏసీ క్లాస్‌కు ప్రతి కిలోమీటరుకు రూ. 2.40 (జీఎస్టీ మినహాయించి) వసూలు చేస్తారు. ఉదాహరణకు 1000 కిలోమీటర్ల దూరానికి 3ఏసీ టికెట్ ధర సుమారు రూ. 2,400 ఉంటుంది.
వందే భారత్ స్లీపర్ రైలు అనేది అన్ని సదుపాయాలు కలిగిన ఒక ప్రత్యేక శ్రేణి ప్రయాణికుల సేవ. ఈ రైలులో ఆర్‌ఏసీ టికెట్ల కేటాయింపు ఉండదు. వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు, ధ్రువీకరించిన ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకున్నప్పుడు మాత్రమే సీట్లు నిర్ధారణ అవుతాయి. దీనివల్ల ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయి.
సమాజంలోని అన్ని వర్గాల వారికి తక్కువ ధరలో సేవలు అందించడానికి రైల్వే వ్యవస్థ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే పేద ప్రజల కోసం తక్కువ ఛార్జీలతో నడిచే రైళ్లతో పాటు, అత్యాధునిక సౌకర్యాలు కోరుకునే వారి కోసం ప్రత్యేక రైళ్లను కూడా నిర్వహిస్తోంది. వీటిలో సమాజంలోని వెనుకబడిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చడానికి తక్కువ ఛార్జీలతో కూడిన రైళ్లు, మెరుగైన సౌకర్యాలతో కూడిన రైళ్లు కూడా ఉన్నాయి.
ప్రపంచంలోని అనేక ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ రైల్వే ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. వందే భారత్ స్లీపర్ రైలు ఛార్జీలు కిలోమీటరుకు రూ.2.40 నుంచి రూ. 3.80 వరకు ఉంటాయి. అదే చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో ఇవే తరహా సేవలకు సుమారు రూ.7.00 నుంచి రూ.20.00 వరకు ఛార్జీలు ఉంటాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ నేడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2238761)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3