బొగ్గు మంత్రిత్వ శాఖ
ఎటువంటి బొగ్గు డిమాండ్‌నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న భారత్
2025-26 ఆర్థిక సంవత్సరంలో వినియోగం కంటే అధికంగా బొగ్గు ఉత్పత్తి, సరఫరా
థర్మల్ విద్యుతుత్పత్తి కేంద్రాలు, బొగ్గు గనుల వద్ద రికార్డు స్థాయిలో నిల్వలు
నాడు పోస్టు చేయడమైనది:
11 MAR 2026 5:33PM by PIB Hyderabad
ఈ ఏడాది బొగ్గు వినియోగం కంటే ఎక్కువగా ఉత్పత్తి, సరఫరా ఉంది. దీని ఫలితంగా థర్మల్ విద్యుతుత్పత్తి కేంద్రాలు, బొగ్గు గనుల వద్ద రికార్డు స్థాయిలో నిల్వలు పెరిగాయి. అంతేకాకుండా అనియంత్రణ రంగానికి సరఫరా గత ఏడాదితో పోలిస్తే దాదాపు 14 శాతం పెరిగింది.
2025 ఏప్రిల్ 1 నాటికి కోల్ ఇండియా (సీఐఎల్) గనుల వద్ద 106.78 ఎంటీ (మిలియన్ టన్నుల) బొగ్గు నిల్వలు ఉండగా 2026 మార్చి 9 నాటికి అవి 121.39 ఎంటీలకు పెరిగాయి. దీనికి అదనంగా సింగరేణి (ఎస్‌సీసీఎల్) గనుల వద్ద సుమారు 6.07 ఎంటీలు, క్యాప్టివ్ లేదా వాణిజ్య గనుల వద్ద 15.12 ఎంటీలు, రవాణాలో సుమారు 14 ఎంటీల బొగ్గు అందుబాటులో ఉంది. దీంతో గనుల వద్ద ఉన్న మొత్తం బొగ్గు నిల్వలు మొదటిసారిగా 156.58 మిలియన్ టన్నుల అత్యధిక స్థాయికి చేరాయి. ఈ నిల్వలు విద్యుతుత్పత్తి కేంద్రాల వద్ద ఇప్పటికే ఉన్న 54.05 ఎంటీల బొగ్గుకు అదనం. ప్రస్తుతం దేశంలో ఉన్న బొగ్గు వినియోగం రేటు ప్రకారం విద్యుతుత్పత్తి కేంద్రాల వద్ద ఉన్న ఈ నిల్వలు సుమారు 24 రోజుల అవసరాలకు సరిపోతాయి.
దేశంలో అందుబాటులో ఉన్న మొత్తం బొగ్గు నిల్వలు సుమారు 210 మిలియన్ టన్నులు. ఈ నిల్వలు దాదాపు 88 రోజుల అవసరాలకు సరిపోతాయి.
రైల్వే శాఖ సహకారంతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తగినంత సరఫరాను అందించడానికి దేశంలో బొగ్గు ఉత్పత్తి ఇదే వేగంతో కొనసాగుతోంది. తద్వారా గనుల వద్ద నిల్వలు నిరంతరం పెరుగుతున్నాయి.
నిరంతర విధానపరమైన మద్దతు, పనితీరును నిశితంగా పర్యవేక్షించటం, సంబంధిత భాగస్వాములతో సమన్వయం ద్వారా స్థిరమైన, పనితీరు ఆధారిత వాతావరణాన్ని సృష్టించడంపై బొగ్గు మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. విశ్వసనీయమైన బొగ్గు లభ్యతను నిర్ధారించడం, కీలక రంగాల్లో నిరంతర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడమే దీని లక్ష్యం. తద్వారా 'వికసిత్ భారత్ 2047' నిర్మించాలనే సుదీర్ఘ జాతీయ లక్ష్యానికి బొగ్గు మంత్రిత్వ శాఖ తన వంతు సహకారాన్ని అందిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2238437)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10