వైద్య రంగంలో ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టు కోసం సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్)-సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఏఆర్ఐ) న్యూఢిల్లీ, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, ఏ అండ్ యూ టిబ్బియా కాలేజ్, హాస్పిటల్ మధ్య ఓ త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. మార్చి 6, 2026న న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో కింద పేర్కొన్న శీర్షికతో ఈ ఒప్పందం కుదిరింది.
‘‘ఆరోగ్యవంతులైన పెద్దల్లో జీవక్రియ, వ్యాధి నిరోధక ప్రతిస్పందనలు, మైక్రోబయోమ్ మార్కర్లపై వసంతకాలపు వాంతి చికిత్స (వాసంతిక వామన) ప్రభావం-ఒక అన్వేషణాత్మక యాదృచ్ఛిక నియంత్రిత అధ్యయనం’’.
వాసంతిక వమనం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలను పరిశీలించడానికి, దాని వెనకున్న శాస్త్రీయ ఆధారాన్ని అన్వేషించడానికి ఈ ఉమ్మడి పరిశోధన కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ ప్రక్రియ ద్వారా పూర్తి ఆరోగ్యవంతులైన వయోజనుల్లో జీవక్రియ, వ్యాధి నిరోధక ప్రతిస్పందనలు, మైక్రోబయోమ్ మార్కర్లపై దీని ప్రభావాలను అంచనా వేస్తారు. కఠినమైన వైద్య పరిశోధన పద్ధతుల ద్వారా ఆయుర్వేద చికిత్సల్లో శాస్త్రీయమైన ఆధారపూర్వకమైన అవగాహనను రూపొందించాలనే ఉమ్మడి నిబద్ధతను ఈ అధ్యయనం ప్రతిబింబిస్తుంది.
ఈ ఒప్పంద సమయంలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ కేదార్ సింగ్ (పరిశోధన, అభివృద్ధి డైరెక్టర్డీ), ప్రొఫెసర్ అరుణ్ ఖారత్, ప్రొఫెసర్ అమల్ చంద్ర (స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్), సీసీఆర్‌ఏఎస్-సీఏఆర్ఐ నుంచి డాక్టర్ హేమంత పాణిగ్రాహి(ఇనిస్టిట్యూట్ ఇన్‌ఛార్జ్), డాక్టర్ బబితా యాదవ్, డాక్టర్ షైజీ లయీక్, డాక్టర్ రేణు రాణి హాజరయ్యారు.
ఈ భాగస్వామ్యం ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేయడంలో, సంప్రదాయ చికిత్సా విధానాలకు శాస్త్రీయ ఆధారాలను బలపేతం చేయడానికి అర్థవంతమైన ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నారు.
***