కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈపీఎఫ్ ట్రస్టీల సెంట్రల్ బోర్డు 239వ సమావేశం
· 2025-26 సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.25% వడ్డీ రేటును సిఫార్సు చేసిన సెంట్రల్ బోర్డు
· రూ. 1,000 లేదా అంత కన్నా తక్కువ మొత్తం క్లెయిమ్ చేసుకోకుండా ఉన్న క్రియారహిత ఈపీఎఫ్‌వో ఖాతాల్లో.. స్వయంచాలకంగా క్లెయిమ్ సెటిల్‌మెంటును ప్రారంభించే పైలట్ ప్రాజెక్టుకు బోర్డు ఆమోదం
· దాదాపు రూ. 5.68 కోట్ల నిధులున్న 1.33 లక్షలకు పైగా ఖాతాలకు ప్రయోజనం
· కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ, వేగవంతమైన వివాద పరిష్కారాలు లక్ష్యంగా... ఈపీఎఫ్‌వో నుంచి మినహాయింపు పొందిన సంస్థల కోసం ‘ఆమ్నెస్టీ పథకా’నికి సెంట్రల్ బోర్డు ఆమోదం
· కొత్త ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐలకు ఆమోదం
· సామాజిక భద్రతా నియమావళి- 2020కి అనుగుణంగా పథకాలు
· ఈపీఎఫ్ మినహాయింపు ప్రక్రియలో సమర్థత, పారదర్శకతను మెరుగుపరచడం, నిబంధనల అమలును సులభతరం చేయడం లక్ష్యంగా నూతన సరళీకృత ఎస్‌వోపీ
నాడు పోస్టు చేయడమైనది:
02 MAR 2026 3:37PM by PIB Hyderabad
కేంద్ర కార్మిక - ఉపాధి, యువజన వ్యవహారాలు - క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్) ట్రస్టీల సెంట్రల్ బోర్డు (సీబీటీ) 239వ సమావేశం ఈ రోజు న్యూ ఢిల్లీలో జరిగింది. వైస్ చైర్మన్ సుశ్రీ శోభా కరంద్లాజే, కార్మిక - ఉపాధి, ఎంఎస్ఎంఈ సంస్థల శాఖ సహాయ మంత్రి, సహ ఉపాధ్యక్షురాలు శ్రీమతి వందనా గుర్నాని, కార్మిక - ఉపాధి శాఖ కార్యదర్శి, సభ్య కార్యదర్శి శ్రీ రమేశ్ కృష్ణమూర్తి, కేంద్ర భవిష్య నిధి కమిషనర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తగిన చర్చల అనంతరం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సభ్యుల ఖాతాల్లోని ఈపీఎఫ్ నిల్వలపై 8.25% వార్షిక వడ్డీ రేటును జమ చేయాలని సెంట్రల్ బోర్డు సిఫార్సు చేసింది. ఈ వడ్డీ రేటును భారత ప్రభుత్వం అధికారికంగా నోటిఫై చేసిన అనంతరం, ఆ వడ్డీని చందాదారుల ఖాతాల్లో ఈపీఎఫ్‌వో జమ చేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. ఈపీఎఫ్‌వో బలమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించింది. దీనివల్ల వడ్డీ ఖాతాపై భారం పడకుండానే.. స్థిరమైన, పోటీతత్వంతో కూడిన రాబడులను అందించగలుగుతోంది. ఈ నిర్ణయం కోట్లాది మంది కార్మికుల ఉద్యోగ విరమణ కాలపు భద్రతను పటిష్టం చేయడమే కాకుండా.. వారి చందాలను కాపాడడంలో ఈపీఎఫ్‌వో నిబద్ధతను చాటుతోంది. ఇతర పెట్టుబడి మార్గాలతో పోలిస్తే.. అత్యంత సురక్షితమైన, స్థిరమైన, ఆకర్షణీయమైన రాబడులను ఇది అందిస్తోంది.
కొన్నేళ్లుగా ఈటీఎఫ్, ఇతర పెట్టుబడుల ద్వారా వస్తున్న మంచి రాబడుల కారణంగా 8 శాతం కన్నా ఎక్కువ వడ్డీ రేటును ఈపీఎఫ్‌వో ప్రకటించగలుగుతోంది. ఈ నిర్ణయం ఈపీఎఫ్‌వో పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో ఎంత పటిష్టంగా ఉందో తెలియజేయడమే కాకుండా.. సభ్యులకు మెరుగైన రాబడులను ఎప్పటికప్పుడు సమర్థంగా అందించడంలో సంస్థ నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది.
డాక్టర్ మాండవీయ అధ్యక్షతన ఈపీఎఫ్‌వోలో సంస్కరణలను కొనసాగిస్తూ.. చర్చలు, ఆమోదం కోసం కింది ఎజెండా అంశాలను బోర్డు ఎదుట ఉంచారు:-
-
మినహాయింపు పొందిన సంస్థల కోసం క్షమా పథకం: ఆర్థిక చట్టం- 2026 నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, ఈపీఎఫ్ - ఎంపీ చట్టం, 1952 పరిధిలోకి ఇంకా రాని లేదా మినహాయింపు పొందని.. ఆదాయపు పన్ను గుర్తింపు పొందిన ట్రస్టుల విషయంలో, నిబంధనల అమలు సమస్యల పరిష్కారం కోసం ఏకకాలిక క్షమా పథకాన్ని (వన్ టైం ఆమ్నెస్టీ స్కీం) బోర్డు ఆమోదించింది. ప్రతిపాదిత పథకం ద్వారా ఆయా సంస్థలు, ట్రస్టులను నిర్ణీత ఆరు నెలల కాలపరిమితిలో నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధానంగా కార్మికుల ప్రయోజనాలను కాపాడడం దీని ముఖ్య ఉద్దేశం. చట్టబద్ధమైన పథకం కన్నా మెరుగైన లేదా దానితో సమానమైన ప్రయోజనాలను ఇప్పటికే అందిస్తున్న సంస్థలకు.. ఈ పథకం కింద నష్ట పరిహారం, వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపు లభిస్తుంది. నిర్దేశిత నిబంధనలకు లోబడి.. పాత తేదీల నుంచి వర్తించేలా సడలింపులనూ లేదా మినహాయింపులనూ ఈ పథకం అనుమతిస్తుంది. దీనివల్ల అర్హులైన ఉద్యోగులందరికీ చట్టబద్ధమైన ప్రయోజనాలు అందుతాయి. ఈ చర్య ద్వారా ప్రస్తుతం కోర్టుల్లో ఉన్న వందకు పైగా వ్యాజ్యాలు, ఇతర వివాదాలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారు. తద్వారా వేలాది మంది ట్రస్టు సభ్యులకు ప్రయోజనం కలగనుంది. మినహాయింపు పొందిన సంస్థల్లో ఈపీఎఫ్ - ఎంపీ చట్టం, 1952 నిబంధనలను పాటించిన వాటికి ఈ పథకం వర్తిస్తుంది.
-
ఈపీఎఫ్ మినహాయింపుపై సరికొత్త సరళీకృత ఎస్వోపీ: ఈపీఎఫ్ మినహాయింపులకు సంబంధించి కొత్తగా రూపొందించిన సరళీకృత ఎస్వోపీని బోర్డు ఆమోదించింది. ప్రస్తుతమున్న నాలుగు వేర్వేరు ఎస్‌వోపీలు, మినహాయింపు మార్గదర్శకాలను కలిపి ఒకే సమగ్ర నిబంధనల ఛట్రంగా క్రోడీకరించారు. దీనివల్ల సంస్థలపై నిబంధనల అమలు భారం తగ్గుతుంది. పాత నిల్వలను అప్పగించడానికి, బదిలీ చేయడానికి ఒక సమగ్ర డిజిటల్ ప్రక్రియను ఈ ఎస్వోపీ అందిస్తుంది. సాంకేతికతతో కూడిన ఈ పాలన విధానం వల్ల.. మినహాయింపు పొందిన సంస్థల ఆడిట్ మరింత పారదర్శకంగా, సమర్థంగా జరుగుతుంది. ఏకీకృత వ్యవస్థ వల్ల సులభతర వాణిజ్యానికి ప్రోత్సాహం లభిస్తుంది. భౌతిక పత్రాల అవసరం ఉండదు. పారదర్శకత పెరుగుతుంది. మినహాయింపుల రద్దు/అప్పగింత ప్రక్రియలు వేగవంతమవుతాయి. అలాగే ఉల్లంఘనలకు ఎక్కువ అవకాశమున్న సంస్థల్లో ఆన్‌లైన్ ద్వారా ఆడిట్ నిర్వహించడం వల్ల.. నిబంధనలను సక్రమంగా పాటించే సంస్థలకు ప్రోత్సాహం లభిస్తుంది.
-
ప్రస్తుత ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ పథకాలను సామాజిక భద్రతా నియమావళి- 2020కి అనుగుణంగా మార్చడం: అంతరాయాల్లేకుండా ప్రస్తుత వ్యవస్థ నుంచి మార్పు చెందేలా.. సామాజిక భద్రత నియమావళి- 2020 కింద కొత్త పథకాల ప్రకటనను సీబీటీ ఆమోదించింది. ప్రస్తుత పథకాల స్థానంలో.. కొత్తగా ఆమోదించిన ఈపీఎఫ్ పథకం- 2026, ఈపీఎస్- 2026, ఈడీఎల్ఐ పథకం- 2026 అమల్లోకి వస్తాయి. ఇవి భవిష్య నిధి, పింఛను, ఇన్సూరెన్స్ ప్రయోజనాల నిర్వహణ కోసం ఓ చట్టబద్ధమైన, పటిష్టమైన పునాదిని అందిస్తాయి.
-
వార్షిక నివేదికకు ఆమోదం: 2024-25 సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్‌వో వార్షిక నివేదికను సీబీటీ ఆమోదించింది. దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది. ముఖ్యంగా 2024-25లో సామాజిక భద్రత పరిధిని విస్తరణ, వివిధ డిజిటలీకరణ కార్యక్రమాలు, మెరుగైన సేవలందించడంతోపాటు సంస్థాగత పనితీరును ఈ వార్షిక నివేదిక వివరిస్తుంది.
2024-25లో పటిష్టమైన కార్యకలాపాలనూ, ఆర్థిక పనితీరునూ ఈపీఎఫ్‌వో కనబరిచింది. మొత్తం చందాలు రూ. 3,35,628.81 కోట్లు కాగా.. కొత్తగా 2,86,894 సంస్థలను నిబంధనల పరిధిలోకి తెచ్చారు. అలాగే 1,22,89,244 మంది కొత్త సభ్యులు నమోదయ్యారు. ఈ ఏడాది సంస్థ 81,48,490 మంది పెన్షనర్లకు సేవలందించి.. మొత్తం 6,01,59,608 క్లెయిమ్‌లను పరిష్కరించింది. వీటిలో 69,983 ఈడీఎల్ఐ క్లెయిములున్నాయి. ఈ ఏడాది 17,33,046 ఫిర్యాదులను పరిష్కరించారు. 39,74,501 ఫోన్ కాల్స్ ద్వారా సభ్యులకు సహకారాన్ని అందించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా ప్రకటించారు.
అంతేకాకుండా 2024-25లో ఈపీఎఫ్‌వో అమలు చేసిన కీలక సంస్కరణలను బోర్డు దృష్టికి తెచ్చారు. దేశవ్యాప్తంగా కేంద్రీకృత పింఛను చెల్లింపుల వ్యవస్థ (సీపీపీఎస్) ప్రారంభం, ముఖ ధ్రువీకరణ సాంకేతికత (ఎఫ్ఏటీ) ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే విధానాన్ని ప్రవేశపెట్టడం వంటివి ఈ సంస్కరణల్లో భాగంగా ఉన్నాయి. ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)-1995ను సవరించి.. కనీసం ఒక నెల చందా చెల్లించినా విత్‌డ్రా ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పించారు. అలాగే 12 నెలల పాటు అంతరాయం లేకుండా ఉద్యోగంలో కొనసాగిన సభ్యులకు ఈడీఎల్ఐ ప్రయోజనాలను రూ. 2.5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు పెంచారు. నిబంధనల అమలును సులభతరం చేసేలా.. నెలకు 1 శాతం ఏకరీతి జరిమానా రేటును ప్రకటించారు. 2024 జూన్ 14 నుంచి ఇవి వర్తిస్తాయి. ఏడు ఐఎస్ఎస్ఏ గుడ్ ప్రాక్టీస్ అవార్డులను (ఆసియా, పసిఫిక్- 2024) కూడా ఈపీఎఫ్‌వో అందుకుంది. దీనితోపాటు క్లెయిమ్‌లను సరళీకరించడానికి, తప్పుడు/మోసపూరితమైన యూఏఎన్ లింకేజీలను తొలగించడానికి, ఆన్‌లైన్ బదిలీలనూ సవరణలనూ సులభతరం చేయడానికి, మినహాయింపుల రద్దు, పాత నిల్వల బదిలీ కోసం ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, సార్వత్రిక ఖాతా సంఖ్య (యూఏఎన్) ఆధారంగా లాగిన్ లేని సభ్యులు ఉమ్మడి ప్రకటనలను సమర్పించడానికి వీలుగా అనేక ఐటీ ఆధారిత ప్రజాహిత చర్యలను ప్రవేశపెట్టారు.
-
ఈపీఎఫ్‌వోలో క్రియారహితంగా ఉన్న ఖాతాల పరిష్కారం: ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం సభ్యుడికి 55 ఏళ్లు నిండిన తర్వాత లేదా ఉద్యోగ విరమణ చేసిన తేదీ నుంచి (ఏది ఆలస్యమైతే అది) వరుసగా మూడేళ్లు ఎలాంటి చందా జమ కాకపోతే ఆ ఖాతాను క్రియా రహిత ఖాతాగా పరిగణిస్తారు. ఇలాంటి ఖాతాలను పరిష్కరించడం కోసం.. వెయ్యి రూపాయలు లేదా అంతకన్నా తక్కువ మొత్తంలో క్లెయిమ్ చేయని నిల్వలున్న ఖాతాల్లో స్వయంచాలకంగా సెటిల్‌మెంటు ప్రక్రియను ప్రారంభించే పైలట్ ప్రాజెక్టును బోర్డు ఆమోదించింది. మొదటి దశలో దాదాపు అలాంటి 1.33 లక్షల ఖాతాలు, దాదాపు రూ. 5.68 కోట్లు ఈ సంస్కరణ పరిధిలో పరిష్కారం కానున్నాయి. కొత్త క్లెయిములూ లేదా పత్రాల అవసరం లేకుండానే.. నేరుగా సభ్యుల ఆధార్ సీడెడ్, ఈపీఎఫ్‌వోతో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాల్లో సదరు మొత్తాలు జమ అవుతాయి. ఈ విధానం ప్రక్రియను గణనీయంగా సరళీకృతం చేయడమే కాకుండా.. సభ్యులు తమ బకాయిలను వేగంగా పొందేందుకు సహాయపడుతుంది. ఈ పైలట్ ప్రాజెక్టు ఏ స్థాయిలో విజయవంతమవుతుందన్న దాన్ని బట్టి.. తదుపరి దశల్లో వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ నిల్వ ఉన్న ఖాతాలకు ఈ సదుపాయాన్ని విస్తరిస్తారు. తద్వారా ఈపీఎఫ్‌వోలో సభ్యుల ప్రయోజనాలే కేంద్రంగా సంస్కరణలను మరింత బలోపేతం చేస్తారు.
ఈ కార్యక్రమం వల్ల సభ్యులకు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు వేగంగా జమ అవుతాయి. ప్రక్రియలో జాప్యం తగ్గుతుంది. డేటా కచ్చితత్వం పెరుగుతుంది. ఈపీఎఫ్‌వో సభ్యులకు సేవలు పొందే సౌలభ్యం మెరుగుపడుతుంది.
-
ఈపీఎఫ్‌వో జమాఖర్చుల పట్టీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ పథకం- 1952, ఈపీఎస్- 1995, ఈడీఎల్ఐ పథకం-1976లకు చెందిన ఆడిట్ చేసిన ఈపీఎఫ్‌వో వార్షిక ఖాతాలను ఆమోదించి, వాటిని పార్లమెంటు ఎదుట ఉంచేందుకు సీబీటీ అనుమతి ఇచ్చింది.
-
ఈపీఎఫ్‌వో వార్షిక బడ్జెట్: ఈపీఎఫ్‌వో, ఆ సంస్థ నిర్వహించే పథకాలకు సంబంధించి 2025-26 సంవత్సరపు సవరించిన అంచనాలను, 2026-27 బడ్జెట్ అంచనాలను కూడా బోర్డు ఆమోదించింది.
-
సామాజిక భద్రతా చందాలకు సంబంధించి.. సామాజిక భద్రతా ఒప్పందంపై భారత్, బ్రిటన్ మధ్య ఒప్పందం: భారత్ ఇప్పటివరకు 22 ద్వైపాక్షిక సామాజిక భద్రత ఒప్పందాలపై సంతకాలు చేసింది. అయితే తొలిసారిగా సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ)లో భాగంగా ద్వంద్వ చెల్లింపుల నివారణ (డీసీసీ) ఒప్పందం కుదిరింది. సీఈటీఏతోపాటు పరస్పర డీసీసీ ఒప్పందంపై ఒక అనుబంధ లేఖపై కూడా 2025 జూలై 24న సంతకం చేశారు. రెండు దేశాల ప్రధానమంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి, బ్రిటన్ ట్రెజరీ కోశాగార కార్యదర్శి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది కార్మికుడికీ, యాజమాన్యాలకూ ఇద్దరికీ ఖర్చులను తగ్గిస్తుంది. తద్వారా భారతీయ ఉద్యోగుల పోటీతత్వాన్ని పెంచుతుంది.
-
కార్పొరేట్ చర్యలు, బైబ్యాక్, కాల్/పుట్ ఆప్షన్ల ప్రతిస్పందన ప్రోటోకాల్‌పై ఎస్వోపీ: పారదర్శకమైన, కాలపరిమితితో కూడిన వ్యవస్థను సంస్థాగతీకరించేందుకు ఒక సమగ్ర ఎస్వోపీని బోర్డు ఆమోదించింది. ఇది క్రమబద్ధమైన నిర్ణయాధికారం, పెట్టుబడుల పర్యవేక్షణ విభాగం ద్వారా పటిష్టమైన పర్యవేక్షణ, పునరావృత్తంగా పెట్టుబడులు, వడ్డీ రేట్ల నష్టాల నుంచి రక్షణ, స్పష్టమైన ఆడిట్ చర్యలకు అవకాశాన్నిస్తుంది. 2025 మార్చి నాటికి రూ. 28.34 లక్షల కోట్లకు పైగా ఉన్న ఏకీకృత నిధిని, అలాగే ప్రభుత్వ సెక్యూరిటీలు, ఎస్డీఎల్లు, పీఎస్‌యూ బాండ్లు, అనుమతులను పొందిన ఇతర సాధనాల్లో భారీ పెట్టుబడుల దృష్ట్యా.. సభ్యుల నిధులను రక్షించడానికి, రాబడిని పెంచడానికి కార్పొరేట్ చర్యలకు అనుగుణంగా సకాలంలో, క్రమబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం అత్యంత కీలకం.
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులపై తక్షణ నిర్ణయాలు తీసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా జాప్యం వల్ల తలెత్తే నష్టాలను తగ్గిస్తుంది. అదే సమయంలో అన్ని చర్యలూ కచ్చితంగా నిర్దేశించిన విధానాలు, పాలన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. సభ్యుల దీర్ఘకాలిక ప్రయోజనాల రక్షణ దీని ముఖ్యమైన లక్ష్యం.
-
ఈక్విటీ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ (ఎల్ఎంఎఫ్)లలో పెట్టుబడి, ఉపసంహరణ కోసం ఎస్వోపీ: ఈపీఎఫ్‌వో పథకాల్లో నిధుల నిర్వహణను బలోపేతం చేసే లక్ష్యంతో ఒక సమగ్ర ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ (ఎస్వోపీ)ని బోర్డు ఆమోదించింది. ఈ సంస్కరణలో భాగంగా నిధుల ఏకీకరణ, వార్షిక ఎస్ఐపీ విధానాన్ని అనుసరించడం, నిర్దిష్ట కార్యాచరణ కాలపరిమితులు, ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం వంటి అంశాలను పొందుపరిచారు.
ఈక్విటీ ఈటీఎఫ్ పెట్టుబడుల కోసం ఒక క్రమబద్ధమైన వ్యవస్థను ఈ ఎస్వోపీ ప్రవేశపెట్టింది. ఇందులో పెట్టుబడి పెట్టడానికి, ఉపసంహరించుకోవడానికి స్పష్టమైన నిబంధనలు, గరిష్ట పరిమితులు (ఎక్స్‌పోజర్ లిమిట్స్), నిబంధనల అమలు, పెట్టుబడి పర్యవేక్షణ విభాగం (ఐఎంసీ) ద్వారా పటిష్ట పర్యవేక్షణను పొందుపరిచారు. అంతేకాకుండా నిర్ణీత హోల్డింగ్ నిబంధనలు, నిరంతర పర్యవేక్షణతో లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లలో క్రమబద్ధమైన పెట్టుబడుల ద్వారా నగదు లభ్యత నిర్వహణను ఇది మరింత బలోపేతం చేస్తుంది.
నిర్ణీత ఆమోద ప్రక్రియ, ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి నిబంధనలకు కచ్చితంగా కట్టుబడి ఉండడం, సెంట్రల్ బోర్డుకు క్రమబద్ధమైన రిపోర్టింగ్, బహుళస్థాయి ఆడిట్ పర్యవేక్షణ ద్వారా.. మెరుగైన పాలనను ఈ వ్యవస్థ సంస్థాగతీకరిస్తుంది. తగిన రిస్క్ పరిమితులకు లోబడి గరిష్ట రాబడిని సాధించడం, నగదు లభ్యత ప్రణాళికను బలోపేతం చేయడం, కోట్లాది ఈపీఎఫ్ సభ్యుల దీర్ఘకాలిక ప్రయోజనాలను రక్షించడం ఈ సంస్కరణల లక్ష్యం.
-
బ్యాంకింగ్ సిబ్బంది ఎంపిక సంస్థ ద్వారా పరీక్షల నిర్వహణకు ఆమోదం: ఈపీఎఫ్‌వో తరఫున ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతి పరీక్షలను నిర్వహించే సంస్థగా ఐబీపీఎస్‌ను బోర్డు ఆమోదించింది. పారదర్శకంగా, సకాలంలో నియామకాలు జరిగేలా ఇది భరోసానిస్తుంది. తద్వారా ఖాళీలు వేగంగా భర్తీ అవడంతోపాటు భాగస్వాములకు మెరుగ్గా సేవలందుతాయి.
***
(రిలీజ్ ఐడి: 2235453)
సందర్శకుల సూచీ సంఖ్య : : 67