పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
మధ్యప్రాచ్యంలో పరిణామాల నేపథ్యంలో పూర్తి సన్నద్ధతతో భారత్... పటిష్టంగా ఇంధన సరఫరా
· వివిధ మార్గాల్లో ముడి చమురు, పెట్రోలియం కొనుగోళ్లు.. సరఫరా తీరును పర్యవేక్షించేలా 24×7 కంట్రోల్ రూం
నాడు పోస్టు చేయడమైనది:
03 MAR 2026 4:51PM by PIB Hyderabad
మధ్యప్రాచ్యంలో ఘర్షణలు, ఇంధనం విషయంలో ప్రపంచవ్యాప్త పరిణామాల నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సంసిద్ధతను పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ మీడియాకు వివరించారు.
భారత్ ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద దిగుమతిదారుగా, శుద్ధి చేసే విషయంలో నాలుగో అతిపెద్ద దేశంగా, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపరంగా అయిదో స్థానంలోనూ ఉందని మంత్రి తెలిపారు. మధ్యప్రాచ్యం నుంచి తలెత్తే స్వల్పకాలిక అంతరాయాలను ఎదుర్కొనేలా.. తగిన స్థాయిలో ముడి చమురు నిల్వలు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటి కీలక పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు దేశంలో సిద్ధంగా ఉన్నాయన్నారు.
కొన్నేళ్లుగా భారత్ వివిధ దేశాల నుంచి ఇంధన వనరులను సేకరించడం ద్వారా ప్రజలకు ఇంధన లభ్యతనూ, అందుబాటు ధరలనూ సుస్థిరం చేసిందని వివరించారు. భారతీయ ఇంధన కంపెనీలకు ప్రస్తుతం హార్ముజ్ జలసంధి గుండా వెళ్లనవసరం లేని ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలున్నాయని మంత్రి తెలిపారు. ఆ సరుకు రవాణా నౌకలు అందుబాటులో ఉంటాయనీ, హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణంలో తాత్కాలిక అంతరాయం ప్రభావాన్ని తగ్గించడానికి ఇవి తోడ్పడతాయనీ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, నిల్వల స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించడానికి 24x7 కంట్రోల్ రూమును మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం నిల్వల విషయంలో ప్రభుత్వం సంతృప్తితో ఉంది. భారతీయ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది. నిరంతర పర్యవేక్షణ ఆధారంగా.. పరిస్థితిని మరింత చక్కదిద్దడం కోసం అవసరమైతే దశలవారీగా చర్యలు తీసుకోవచ్చనే జాగ్రత్తతో కూడిన ఆశాభావాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2235153)
సందర్శకుల సూచీ సంఖ్య : : 117
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam