ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026: కీలక అంతర్జాతీయ ప్రకటనలు, పెట్టుబడులకు హామీలు
నాడు పోస్టు చేయడమైనది:
02 MAR 2026 10:09AM by PIB Hyderabad
2026 ఫిబ్రవరి 16 నుంచి 21 వరకు జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026 అంతర్జాతీయ కృత్రిమ మేధ రంగంలో ఒక కీలక మైలురాయి. ఈ సదస్సు విశేష ఆదరణ పొందింది. దాదాపు 6 లక్షల మంది ప్రత్యక్షంగా హాజరవగా.. వర్చువల్‌గా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మొత్తం 9 లక్షల మందికి పైగా వీక్షించారు. వందకు పైగా దేశాల ప్రతినిధులు, 20 అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో చర్చల్లో పాల్గొన్నాయి.
ఈ సదస్సు సందర్భంగా ‘బాధ్యతాయుత ఏఐ వినియోగంపై 24 గంటల్లోనే రికార్డు స్థాయి ప్రతిజ్ఞలు’ చేయించి గిన్నిస్ ప్రపంచ రికార్డును భారత్ నెలకొల్పింది. బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తూ 2.5 లక్షల మందికి పైగా ప్రతిజ్ఞలు చేశారు.
భారత్ సొంత కంప్యూటింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోబోతున్నామంటూ చేసిన ప్రకటన ఈ సదస్సులో అత్యంత కీలకమైనది. ఇండియా ఏఐ మిషన్ కింద ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 38,000 జీపీయూలకు తోడు.. రాబోయే కొన్ని వారాల్లోనే మరో 20,000 జీపీయూలను అదనంగా జోడించనున్నారు. దీంతో దేశ ఏఐ మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమవుతాయి.
అంతర్జాతీయ ఏఐ ప్రకటనలు, వ్యూహాత్మక ఏఐ భాగస్వామ్యాలు
అంతర్జాతీయ స్థాయిలో కృత్రిమ మేధ వినియోగం బాధ్యతాయుతంగా, పటిష్టంగా, అందరికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు విధివిధానాలను రూపొందించడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించింది.
- మొత్తం 92 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఈ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రకటనను ఆమోదించాయి. ఈ సదస్సులో భాగంగా ఏడు అంశాలపై పని చేసిన వర్కింగ్ గ్రూపుల కృషిని ఈ ప్రకటన ప్రశంసించింది.
- విశ్వసనీయ, అందరికీ ఉపయోగపడేలా ఏఐని అందుబాటులోకి తేవడం లక్ష్యంగా.. పేరెన్నికగన్న 13 అగ్రశ్రేణి అంతర్జాతీయ, భారతీయ అత్యాధునిక ఏఐ మోడళ్ల డెవలపర్లు ‘న్యూఢిల్లీ ఫ్రాంటియర్ ఏఐ ఇంపాక్ట్ కమిట్‌మెంట్స్’ను ప్రకటించాయి.
- సామాజిక ప్రయోజనం, ఆర్థిక వృద్ధి కోసం కృత్రిమ మేధను విజయవంతంగా అమలు చేసిన విధానాలను ఒకరితో ఒకరు పంచుకునేందుకూ, అన్ని దేశాల్లో వాటి అమలుకూ, వాటిని భారీగా విస్తరించేందుకూ వీలుగా గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ కామన్స్ (http://aiimpactcommons.global) వేదికను ప్రారంభించారు. 30కి పైగా దేశాలకు చెందిన 80కి పైగా స్ఫూర్తిదాయకమైన ఏఐ విజయగాథలు ఇందులో ఉన్నాయి.
- అంతర్జాతీయ కార్మిక సంస్థ భాగస్వామ్యంతో ‘న్యాయబద్ధంగా ఏఐ దిశగా పరివర్తన’ ప్లేబుక్‌ను విడుదల చేశారు. ఏఐ వల్ల రాబోయే కొత్త అవకాశాలను అందుకునేలా ఉద్యోగులను సంసిద్ధులను చేయడం దీని లక్ష్యం.
- పటిష్టమైన, వినూత్నమైన, సమర్థమైన కృత్రిమ మేధ లక్ష్యంగా రూపొందించిన ‘స్వచ్ఛంద మార్గదర్శక సూత్రాల’పై 20కి పైగా దేశాలు సంతకాలు చేశాయి.
- కృత్రిమ మేధ యుగంలో ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ‘స్వచ్ఛంద మార్గదర్శక సూత్రాల’ను 23 దేశాలు అంగీకరించాయి.
- ప్రజాస్వామ్య బద్ధంగా ఏఐ విస్తరణ లక్ష్యంగా రూపొందించిన చార్టర్‌పై 22 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు సంతకాలు చేశాయి.
- యునెస్కో, ఫ్రాన్స్ భాగస్వామ్యంతో ‘సురక్షిత/ పటిష్ట ఏఐ చాలెంజ్’ ప్రారంభం.
- పటిష్టమైన ఏఐ మౌలిక సదుపాయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్లేబుక్ విడుదల.
- అధికారికంగా ప్రారంభించడానికి ముందే, 22 భాగస్వామ్య దేశాల మద్దతుతో ‘ట్రస్టెడ్ ఏఐ కామన్స్’ ఏర్పాటును ప్రకటించారు.
- ఏఐ నిర్వహణపై విడుదల చేసిన మార్గదర్శక పత్రాలను 22 దేశాలు ఆమోదించాయి.
- యునిసెఫ్, 20 దేశాల ఆమోదంతో ‘ఏఐ ద్వారా సమ్మిళితత్వ పురోగతి కూటమి’ ఏర్పాటును ప్రకటించారు.
- ప్రారంభంలోనే 19 భాగస్వామ్య దేశాల మద్దతుతో ‘వైజ్ఞానిక సంస్థల కోసం ఏఐ నెట్‌వర్క్’ను ప్రారంభించారు.
ఏఐ ఇంపాక్ట్ ఎక్స్ పో, విజ్ఞానదాయక ఫలితాలు, క్షేత్రస్థాయి విస్తరణ
అంశాలవారీగా 10 విభాగాలలో 850కి పైగా ప్రదర్శనకారులతో నిర్వహించిన ఈ ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో.. ప్రపంచంలో అతిపెద్ద ఏఐ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఒక అద్భుత ప్రదర్శన నిర్వహించారు. వాయిస్ కమాండ్ల ద్వారా వస్తువులను, పరిసరాలను గుర్తించి, వాటి గురించి వివిధ భాషల్లో సమాధానమిచ్చేలా రూపొందించిన.. చేతిలో ఇమిడే ఒక ఓపెన్ సోర్స్ సహాయక పరికరాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు. భాషిణి, కరెంట్ ఏఐ కలిసి అభివృద్ధి చేసిన ఈ ప్రోటోటైప్‌ను.. మరింత సాంకేతిక మెరుగుదల, వినియోగ మార్గాల అభివృద్ధి కోసం అంకుర సంస్థలకు అందుబాటులోకి తెచ్చారు.
అత్యంత ప్రభావవంతమైన ఏఐ వినియోగ పద్ధతులను వివరిస్తూ.. ఆరు గ్లోబల్ కేస్‌బుక్స్ ను విడుదల చేశారు:
- ఆరోగ్యంలో ఏఐ (డబ్ల్యూహెచ్‌వోతో కలిసి)
- ఇందన రంగంలో ఏఐ (ఐఈఏతో కలిసి)
- మహిళా సాధికారతలో ఏఐ (యూఎన్ విమెన్‌తో కలిసి)
- వ్యవసాయంలో ఏఐ (ప్రపంచ బ్యాంకు మద్దతుతో మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి)
- విద్యలో ఏఐ (సీఎస్ఎఫ్, ఏక్‌స్టెప్ ఫౌండేషన్‌తో కలిసి)
- ప్రవేశ యోగ్యతలో ఏఐ (ఏఎల్ఐఎంసీవో, ఐఐటీ- బెంగళూరు, చేంజ్ ఇంక్ ఫౌండేషన్‌తో కలిసి)
దేశంలోని ఏఐ, డీప్‌టెక్ అంకుర సంస్థల స్థితిగతులు, ప్రగతిని వివరిస్తూ.. ఏఐ ఇంపాక్ట్ స్టార్టప్ బుక్ ను కూడా ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
ఈ సదస్సు సమయంలో ఫుడ్‌కోర్టుల్లో జరిగిన లావాదేవీల్లో దాదాపు 80 శాతం యూపీఐ ద్వారానే జరగడం విశేషం. క్షేత్రస్థాయిలో డిజిటల్ వినియోగం ఏ స్థాయిలో ఉందో దీని ద్వారా స్పష్టమవుతోంది.
ముఖ్యమైన పెట్టుబడుల ప్రకటనలు
ఏఐ రంగంలోని ప్రతీ దశలోనూ గణనీయమైన పెట్టుబడుల హామీలకు ఈ సదస్సు వేదికైంది.
- మౌలిక సదుపాయాలు, ప్రాథమిక నమూనాలు, హార్డ్‌వేర్, అప్లికేషన్ల రంగాల్లో.. ఏఐ సంబంధిత విభాగాల్లో 200 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వస్తాయని అంచనా.
- ఏఐ కేంద్రీకృత మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా.. వచ్చే ఏడేళ్లలో 110 బిలియన్ డాలర్ల పెట్టుబడికి రిలయన్స్ ఇండస్ట్రీస్ హామీ ఇచ్చింది.
- ఏఐ సాంకేతికతకు సన్నద్ధంగా ఉండేలా డేటా సెంటర్లను భారీ స్థాయిలో విస్తరించేలా.. ఓపెన్ ఏఐతో భాగస్వామ్యాన్ని టాటా గ్రూప్ ప్రకటించింది.
- 2035 నాటికి 100 బిలియన్ డాలర్ల పెట్టుబడుల దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రకటించింది.
- జనరల్ క్యాటలిస్ట్ రాబోయే ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించగా.. లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించింది.
- గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక పెట్టుబడులను ప్రకటించారు. భారత్ - అమెరికా మధ్య నూతన సముద్రాంతర కేబుల్ మార్గాలను, విశాఖపట్నంలో 15 బిలియన్ డాలర్లతో ఏఐ హబ్ ఏర్పాటును ఆయన ప్రకటించారు. అలాగే 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ శిక్షణ ఇస్తుందనీ, 1.1 కోట్ల మంది విద్యార్థులకు తోడ్పాటును అందిస్తుందనీ, ఏఐ పరిశోధనల్లో భాగస్వామ్యాలను మరింత విస్తరిస్తామనీ వివరించారు.
బాధ్యతాయుత, సమ్మిళిత, అభివృద్ధి కేంద్రీకృత కృత్రిమ మేధ కోసం ఉమ్మడి అంతర్జాతీయ దార్శనికతను ముందుకు తీసుకెళ్లే వ్యూహాత్మక భాగస్వామ్యాలు, భవిష్యత్ కార్యాచరణ హామీలతో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026’ విజయవంతంగా ముగిసింది. ఆర్థిక వృద్ధి, సామాజిక సాధికారత, సుస్థిరాభివృద్ధి కోసం ఏఐని వినియోగించుకుంటూనే.. అధునాతన సాంకేతికతలను విస్తృతంగా, సమానంగా, ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చే దిశగా ఒక విస్తృతమైన అంతర్జాతీయ ఏకాభిప్రాయాన్ని ఈ సదస్సు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
***
(రిలీజ్ ఐడి: 2234675)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3