హోం మంత్రిత్వ శాఖ
గురు తేగ్ బహాదుర్ గారికి నివాళులు అర్పించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా.. గురు సాహిబ్ 350వ షహీదీ దివస్ సూచకంగా మహారాష్ట్రలోని నవీ ముంబయిలో ఏర్పాటు చేసిన సమావేశానికి తరలివచ్చిన వారిని ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి
గురు తేగ్ బహాదుర్ గారి 350వ షహీదీ దివస్‌ను జాతీయ స్థాయిలో స్మరించుకొందామని నిర్ణయించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. ఇది పూర్తి దేశానికి దక్కిన సౌభాగ్యం
తొమ్మిదో గురువైన శ్రీ తేగ్ బహాదుర్ జీ హిందూ ధర్మ పరిరక్షణకు ప్రాణ త్యాగం చేయక పోయినట్లయితే, యావత్తు ప్రపంచంలో ఒక్క హిందువయినా మిగిలే వారే కాదు
ధర్మ పరిరక్షణ కోసం, సంస్కృతి కోసం తన తల తెగనరికించుకోవడానికి అయినా సరే సిద్ధపడ్డ శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ రాబోయే తరాల వారికి స్ఫూర్తిగా నిలుస్తారు
కాశ్మీరీ పండితులపై మొగల్ ఆక్రమణదారులు ఒడిగట్టిన క్రూరత్వాన్ని ఎదురించే రక్షాకవచం లాగా మారారు శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ
గురువులకు సేవ చేయడానికి అంకితమైన ప్రతి సముదాయం చేస్తున్న సేవా కార్యక్రమాలను వెలుగులోకి తీసుకు వస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను
ధర్మం కోసం ‘సర్‌బంస్‌దానీ’ గురు గోబింద్ సింగ్ జీ తన యావత్తు కుటుంబాన్నే త్యాగం చేశారు.. ఆయనంత పరాక్రమశాలి చరిత్రలో మరెవ్వరూ లేరు
‘‘నామ్ జపో, కీరత్ కరో, వండ్ ఛకో’’ మంత్రాన్ని శ్రీ గురు నానక్ దేవ్ జీ మహారాజ్ మనకిచ్చి, వేల సంవత్సరాల భారత్ సంప్రదాయానికి కొత్త ఊపిరులు ఊదారు
శ్రీ గురు నానక్ దేవ్ జీ మహారాజ్ మొదలు గురు గోబింద్ సింగ్ జీ వరకూ.. గురువులంతా వివిధ కాలాల్లో వివిధ రూపాల్లో కొన్ని మొగల్ తరాల బారి నుంచి ధర్మాన్ని కాపాడి, సమాజాన్ని పటిష్ఠపరిచారు
పది మంది గురువుల జీవితం నుంచి దేశ ప్రజలు స్ఫూర్తిని పొంది, మత మార్పిడికి వ్యతిరేకంగా ఏకతాటి మీదకు రావాలి
నాడు పోస్టు చేయడమైనది:
01 MAR 2026 9:02PM by PIB Hyderabad
గురు శ్రీ తేగ్ బహాదుర్ జీకి కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా నివాళులు అర్పించారు. గురు సాహిబ్ 350వ షహీదీ దివస్‌కు గుర్తుగా మహారాష్ట్రలోని నవీ ముంబయిలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన జనసమూహాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్‌ణవీస్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ ఏక్‌నాథ్ షిందే, శ్రీమతి సునేత్ర పవార్‌లతో పాటు ఇతర ప్రముఖులు అనేక మంది పాల్గొన్నారు.
గురు తేగ్ బహాదుర్ గారి 350వ షహీదీ దివస్‌ను జాతీయ స్థాయిలో స్మరించుకొందామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారని, ఇది పూర్తి దేశానికి దక్కిన సౌభాగ్యమని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. గురు తేగ్ బహాదుర్ జీవిత చరిత్రను యువత చెంతకు చేర్చడం కోసం మహారాష్ట్రలో అన్ని ప్రాంతాలలోనూ ప్రత్యేక కార్యక్రమాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్‌ణవీస్ ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. తొమ్మిదో గురువైన శ్రీ తేగ్ బహాదుర్ జీ హిందూ ధర్మాన్ని, హిందువుల్ని కాపాడటం కోసం బలిదానాన్ని ఇచ్చి ఉండకపోతే పూర్తి ప్రపంచంలో ఒక్కరంటే ఒక్క హిందువు అయినా సరే ప్రాణాలతో ఉండేవారు కాదు అని శ్రీ షా అన్నారు. భారత్‌లోనూ, ప్రపంచంలోనూ సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్లు చిత్రహింసను భరించి, హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం అమరత్వాన్ని ఆహ్వానించిన శ్రీ తేగ్ బహాదుర్ జీకి తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని శ్రీ షా అన్నారు.
ఏకత, సోదరభావం, సమ్మిళితత్వం, సాహసం.. ఇవి సిక్కు సంప్రదాయంలో కీలకమనీ, ఇవే అంశాలను గురు గ్రంథ్ సాహిబ్‌లో ఉల్లేఖించారనీ కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. సంత్ నామ్‌దేవ్ జీ, నరసీ మెహతా జీ, సంత్ కబీర్ జీ, సంత్ రవిదాస్ జీలతో పాటు ఇతర ప్రముఖ సాధువులు అనేకుల పదాలను పదో గురువు గురు గోబింద్ సింగ్ జీ గురు గ్రంథ్ సాహిబ్‌లో చేర్చారని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అనేక సముదాయాలను గురు తేగ్ బహాదుర్ జీతో సంధానించిందని ఆయన చెప్పారు.
గురు నానక్ దేవ్ జీ సరళమైనవే అయినప్పటికీ గాఢత కలిగిన మూడు సిద్ధాంతాలను మానవ జాతికి అందించారు.. అవే.. ‘నామ్ జపో’, ‘కీరత్ కరో’, ‘వండ్ ఛకో’ అనీ కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఈ మూడు సిద్ధాంతాల భావం దైవ నామాన్ని నిరంతరం ధ్యానం చేయండి, నిజాయతీతో పని చేయండి, కలిసికట్టుగా భోజనం చేయండి అని. ఇవి పరస్పర భాగస్వామ్యానికి అద్దం పడతాయి. ఈ సంప్రదాయమే తరువాత తరువాత లంగర్‌గా మారింది. సామూహిక వంటగదిగా రూపుదిద్దుకొంది. అది.. మొగలులతో పోరాడటంలో పెద్ద సహాయకారిగా నిలిచిందని ఆయన వివరించారు. గురు నానక్ దేవ్ జీ మహారాజ్ భారత్‌కు చెందిన వేలాది సంవత్సరాల పురాతన సంప్రదాయాన్ని పునరుద్ధరించారనీ, దానికి కొత్త జీవనాన్ని ఇచ్చారనీ, గురు తేగ్ బహాదుర్ జీ కూడా ఇదే సంప్రదాయాన్ని అనుసరించారనీ శ్రీ షా అన్నారు.
హిందూ ధర్మాన్నీ, ఆ ధర్మావలంబులనీ పరిరక్షించడానికి గురు తేగ్ బహాదుర్ జీ ఒక్క క్షణం సేపయినా వెనుకాడలేదు, స్వయంగా సంకల్పించుకొన్న ప్రతిదానినీ నెరవేర్చారు అని శ్రీ అమిత్ షా అన్నారు. కాశ్మీరీ పండితులు ఇక్కట్లను ఎదుర్కోవలసి వస్తే, అప్పుడు వారి ప్రతినిధులు గుమికూడి తమను కాపాడాల్సిందిగా గురు సాహబ్‌ను వేడుకొన్నారని ఆయన తెలిపారు. అది మొదలు ఇప్పటి వరకూ ప్రపంచం నలు మూలలా కాశ్మీరీ పండితులు గురు సాహబ్‌తో మమేకమయ్యారని శ్రీ షా చెప్పారు.
హిందువుల కోసం, యావత్తు దేశ ప్రజల కోసం శ్రీ గురు తేగ్ బహదూర్ జీ చేసిన సేవలను ఎన్నటికీ మరచిపోలేమని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అన్నారు. ఔరంగజేబ్ హయాంలో, 1675లో చోటు చేసుకొన్న ఆయన ఆత్మబలిదానం దేశ ప్రజలలో సాహసాన్ని పెంపొందింప చేయడం ఒక్కటే కాకుండా, ఔరంగజేబ్ అణచివేత చర్యల వెన్ను విరిచింది అని కూడా ఆయన వివరించారు. మహారాష్ట్ర, పంజాబుల మధ్య గాఢమైన సంబంధాలు ఉన్నాయని, పదో గురువు తన పార్థివ శరీరాన్ని త్యజించడానికి ఎన్నుకొన్న భూమి ఇది అని ఆయన వెల్లడించారు. సంత్ నామ్‌దేవ్ జీ భక్తి సంప్రదాయం, ఆయన బోధలు సిక్కు గురువుల శ్లోకాల్లో ప్రతిబింబిస్తున్నాయని, అవి ఈనాటికీ గురు గ్రంథ్ సాహిబ్‌లో సంరక్షణకు నోచుకున్నాయని శ్రీ షా చెప్పారు.
దేశం నలుమూలలా హిందువులతో పాటు సిక్కులను రక్షించడం కోసం గురు తేగ్ బహాదుర్ జీ తన ప్రాణాలను బలిదానమిచ్చారని, గురు గోబింద్ సింగ్ జీ మహారాజ్ ఖాల్‌సా పంథ్‌ను స్థాపించారని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఆయన ఒక చేతిలో మాలనూ, రెండో చేతిలో భాలా (ఈటె)నూ పట్టుకొని సిక్కులను ఔరంగజేబ్ అకృత్యాలకు విరుద్ధంగా సంఘటిత పరిచి, ఒక గొప్ప పోరాటానికి నాంది పలికారన్నారు.
గురు నానక్ దేవ్ జీ మహారాజ్ మొదలు గురు గోబింద్ సింగ్ జీ వరకూ గురువులంతా వేరు వేరు కాలాల్లో వివిధ మార్గాల్లో సమాజాన్ని పటిష్ఠపరచడానికీ, అణచివేతకు పాల్పడ్డ అనేక తరాల మొగలుల బారి నుంచి ధర్మాన్ని రక్షించడానికి పాటుపడ్డారని కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. గురు నానక్ దేవ్ జీ మహారాజ్ జ్ఞానాన్ని ప్రచారం చేయడంతో పాటు సమాజంలో అనేక దురాచారాలను, మూఢ నమ్మకాలను పారదోలారు. గురు అంగద్ దేవ్ జీ విద్య ముఖ్యమనే సందేశాన్ని వ్యాప్తిలోకి తీసుకు వచ్చారు, గురు అమర్ దాస్ జీ సాంఘిక సద్భావనని, సమానత్వాన్ని ప్రోత్సహించారు, గురు రామ్ దాస్ జీ ఒక బలమైన పునాదిని వేయడం కోసం అనేక సంస్థలను ఏర్పాటు చేశారు, గురు అర్జన్ దేవ్ జీ సాంస్కృతిక సమ్మిళితత్వ సాధన కోసం కృషి చేశారు, గురు హర్‌గోబింద్ సాహిబ్ భక్తి, ధర్మ రక్షణ దృష్టికోణాన్ని అందించారు, గురు హర్ రాయ్ జీ కరుణ సందేశాన్ని పూర్తి ప్రపంచంలో వ్యాప్తి చేశారు, గురు తేగ్ బహాదుర్ జీ ‘హింద్ కీ చాదర్’ స్వరూపాన్ని పూర్తి ప్రపంచం సమక్షంలో ఆవిష్కరించారు, గురు గోబింద్ సింగ్ జీ గురు గ్రంథ్ సాహిబ్ వెలుగులను ప్రసారం చేస్తూ ఖాల్‌సా పంథ్‌ను స్థాపించారు అని ఆయన వివరించారు. సిక్కు ధర్మ గురువులైన పది మందీ నెలకొల్పిన సంప్రదాయం ఒక్క భారత్‌కే కాకుండా పూర్తి ప్రపంచానికి మార్గదర్శకమని శ్రీ షా అన్నారు. పది మంది గురువుల్లో అందరి జీవితం నుంచీ స్ఫూర్తిని పొంది దేశంలోని పౌరులంతా మత మార్పిడికి వ్యతిరేకంగా ఏకతాటి మీదకు రావాలని ఆయన అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2234672)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16