నీతి ఆయోగ్
రాష్ట్ర మద్దతు మిషన్ కింద ప్రకృతి వ్యవసాయంపై జాతీయ వర్క్‌షాప్ నిర్వహించిన నీతి ఆయోగ్
నాడు పోస్టు చేయడమైనది:
02 MAR 2026 2:13PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ తన స్టేట్ సపోర్టు మిషన్(రాష్ట్ర మద్దతు మిషన్) కింద ప్రకృతి వ్యవసాయంపై రెండు రోజులపాటు జాతీయ వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు, విధాన నిర్ణేతలు, శాస్త్రవేత్తలు, అంకుర సంస్థలు, పౌర సమాజ సంస్థలు పాల్గొన్నాయి.
ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ మార్గదర్శక పుస్తకాలను ఆవిష్కరించడం ఈ వర్క్‌షాప్ ప్రధానాంశం. హిందీ, ఆంగ్ల భాషల్లో రూపొందించిన ఈ మాన్యువల్స్.. ప్రకృతి వ్యవసాయ పద్దతులపై ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు, వ్యవసాయ విస్తరణాధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఆచరణాత్మక సమాచారాన్ని అందించి వారిని సాధికారులను చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
గుజరాత్, మహారాష్ట్ర గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. స్థిరమైన, రైతు కేంద్రీకృత వ్యవసాయ వ్యవస్థల ప్రాముఖ్యతను వివరించారు. నేల సారాన్ని మెరుగుపరచడంలో, పెట్టుబడి ఖర్చులను తగ్గించడంలో, రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రకృతి వ్యవసాయం పోషించే కీలక పాత్రను వివరించారు.
ఈ కార్యక్రమంలో జునాగఢ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ వైఎస్. పర్మార్ ఉద్యానవన, అటవీ విశ్వవిద్యాలయం, గుజరాత్ ప్రకృతి వ్యవసాయ శాస్త్ర విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్య, పరిశోధనా సంస్థలు పాల్గొన్నాయి.
పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా నుంచి రైతులు, వ్యవసాయ అధికారులు కృషి విజ్ఞాన కేంద్రాల (కేవీకే) శాస్త్రవేత్తలు ఈ చర్చలలో పాల్గొన్నారు, ఇది ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లడంలో దేశవ్యాప్త ఆసక్తిని ప్రతిబింబిస్తుంది.
ఏపీఈడీఏ, నాబార్డ్, సహకార మంత్రిత్వ శాఖ, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఏటీఏఆర్ఐలు వంటి కీలక కేంద్ర సంస్థలు, మంత్రిత్వ శాఖల అధికారులు కూడా వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. వీరు వివిధ పథకాల కలయిక, ధ్రువీకరణ, మార్కెట్ అనుసంధానం, సంస్థాగత మద్దతుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అంకుర సంస్థలు, పౌర సమాజ సంస్థలు, ఆదర్శ రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా పాల్గొన్నాయి. ఇది దేశంలో ప్రకృతి వ్యవసాయానికి మద్దతుగా అభివృద్ధి చెందుతున్న బలమైన వ్యవస్థను ప్రతిబింబించింది.
మొదటి రోజున మొత్తం 770 మంది ప్రతినిధులు ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించడంలో ఎదురయ్యే సవాళ్లు, ధ్రువీకరణ, మార్కెటింగ్, సంస్థాగత మద్దతుపై రైతులు, క్షేత్రస్థాయి నిపుణులు తమ సందేహాలను, క్షేత్రస్థాయి సమస్యలను బహిరంగంగా చర్చించడానికి ఓ చర్చా వేదికను నిర్వహించారు. బలమైన క్షేత్రస్థాయి ప్రదర్శనలు, శాస్త్రీయ ఆధారాలతో కూడిన ధ్రువీకరణ, రైతు కేంద్రీకృత నమూనాల ఆవశ్యకతపై ఏకాభిప్రాయంతో తొలిరోజు కార్యక్రమం ముగిసింది.
రెండో రోజు క్షేత్ర సందర్శనలు, ప్రత్యక్ష ప్రదర్శనలపై కార్యక్రమం దృష్టి సారించింది. దీనివల్ల ప్రకృతి వ్యవసాయ పద్ధతులను నేరుగా గమనించడానికి నిపుణులతో ముఖాముఖి చర్చించడానికి పాల్గొన్నవారికి అవకాశం కలిగింది. ఈ క్షేత్ర సందర్శనలో భాగంగా వివిధ రకాల విదేశీ పంటలకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఎలా వర్తింపజేయాలో ప్రదర్శించారు. అలాగే పొలంలోనే జీవ ఎరువులు, కషాయాల తయారీ, ఆటోమేషన్ పద్ధతుల ద్వారా వాటి వినియోగాన్ని వివరించారు.
శిక్షణ మాన్యువల్‌లను ఇక్కడ పొందండి:
రైతుల సాధికారత: ప్రకృతి వ్యవసాయ శిక్షణ టూల్‌కిట్, ఉత్తమసాగు పద్దతుల మార్గదర్శిhttps://niti.gov.in/sites/default/files/2026-03/Training-Manual-English.pdf
కిసాన్ సశక్తికరణం: ప్రకృతి ఖేతి పరిశోధన, ఉత్తమ సాగు పద్దతుల మార్గదర్శి https://niti.gov.in/sites/default/files/2026-03/Training-manual-Hindi.pdf
***
(రిలీజ్ ఐడి: 2234668)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5