రాష్ట్రపతి సచివాలయం
పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ వేదికగా ‘వాయు శక్తి–2026’ విన్యాసాలను ప్రత్యక్షంగా వీక్షించిన భారత రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
27 FEB 2026 8:46PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో గల పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ వేదికగా జరిగిన ‘వాయు శక్తి–2026’ విన్యాసాలను వీక్షించారు. వాయు శక్తి ఒక నిర్మాణాత్మక కార్యాచరణ కథాంశాన్ని అనుసరిస్తూ ప్రత్యక్ష, సమగ్ర పోరాట దృశ్యాన్ని ప్రదర్శించింది. ఈ ప్రదర్శనకు హాజరైన ప్రముఖుల్లో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏ.పీ. సింగ్ ఉన్నారు.
వాయు శక్తి-2026 భారత వైమానిక దళ ధైర్యాన్ని, అంకితభావాన్ని, వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. నిర్మాణాత్మక, అనుకరణ యుద్ధ పరిస్థితుల్లో వేగంగా, కచ్చితత్వంతో దాడులు చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రాథమిక లక్ష్యంతో ఈ విన్యాసాలను నిర్వహించారు. వివిధ యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, దాడులు చేసేందుకు ఉపయోగించే హెలికాప్టర్లు ఈ విన్యాసాల్లో నిర్దేశిత లక్ష్యాలను విజయవంతంగా చేధించాయి.
ఎడారిలో విమానాల ఉరుముల గర్జన, కచ్చితత్వంతో కూడిన బాంబు దాడులు భారత వైమానిక దళ ఆధునిక పోరాట బలాన్ని, కార్యాచరణ సంసిద్ధతను స్పష్టంగా ప్రదర్శించాయి. రాఫెల్, సుఖోయ్ Su-30MKI, హెచ్ఏఎల్ తేజస్, మిరాజ్ 2000 వంటి భారత వైమానిక దళ అధునాతన యుద్ధ విమానాలు, గాలి నుంచి భూమిపై లక్ష్యాలను చేధించే బాంబులు, క్షిపణులను ఉపయోగించి కచ్చితత్వంతో లక్ష్యాలను నాశనం చేశాయి. శత్రువుల బంకర్‌లు, రన్‌వేలు, కమాండ్ సెంటర్‌లను కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకున్నాయి. బోయింగ్ అపాచీ, బోయింగ్ చినూక్ హెలికాప్టర్లు తక్కువ ఎత్తులో ఉన్న రాకెట్, గన్ ఫైరింగ్ డ్రిల్‌లు, క్షతగాత్రుల తరలింపు కార్యకలాపాలు, కష్టతరమైన యుద్ధరంగ భూభాగాలకు పరికరాల రవాణాను విజయవంతంగా నిర్వహించాయి.
'వాయు శక్తి–2026' మందుగుండు సామగ్రి ప్రదర్శనతో పాటుగా సాంకేతికత, ఏకీకరణ, వేగవంతమైన ప్రతిస్పందన సామర్థ్యాల సమన్వయ ప్రదర్శనగా నిలిచింది. ఈ విన్యాసాలు పగలు, రాత్రి వేళల పరిస్థితుల్లో పోరాట కార్యకలాపాలకు సంసిద్ధతను ప్రదర్శించింది. ఇది గగనతల ఆధిపత్యం, నేలపై మద్దతు, సరుకుల రవాణా మద్దతు వంటి సమగ్ర యుద్ధకాల కార్యకలాపాలను విజయవంతంగా పరీక్షించింది. వాయుశక్తి-2026 బహు విధ దళాలకు, జాతీయ భద్రతా వ్యూహానికి మూలాధారంగా ఐఏఎఫ్ సంసిద్ధతను పునరుద్ఘాటించింది.
***
(రిలీజ్ ఐడి: 2233785)
సందర్శకుల సూచీ సంఖ్య : : 68