ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మార్చి 1న తమిళనాడు, పుద్దుచ్చేరీల్లో ప్రధాని పర్యటన


· పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్న ప్రధాని.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన

· పుదుచ్చేరిలో మౌలిక సదుపాయాలు, పట్టణ సేవలు, పారిశ్రామికాభివృద్ధి, విద్య, ఆరోగ్య రక్షణ, సుస్థిరాభివృద్ధిని బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రాజెక్టులు

· మధురైలో రూ. 4,400 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్న ప్రధాని.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన

· జాతీయ రహదారి- 332(ఎ)లోని మరక్కనం - పుదుచ్చేరి సెక్షన్, జాతీయ రహదారి- 87 లోని పరమకుడి - రామనాథపురం సెక్షన్ నాలుగు వరుసల రహదారి పనులకు శంకుస్థాపన

· తమిళనాడులో ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన 8 రైల్వే స్టేషన్లను ప్రారంభించి.. చెన్నై బీచ్ - చెన్నై ఎగ్మోర్ నాలుగో లైన్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని

· తిరుప్పరంకుండ్రంలోని అరుళ్మిగు సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని దర్శించుకుని, పూజలు చేయనున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 27 FEB 2026 4:40PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మార్చి 1న తమిళనాడు, పుదుచ్చేరిలలో పర్యటిస్తారు. రాజస్థాన్, గుజరాత్ పర్యటన అనంతరం.. ఫిబ్రవరి 28 రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ప్రధానమంత్రి చెన్నై చేరుకుంటారు.

మార్చి 1న ఉదయం 11:45 గంటల సమయంలో పుదుచ్చేరిలో రూ. 2,700 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేసి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

అనంతరం ఆయన మధురైకి బయల్దేరి మధ్యాహ్నం 3 గంటల సమయంలో రూ. 4,400 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేసి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం దాదాపు 4 గంటల సమయంలో ప్రధానమంత్రి మధురై తిరుప్పరంకుండ్రంలోని అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని దర్శించి, అక్కడ పూజలు చేస్తారు.

పుదుచ్చేరిలో ప్రధానమంత్రి

పుదుచ్చేరిలో మౌలిక సదుపాయాలు, పట్టణ సేవలు, పారిశ్రామికాభివృద్ధి, విద్య, ఆరోగ్య సంరక్షణ, సుస్థిరాభివృద్ధిని బలోపేతం చేయడం లక్ష్యంగా చేపట్టిన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

పలు కీలక కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పీఎం ఇ-బస్ సేవా పథకం కింద ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం, స్మార్ట్ సిటీ మిషన్ కింద సమీకృత కమాండ్, కంట్రోల్ కేంద్రం, నవీకరణ - సమీకరణ - సుస్థిరత దిశగా నగరంలో పెట్టుబడుల (సీఐటీఐఐఎస్) కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం నిర్మించిన గృహ సముదాయాలు ఇందులో ముఖ్యమైనవి. వీటితోపాటు పుదుచ్చేరి ప్రభుత్వం చేపట్టిన కీలకమైన మురుగునీటి నిర్వహణ, నీటి సరఫరా ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభిస్తారు. అలాగే కరైకల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సమ్మిళిత ఇంజినీరింగ్ విభాగం - డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బ్లాక్, గంగా హాస్టలును ప్రారంభించనున్నారు. జిప్మర్‌లో ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రం ఆధునికీకరణ పనులను, పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలోని కొత్త అనుబంధ భవనాలను, తరగతి గదులను, హాస్టళ్లను కూడా శ్రీ మోదీ ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఉన్నత విద్యను, ఆరోగ్య రక్షణ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తాయి.

750 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కరాసూర్ - సేదరాపేట పారిశ్రామిక వాడను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో ఫార్మా పార్కు, టెక్స్‌టైల్ పార్కు, ఐటీ పార్కు, ఐఐటీ మద్రాసుకు చెందిన అత్యాధునిక పరిశోధన - అభివృద్ధి కేంద్రం, జిప్మర్కు చెందిన అధునాతన ఆరోగ్య రక్షణ సౌకర్యాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధికి, ఉపాధి కల్పనకు అవి పెద్దపీట వేయనున్నాయి.

పుదుచ్చేరి ప్రాంత వాసులకు స్వచ్ఛమైన, రక్షిత తాగునీటిని అందించేలా తాగునీటి సరఫరా వ్యవస్థలను మెరుగుపరిచే పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వీటితోపాటు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద 41 గ్రామీణ రహదారుల నిర్మాణం, పుదుచ్చేరిలో వారసత్వ నగరం అభివృద్ధి, మిష్టి (తీర ప్రాంత ఆవాసాలు, ప్రత్యక్ష ఆదాయాల కోసం మడ అడవుల కార్యక్రమం) పథకం కింద మడ అడవుల పునరుద్ధరణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగాల్లోని ఇతర ప్రాజెక్టులతోపాటు.. పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం (ఆర్డీఎస్ఎస్) కింద చేపట్టే విద్యుత్ రంగ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభిస్తారు.

మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సాయం (ఎస్ఏఎస్‌సీఐ) పథకం కింద పట్టణ రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థలు, ప్రభుత్వ భవనాలు, విద్యార్థుల వసతి గృహాలు, క్రీడా సౌకర్యాల వంటి కీలక రంగాలకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. వాస్తవానికి ఈ పథకం రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనప్పటికీ, పుదుచ్చేరిని కూడా ఇందులో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనివల్ల ప్రజా వినియోగం కోసం ఉద్దేశించిన మౌలిక సదుపాయాలు, ఉమ్మడి వినియోగ సదుపాయాలను మెరుగుపరిచేందుకు అవసరమైన మూలధన ఆస్తుల నిర్మాణానికి పనులు చేపట్టే అవకాశం లభిస్తుంది.

మదురైలో ప్రధానమంత్రి

మదురైలో రవాణా సదుపాయాలను పెంపొందించడం, రాకపోకలను సులభతరం చేయడం, ప్రాంత ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా.. రూ. 4,400 కోట్లకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగిస్తారు.

జాతీయ రహదారి-332(ఎ)లోని మరక్కాణం – పుదుచ్చేరి సెక్షనును జాతీయ రహదారి - 87లోని పరమకుడి –రామనాథపురం సెక్షనును నాలుగు వరుసల రహదారులుగా విస్తరించే పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. మరక్కాణం – పుదుచ్చేరి సెక్షనును నాలుగు వరుసల రహదారిగా విస్తరించడం వల్ల పుదుచ్చేరి పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ప్రయాణ సమయం గంట నుంచి దాదాపు 30 నిమిషాలకు.. అంటే 50 శాతం వరకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్టు ప్రధాన జాతీయ, రాష్ట్ర రహదారుల మధ్య నిరంతరాయమైన అనుసంధానాన్ని కల్పిస్తుంది. అలాగే మామల్లాపురం (మహాబలిపురం), కల్పక్కం అణు విద్యుత్ కేంద్రం, ఆరోవిల్ వంటి ప్రముఖ ప్రాంతాలకు రవాణా సదుపాయాన్ని మెరుగుపరుస్తుంది. తీరప్రాంత గ్రామాలు, విల్లుపురం జిల్లా కేంద్రం మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ.. ఈ ప్రాంతంలో పర్యాటక రంగానికి, ఆర్థిక కార్యకలాపాలకు ఇది ఊతమిస్తుంది.

జాతీయ రహదారి - 87లోని పరమకుడి–రామనాథపురం సెక్షనును నాలుగు వరుసల రహదారిగా విస్తరించడం వల్ల మదురై, రామేశ్వరం, ధనుష్కోడి వంటి ప్రధాన ఆధ్యాత్మిక క్షేత్రాలకు వేగవంతమైన రవాణా సౌకర్యం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయాణ సమయం గంట నుంచి సుమారు 35 నిమిషాలకు.. అంటే 40 శాతం వరకు తగ్గుతుంది. మదురై, రామేశ్వరాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లను, మదురై విమానాశ్రయాన్ని, ఐఎన్ఎస్ పరందూను, అలాగే పంబన్, రామేశ్వరాల్లోని చిన్న ఓడరేవులను అనుసంధానిస్తూ... బహువిధ అనుసంధానాన్ని (మల్టీ మోడల్ కనెక్టివిటీ) ఇది బలోపేతం చేస్తుంది. పీఎం గతి శక్తి సూత్రాలకు అనుగుణంగా చేపల వేట క్లస్టర్లు, ప్రత్యేక ఆర్థిక మండలి, మెగా ఫుడ్ పార్కు, టెక్స్‌టైల్ క్లస్టర్ వంటి కీలక ఆర్థిక కేంద్రాలను ఈ కారిడార్ ఏకం చేస్తుంది. తద్వారా ఈ ప్రాంతంలో వాణిజ్యం, పరిశ్రమలు, సామాజిక-ఆర్థికాభివృద్ధిని ఇది వేగవంతం చేస్తుంది.

ప్రయాణికుల సౌకర్యార్థం, రైల్వే కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు రాష్ట్రంలో రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా చేపట్టిన పలు రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన 8 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. తమిళనాడులోని మొరప్పూర్, బొమ్మిడి, శ్రీవిల్లిపుత్తూరు, చోళవందన్, మనప్పారై, పొల్లాచ్చి జంక్షన్, కరైక్కుడి జంక్షన్, తిరువారూర్ జంక్షన్ స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. స్థానిక నిర్మాణ శైలి, సాంస్కృతిక సౌందర్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దడమే కాకుండా.. ప్రయాణికుల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ ఈ స్టేషన్లను ఆధునికీకరించారు. మెరుగైన ప్రవేశ మార్గాలు, అధునాతన స్టేషన్ భవనాలు, ఆధునిక వెయిటింగ్ హాళ్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఆధునికీకరించిన ప్లాట్‌ఫాంలు, దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక సదుపాయాలను వీటిలో ఏర్పాటు చేశారు.

చెన్నై బీచ్ - చెన్నై ఎగ్మోర్ మధ్య నిర్మించిన నాలుగో రైల్వే లైన్‌ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు. అదనపు ప్రయాణికులు, సరుకు రవాణా రైలు సర్వీసులు నడిపేందుకు వీలు కల్పించడం ద్వారా.. చెన్నై సబర్బన్ రైలు నెట్‌వర్కు సామర్థ్యాన్ని ఈ రైలు మార్గం గణనీయంగా పెంచుతుంది. తద్వారా రోజూ ప్రయాణాలు సాగించే లక్షలాది మంది ఉద్యోగులు, ఐటీ నిపుణులు, విద్యార్థులు, వర్తకులకు ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

తమిళనాడులో ప్రసార సేవలను మరింత బలోపేతం లక్ష్యంగా కుంభకోణం, యెర్కాడ్, వెల్లూరుల్లో మూడు కొత్త ఆకాశవాణి ఎఫ్ఎమ్ రిలే ట్రాన్స్‌మిటర్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ట్రాన్స్‌మిటర్ల ద్వారా ప్రాంతీయ ప్రసార పరిధి విస్తరించడమే కాకుండా.. అంతరాయం లేకుండా ఎఫ్ఎమ్ ప్రసారాలు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రభుత్వ ప్రసార సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయి.  

 

***


(రిలీజ్ ఐడి: 2233781) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , Bengali , English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada