రాష్ట్రపతి సచివాలయం
జైసల్మేర్‌లోని వైమానిక దళ స్థావరంలో తేలికపాటి పోరాట హెలికాప్టర్ ‘ప్రచండ్’ లో ప్రయాణించిన రాష్ట్రపతి
దేశీయంగా తయారయిన ప్రచండ్
దేశ రక్షణ సామర్థ్యాలను చూసి గర్విస్తున్నా...: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము
నాడు పోస్టు చేయడమైనది:
27 FEB 2026 12:39PM by PIB Hyderabad
రాజస్థాన్‌లోని జైసల్మేర్ వైమానిక దళ స్థావరంలో ఈ రోజు (2026 ఫిబ్రవరి 27)న తేలికపాటి పోరాట హెలికాప్టర్ ‘ప్రచండ్’లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ప్రయాణించారు. ఇదివరకు, 2023లో సుఖోయ్ 30 ఎంకేఐ, 2025లో రాఫెల్ యుద్ధ విమానాల్లో రాష్ట్రపతి ప్రయాణించారు.
ప్రచండ్ మిషన్‌లో భాగంగా రెండు హెలికాప్టర్లు కలిసి పాల్గొన్నాయి. ముందు భాగంలో ఉన్న హెలికాప్టరులో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గ్రూప్ కెప్టెన్ నయన్ శాంతిలాల్ బహువాతో ఉండగా, రెండో హెలికాప్టరులో వైమానిక దళ ప్రధానాధికారి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.పి. సింగ్‌తో పాటు గ్రూప్ కెప్టెన్ ఎ. మహేంద్ర ప్రయాణించారు. దాదాపు 25 నిమిషాల పాటు ప్రచండ్ మిషన్ కొనసాగింది. దీనిలో భాగంగా వారు గడీసర్ సరస్సు, జైలస్మేర్ దుర్గం మీదుగా వెళ్లి ఒక ట్యాంకు లక్ష్యాన్ని ఛేదించారు.
ఆ తరువాత రాష్ట్రపతి తన భావాలను సందర్శకుల పుస్తకంలో రాశారు. ‘‘దేశీయంగా రూపొందించిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ ‘ప్రచండ్’లో ప్రయాణించడం మరపురాని అనుభవం. దేశ రక్షణ సామర్థ్యాల పట్ల నా మది మరోసారి గర్వంతో నిండిపోయింది. ఈ దాడిని విజయవంతంగా నిర్వహించినందుకు భారతీయ వైమానిక దళానికీ, జైసల్మేర్ వైమానిక దళ స్థావరానికి చెందిన బృందానికీ అభినందనలు ’’ అని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.
జైసల్మేర్‌లో…. ఈ రోజు సాయంత్రం భారతీయ వైమానిక దళం నిర్వహించే వాయు శక్తి విన్యాసాలను రాష్ట్రపతి వీక్షిస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2233766)
సందర్శకుల సూచీ సంఖ్య : : 34