ఉప రాష్ట్రపతి సచివాలయం
కాశ్మీర్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్
కాశ్మీర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మహిళలు రాణించారన్న ఉపరాష్ట్రపతి
మారుతున్న కాలంతో మార్పు సహజం: గ్రాడ్యుయేట్లు నూతన అంశాలను స్వీకరించి,
ఆవిష్కరణల దిశగా సాగాలని ఉపరాష్ట్రపతి పిలుపు
"ఇది మనందరి కాశ్మీర్": కాశ్మీర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి వ్యాఖ్య
ఇతరుల భావాలను గౌరవించటం ప్రజాస్వామ్యంలో కీలకం: ఉపరాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
26 FEB 2026 2:19PM by PIB Hyderabad
కాశ్మీర్ యూనివర్సిటీలో ఇవాళ జరిగిన 21వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. భారత ఉపరాష్ట్రపతిగా జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఇది ఆయన తొలి పర్యటన.
ఈ సందర్భంగా పట్టభద్రులైన విద్యార్థులను ఉపరాష్ట్రపతి అభినందించారు. మౌలిక సదుపాయాలు, విద్యా నైపుణ్యానికి విశ్వవిద్యాలయాలు గుర్తింపు పొందినప్పటికీ.. విద్యార్థుల ప్రవర్తన, సమాజానికి వారు అందించే సేవల్లోనే యూనివర్సిటీల నిజమైన వారసత్వం ప్రతిబింబిస్తుందన్నారు. 1948లో ఏర్పాటైన కాశ్మీర్ యూనివర్సిటీ.. గొప్ప వారసత్వం, విద్యా పరిధిని విస్తరిస్తున్న తీరుని ఆయన ప్రశంసించారు. విశ్వవిద్యాలయానికి లభించిన న్యాక్ ఏ++ గ్రేడ్, ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీ విభాగంలో 34వ ర్యాంకు, 2019 నుంచి ప్రచురితమైన 7,700లకు పైగా పరిశోధనా పత్రాలు, నేషనల్ హిమాలయన్ ఐస్-కోర్ లాబొరేటరీ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరుగుతుందన్నారు.
స్నాతకోత్సవం సందర్భంగా మూడు అంశాల పట్ల ఉపరాష్ట్రపతి ఆనందం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాశాఖ మంత్రిగా, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా మహిళలు ఉండటం, బంగారు పతకాలు సాధించిన వారిలోనూ మహిళలదే మెజారిటీ అవటం. జమ్మూకాశ్మీర్‌లో మహిళా సాధికారతకు, పురోగతికి శక్తిమంతమైన నిదర్శనమిది.
విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రపంచం శరవేగంగా మారుతున్న తరుతంలో పట్టభద్రులు అవుతున్నారని, "మారుతున్న కాలంతో పాటు మార్పు సహజం" అని పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను మలచుకోవాలని, నూతన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, ఆవిష్కరణల దిశగా సాగాలని చెప్పారు. సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా భారత్ ఎదుగుతుందని, జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా స్వదేశీ ఆవిష్కరణలను చేపట్టాలని, తద్వారా వికసిత్ భారత్ @2047 సాకారానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కాశ్మీర్‌లోని అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ రైల్వే వంతెన వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు.. కొత్త అవకాశాలను సృష్టించటమే కాక, సామాజిక సామరస్య బలోపేతానికి దోహదపడ్డాయని ఉపరాష్ట్రపతి అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి సారథ్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ ద్వారా దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా శ్రీనగర్ అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జార్ఖండ్ గవర్నర్‌గా పదవీకాలాన్ని గుర్తు చేసుకుంటూ.. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా జమ్మూకాశ్మీర్ నుంచి ఆ రాష్ట్రానికి పర్యటనకు వచ్చిన ప్రతినిధి బృందానికి సాదర స్వాగతం లభించిందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ప్రజాస్వామ్యంలో మన భావాలతో పాటు ఇతరుల భావోద్వేగాలను గౌరవించటం కీలకమని, ఇటువంటి కార్యక్రమాలు జాతీయ సమగ్రతను మరింత పెంచుతాయన్నారు.
డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, సామాజిక మాధ్యమాలని బాధ్యతాయుతంగా ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి చెప్పారు. తరగతి గది దాటిన తర్వాత.. ఓపికను, ధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని జీవితం పరీక్షిస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. ఐక్యత, ఆత్మీయతను చాటిచెబుతూ.. "ఇది నా కాశ్మీర్ కాదు, మీ కాశ్మీర్ కాదు.. మనందరి కాశ్మీర్" అంటూ ఉపరాష్ట్రపతి ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, కాశ్మీర్ యూనివర్సిటీ ఛాన్సలర్ శ్రీ మనోజ్ సిన్హా, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి, కాశ్మీర్ యూనివర్సిటీ ప్రొ-ఛాన్సలర్ శ్రీ ఒమర్ అబ్దుల్లా, జే అండ్ కే ఉన్నత విద్యాశాఖ మంత్రి శ్రీమతి సకీనా మసూద్ ఇటూ, కాశ్మీర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నిలోఫర్ ఖాన్, సీనియర్ అధ్యాపకులు, విశిష్ట అతిథులు, తల్లిదండ్రులు, గ్రాడ్యుయేట్ విద్యార్థులు పాల్గొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2233276)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8