రక్షణ మంత్రిత్వ శాఖ
సికింద్రాబాద్‌లోని సీడీఎంలో 'మిత్ర' వార్షిక సెమినార్‌లో ప్రసంగించిన సీడీఎస్
నాడు పోస్టు చేయడమైనది:
25 FEB 2026 3:48PM by PIB Hyderabad
"యుద్ధం కేవలం భౌతికంగానే కాక, సాంకేతిక, మేధోపరమైన రంగాలకు విస్తరిస్తున్న తరుణంలో భారత సాయుధ దళాలు నెట్ వర్క్ ఆధారిత కార్యకలాపాల నుంచి మేధో యుద్ధతంత్రం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని.. మల్టీ డొమైన్ ఆపరేషన్స్ (ఎండీఓ) స్థాయిని దాటి అంతరిక్షం, సైబర్, మేధో రంగాల (ఏఆర్ఏడీఓ)తో సమన్వయం చేయాలి" అని త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహన్ స్పష్టం చేశారు. 24 ఫిబ్రవరి 2026న సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కాలేజీ (సీడీఎం)లో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'మల్టీ డొమైన్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజికల్లీ-ఎంపవర్డ్ రెసిలియంట్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (మిత్ర)’ ఇతివృత్తంతో జరిగిన వార్షిక సెమినార్ సందర్భంగా 'సైనిక వ్యవహారాల్లో మూడో విప్లవం' గురించి సీడీఎస్ వివరించారు. ఈ విప్లవాన్ని కేంద్రీకృత యుద్ధతంత్రం ద్వారా వర్గీకరిస్తారని.. ఇది ప్రత్యక్ష, పరోక్ష, భౌతికంగా, కనిపించకుండా జరిగే దాడి, పాత, కొత్త రంగాలను యుద్ధంలోని అన్ని స్థాయిల్లో ఏకం చేస్తుంది. అణ్యాయుధాలతో కాకుండా ఇతర అత్యాధునిక ఆయుధాలతో శత్రువులను అడ్డుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని, దీనిద్వారా ఏ స్థాయిలో యుద్ధం జరిగినా విజయం సాధించే సామర్థ్యంతో ఉండవచ్చని తెలిపారు.
హైదరాబాద్‌లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్‌బీ) 'నాలెడ్జ్ భాగస్వామి'గా సికింద్రాబాద్‌లోని సీడీఎం 2026 ఫిబ్రవరి 24, 25 తేదీల్లో వార్షిక సెమినార్‌ను నిర్వహించింది. క్లిష్టంగా మారుతున్న భౌగోళిక రాజకీయ, సాంకేతిక పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది ఎంచుకున్న 'మిత్ర' ఇతివృత్తం.. సైనిక పాత్ర, యుద్ధతంత్ర వ్యూహాల్లోని మార్పులను స్పష్టం చేస్తోంది.
ప్రస్తుత యుద్ధాల నుంచి నేర్చుకున్న పాఠాలను భారత విశిష్ట కార్యాచరణ వ్యవస్థకు అనుగుణంగా మలచుకునేందుకు.. స్వావలంబన, నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి సారించేందుకు వ్యూహాత్మక వేదికగా నిలిచిన ఈ సెమినార్ ప్రధాన లక్ష్యం.. మల్టీ డొమైన్, సమగ్ర, సాంకేతిక సాధికారతతో, దృఢమైన మిత్ర సాయుధ దళాలను అభివృద్ధి చేయటం. రక్షణ రంగ సీనియర్ అధికారులు, మేధావులు, పారిశ్రామిక భాగస్వాములు, నిపుణుల భాగస్వామ్యంతో జరిగిన ఈ సీడీఎం వార్షిక సెమినార్-2026 మేధోపరమైన చర్చలకు, వ్యూహాత్మక దూరదృష్టికి వేదికైంది. మిత్ర పరిధిలో సమగ్ర జాతీయ శక్తిని పెంపొందించటానికి, భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా నిర్వహించటానికి, పటిష్ఠ భారత నిర్మాణానికి ఇది దోహదపడుతుంది.
డిసెంబర్ 1970లో ప్రారంభమైన డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కాలేజీ (సీడీఎం).. సైనిక నాయకత్వానికి ఆధునిక నిర్వహణా ధోరణులు, సిద్ధాంతాలు, ఉత్తమ విధానాలను అందించటంలో అత్యున్నత స్థాయి త్రివిధ దళాల శిక్షణ సంస్థగా కొనసాగుతుంది. కొన్నేళ్లుగా ఈ సంస్థ నిర్వహించిన వార్షిక సెమినార్లలో వ్యూహాత్మక సవాళ్లు, స్వావలంబన నుంచి భౌగోళిక రాజకీయ మార్పులు, నాయకత్వ పరివర్తన వరకు ఎన్నో కీలక అంశాలపై చర్చలు జరిగాయి. భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా నిర్వహించటంలోనూ, పటిష్ఠమైన భారత నిర్మాణంలోనూ, భారత సైనిక భవిష్యత్తును రూపుదిద్దే కీలక పాత్రను సీడీఎం పోషిస్తోంది.
***
(రిలీజ్ ఐడి: 2232874)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7