వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ – జీసీసీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంయుక్త ప్రకటనపై ఇరు పక్షాల సంతకాలు

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2026 7:11PM by PIB Hyderabad

భారత్ – జీసీసీ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై ఉమ్మడి ప్రకటనపై 2026 ఫిబ్రవరి 24న న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, గౌరవ గల్ఫ్ సహకార మండలి ప్రధాన కార్యదర్శి జాసెమ్ మహమ్మద్ అల్బుదైవీ సంతకాలు చేశారు. సమగ్రమైన, ఉభయ పక్షాలకు ప్రయోజనకరమైన ఒప్పందం కోసం అధికారికంగా చర్చలను ప్రారంభించే దిశగా ఇదొక కీలకమైన ముందడుగు. ఇరు పక్షాలకు చెందిన ప్రత్యేక ప్రతినిధి బృందాలు, ప్రతినిధుల సమక్షంలో ఈ సంతకాలు జరిగాయి.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ ఉమ్మడి ప్రకటనతోపాటు 2026 ఫిబ్రవరి 5న సంతకం చేసిన ఎఫ్‌టీఏ నిబంధనలు (టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్).. భారత్, జీసీసీ దేశాల మధ్య సంబంధాల్లో ఒక కీలక మైలురాయిగా పేర్కొన్నారు. ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక బంధాలతో పెనవేసుకుపోయిన ఈ సంబంధం.. విస్తృతమైన, ఉభయ పక్షాలకు ప్రయోజనకరమైన ఈ ఎఫ్‌టీఏ ద్వారా మరింత ఉత్తేజితమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో.. పరస్పర సమన్వయం, సహకారాన్ని పెంపొందించే బలమైన వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభించడం అత్యంత సమయోచితమని స్పష్టం చేశారు.

గౌరవనీయులు జాసెమ్ మహమ్మద్ అల్బుదైవీ మాట్లాడుతూ, వాణిజ్య రంగంలో ముందస్తుగా అంచనా వేయగల వాతావరణాన్నీ, స్థిరత్వాన్నీ నెలకొల్పడం ద్వారా.. భారత్, జీసీసీ దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ముఖ్య సాధనంగా ఉపయోగపడుతుందన్నారు.

భారతదేశానికి వర్తక వాణిజ్య రంగాల్లో సుదీర్ఘ చారిత్రక సంబంధాలున్న ముఖ్యమైన ప్రాంతంతో వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవడానికీ, కొత్త అవకాశాలను అన్వేషించడానికీ ఈ ఎఫ్‌టీఏ అనేక అవకాశాలను అందిస్తుంది. భారత్‌కు జీసీసీ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 178.56 బిలియన్ డాలర్లకు చేరుకుంది (ఎగుమతులు: 56.87 బిలియన్ డాలర్లు, దిగుమతులు: 121.68 బిలియన్ డాలర్లు). దేశ మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో ఇది 15.42 శాతానికి సమానం. గత అయిదేళ్లలో జీసీసీతో భారత వాణిజ్యం క్రమంగా విస్తరిస్తూ, 15.3 శాతం వార్షిక సగటు వృద్ధి రేటును నమోదు చేసింది.

భారత్ నుంచి జీసీసీ దేశాలకు జరిగే ప్రధాన ఎగుమతుల్లో ఇంజినీరింగ్ వస్తువులు, బియ్యం, వస్త్రాలు, యంత్రాలు, రత్నాలు, ఆభరణాలు ఉన్నాయి. అలాగే జీసీసీ నుంచి భారత్ దిగుమతి చేసుకునే ప్రధాన ఉత్పత్తుల్లో ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ, పెట్రోకెమికల్స్, బంగారం వంటి విలువైన లోహాలు ముఖ్యమైనవి. మొత్తంగా చూస్తే, 61.5 మిలియన్ల జనాభా (2024 లెక్కల ప్రకారం), ప్రస్తుత ధరల ప్రకారం 2.3 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో.. ఈ విభాగంలో జీసీసీ దేశాలు ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా కూడా జీసీసీ దేశాలు కీలక వనరుగా ఉన్నాయి. 2025 సెప్టెంబరు నాటికి అక్కడి నుంచి వచ్చిన మొత్తం పెట్టుబడులు 31.14 బిలియన్ డాలర్లను దాటాయి.

దాదాపు కోటి మంది భారతీయులు జీసీసీ దేశాల్లో ఉన్నారు. వీరు ఇరు ప్రాంతాల మధ్య ఒక సజీవ వారధి. ప్రజల మధ్య ఈ బలమైన, శాశ్వతమైన అనుబంధమే భారత్, జీసీసీ దేశాల మధ్య సంబంధాలకు పునాదిగా నిలుస్తోంది. ఆ ప్రాంతంలో భారతీయ కంపెనీలు భారీ స్థాయిలో విస్తరిస్తే ఈ సంబంధాలు మరింత బలోపేతమవుతాయి.

భారత్, జీసీసీ దేశాల మధ్య ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. సంతకాలు పూర్తయిన తర్వాత ఇరుపక్షాల మధ్య వాణిజ్య అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు మార్గం సుగమం చేస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇది ప్రపంచ శ్రేయస్సు కోసం ఒక గొప్ప చోదక శక్తిగా నిలుస్తుంది. దీనివల్ల ఎగుమతుల విస్తరణ, కొత్త రకాల వస్తువుల ఎగుమతులకు అవకాశం లభిస్తుంది. ఫలితంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక అనుసంధానం బలోపేతమవుతుంది.  

 

***


(రిలీజ్ ఐడి: 2232449) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Malayalam