ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

కృత్రిమ మేధతో భారత్ అసాధారణ ప్రయాణం: సుందర్ పిచాయ్


మనం అతి వేగవంతమైన పురోగతి, కొత్త ఆవిష్కరణల ముంగిట ఉన్నాం: సుందర్ పిచాయ్

భారత్-అమెరికా అనుసంధాన చొరవతో రెండు దేశాల మధ్య సముద్ర కేబుల్ మార్గాల విస్తరణ

నాడు పోస్టు చేయడమైనది: 20 FEB 2026 8:35PM by PIB Hyderabad

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌) ను ఈ దశాబ్దపు అత్యంత కీలక శక్తిగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభివర్ణించారు. ఢిల్లీలో జరుగుతున్న 2026 ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఏఐ ప్రయోజనాలు అందరికీ సమానంగా అందేలా చూడటంలో అంతర్జాతీయ సహకారం ప్రాముఖ్యతను ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

“మనం అపారమైన పురోగతి,  సరికొత్త ఆవిష్కరణల యుగం ముంగిట ఉన్నాం. అయితే ఉత్తమ ఫలితాలు వస్తాయని భరోసా  లేదు. ఏఐ ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ, ప్రతి చోటా అందుబాటులో ఉండేలా చూడటానికి మనం కలిసి పనిచేయాలి" అని ఆయన ఆన్నారు. వేగవంతమైన ఆవిష్కరణలతో పాటు  బాధ్యత కూడా పెరుగుతుందని ఆయన గుర్తు చేశారు. 

 

ద్వైపాక్షిక సహకారం వ్యూహాత్మక ప్రాముఖ్యతను వివరిస్తూ, "అమెరికా - భారత్ భాగస్వామ్యం ఇందులో కీలక పాత్ర పోషించాల్సి ఉంది" అని ఆయన అన్నారు. భారత నాయకత్వంపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, కృత్రిమ మేధతో భారత్ ప్రయాణం అసాధారణమైన ప్రగతి మార్గాన్ని కలిగి ఉండబోతోందని నేను నమ్ముతున్నాను. ఉత్పత్తులు, స్థాయి, మౌలిక సదుపాయాలతో సహా పూర్తి స్థాయి నిబద్ధతతో  దీనికి మేం మద్దతు ఇస్తున్నాం” అని పేర్కొన్నారు. 

ఉత్పత్తులు,  నైపుణ్యాభివృద్ధి,   మౌలిక సదుపాయాలు అనే మూడు కీలక స్తంభాల ద్వారా గూగుల్ చేస్తున్న ప్రయత్నాలను అయన వివరించారు. వాస్తవ ప్రపంచ అన్వయాల గురించి ప్రస్తావిస్తూ, రైతులకు సకాలంలో వర్ష సూచనలను అందించడం మొదలుకొని ఆరోగ్య కార్యకర్తలు డయాబెటిక్,  రెటినోపతి వంటి వ్యాధులను గుర్తించడంలో సహాయపడటం వరకు చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. వీటితో పాటు భారతీయ భాషలలో ఏఐ  సాధనాల లభ్యతను విస్తరించడం గురించి కూడా ఆయన పేర్కొన్నారు.

ఉద్యోగుల సంఖ్య పెంపుపై ఆయన మాట్లాడుతూ, “ ఏఐ స్కిల్ హౌస్ ద్వారా ప్రపంచ పురోగతిని నడిపించేందుకు 10 మిలియన్ల మంది కాబోయే భారతీయ నాయకులకు అవసరమైన పరికరాలను అందించేలా మేము కృషి చేస్తున్నాం” అని ప్రకటించారు. మౌలిక సదుపాయాల విషయంలో గూగుల్ భారత్ లో పెడుతున్న 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి గురించి ఆయన ప్రస్తావించారు. ఇందులో వైజాగ్‌లోని ఏఐ హబ్ కూడా ఉంది; ఇది పూర్తయిన తర్వాత గిగావాట్ స్థాయి కంప్యూట్  సామర్థ్యాన్ని కలిగి దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలకు అత్యాధునిక సాంకేతికతను చేరువ చేస్తుందని చెప్పారు. 

భారత్ - అమెరికా అనుసంధాన చొరవను శ్రీ పిచాయ్ ప్రస్తావిస్తూ, ఇది ఇరు దేశాల మధ్య సముద్రగర్భ కేబుల్ మార్గాలను విస్తరించడమే కాకుండా, రెండు దేశాల మధ్య  ఒక వారధిలా నిలుస్తుందని పేర్కొన్నారు. సరఫరా వ్యవస్థలో పటిష్టత  అవసరమని పేర్కొంటూ, "పరస్పర విశ్వాసం అనే పునాదిపై పనిచేసే స్థిరమైన సరఫరా వ్యవస్థలు లేకుండా ఇవేవీ సాధ్యం కాదు" అని ఆయన స్పష్టం చేశారు. 

ఈ ప్రసంగం ఒక స్పష్టమైన సందేశాన్ని బలపరిచింది.  భారతదేశ ఏఐ భవిష్యత్తు కేవలం సాంకేతిక విప్లవాత్మక పురోగతుల ద్వారానే కాకుండా, విశ్వసనీయ భాగస్వామ్యాలు, విస్తృత స్థాయి నైపుణ్యాభివృద్ధి, బలమైన అమెరికా - భారత్ సహకారంపై ఆధారపడి ఉండే స్థిరమైన మౌలిక సదుపాయాల పెట్టుబడుల ద్వారా రూపుదిద్దుకోనుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2231327) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Marathi , Kannada