ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026: ఏఐ విస్తరణలో ఓపెన్ నెట్‌వర్కులు, డిజిటల్ సార్వజనిక మౌలిక సదుపాయాల పాత్రను చర్చించిన నిపుణులు
డిజిటల్ సార్వజనిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, సార్వజనిక సేవలు ఏఐని విస్తరించడంలో కీలకమని గుర్తించారు
అధిక లభ్యతను దృష్టిలో పెట్టుకొని చౌకయిన, ఉపయోగించడానికి సులభతరంగా ఉండే, అనేక భాషల్లో అందుబాటులో ఉండే ఏఐ అవసరమని పిలుపునిచ్చిన నేతలు
ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని ప్రసరించాలంటే అందరినీ కలుపుకొని ముందుకు సాగడంతో పాటు
ప్రతిరూపాలను తయారు చేయడానికి వీలున్న ఏఐ నమూనాలు ఎంతయినా అవసరమన్న బృందం
నాడు పోస్టు చేయడమైనది:
20 FEB 2026 1:37PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ‘‘ఏఐ అండ్ ఓపెన్ నెట్‌వర్క్స్: క్రియేటింగ్ ఇంపాక్ట్ ఎల్ స్కేల్’’ అంశంపై నిర్వహించిన కార్యక్రమం ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేసింది.. కృత్రిమ మేధ (ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్.. ఏఐ) భవిష్యత్తు కేవలం నమూనాల్లో కొత్త అన్వేషణలతోనే తేలదనీ, అంతకన్నా డిజిటల్ రంగంలో సార్వజనిక సేవలకు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన (డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. డీపీఐ), ఓపెన్ నెట్‌వర్కుల ద్వారానే అది ఖరారు అవుతుందనీ, ఈ రెండూ (డీపీఐ, ఓపెన్ నెట్‌వర్కులు) నవకల్పనలను లక్షలాది ప్రజల చెంతకు తీసుకు పోవడంలో తోడ్పడతాయనీ చర్చా కార్యక్రమం చాటిచెప్పింది. ఆరోగ్య సంరక్షణ మొదలు వ్యవసాయం, సైన్సు, ప్రజలకు సేవల్ని అందించడం వరకూ అనేక ఉదాహరణలను వక్తలు ప్రస్తావించారు. సమ్మతి ఆధారిత డేటా వ్యవస్థలు, ఇంటరాపరబుల్ ప్లాట్‌ఫారాలు (అంటే వేర్వేరు వ్యవస్థల మధ్య వనరుల అపరిమిత పంపకం), దాపరికానికి తావు లేని భాగస్వామ్యం.. వీటి ఊతంతో జనాభాలో చాలా ఎక్కువ శాతం మంది వద్దకు ఏఐ సేవలను తీసుకు పోవడానికి భారత్ ఎలా పునాది వేసినదీ వారు వివరించారు.
ఈ కార్యక్రమంలో నెట్‌వర్క్స్ ఫర్ హ్యుమానిటీ సహ వ్యవస్థాపకుడు, పోషకుడు శ్రీ నందన్ నీలేకణీ, బయోకాన్ గ్రూపు చైర్‌పర్సన్ కిరణ్ మజుమ్దార్ షా, ప్రపంచ బ్యాంక్ గ్రూపు డిజిటల్, ఏఐ విభాగ వైస్ ప్రెసిడెంటు శ్రీ సంగ్‌బూ కిమ్, వాధ్‌వానీ ఏఐ వ్యవస్థాపకుడు శ్రీ సునీల్ వాధ్‌వానీ, గూగుల్, ఆల్ఫాబెట్‌లకు చెందిన రిసర్చ్ ల్యాబ్స్, టెక్నాలజీ, సొసైటీ ప్రెసిడెంటు శ్రీ జేమ్స్ మనికా ఉన్నత స్థాయి చర్చల్లో పాలుపంచుకున్నారు. చర్చ పురోగతి క్రమంలో.. జనాభాలో చాలా మందికి కృత్రిమ మేధ సేవలు అందుబాటులోకి రావడాన్ని ఓపెన్ నెట్వర్క్, డీపీఐలు ఎలా సుసాధ్యం చేయగలవన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. తక్కువ ఖర్చుతో కూడిన వ్యవసాయ సూచనలు, సలహాలను అందించడం, ఏఐ ఆధారిత రోగనిర్ధారణ సేవల మొదలు ప్రోటీన్ పరిశోధన, ముందువరుస సేవా ఉపకరణాల వరకూ.. అంచనా ఖర్చుల్ని ఎలాగ తగ్గించి, ఏజెంట్ ఆధారిత ఇంటర్‌ఫేస్ ద్వారా వినియోగదారు అనుభవాన్ని సరళతరం చేయడమే కాకుండా, అనేక భాషల్లో ఏఐని ఒక విశిష్ట సామర్థ్యానికి బదులు భారీ స్థాయిలో ఉపయోగపడ గలిగే సాంకేతికతగా మార్చవచ్చో బృందం పరిశీలించింది.
నెట్‌వర్క్స్ ఫర్ హ్యుమానిటీ సహ వ్యవస్థాపకుడు, పోషకుడు శ్రీ నందన్ నీలేకణీ మాట్లాడుతూ, ప్రొడక్టివ్ ఏఐ డిఫ్యూజన్‌ను వేగవంతం చేయడంలో ఓపెన్ నెట్‌వర్కుకు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. ఏఐ అంటే సామాన్య ప్రయోజనాలు ప్రధానమైన సాంకేతికత అని వర్ణిస్తూ, ‘‘ప్రజలు ఉపయోగించుకొనేటట్లు దాని వినియోగాన్ని పెంచడానికి అన్నింటి కన్నా వేగవంతమైన పద్ధతి ఏది?’’ అనేదే సిసలైన ప్రశ్న అని ఆయన అన్నారు. యూపీఐ ఓపెన్ ఆర్కిటెక్చర్‌తో పోలికను తెస్తూ ‘‘ఏఐని ఉపయోగించి ఎడ్జ్ మీద అప్లికేషన్లని రూపొందించేందుకు అనేక మందికీ, నూతన ఆవిష్కర్తలకీ ఓపెన్ నెట్‌వర్కులు అనుమతిని ఇస్తాయి’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘ఏజెంట్ల అసలు బలం వినియోగదారుకు సంక్లిష్టతలను దూరం చేయడమే’’ అని కూడా ఆయన అన్నారు.
బయోకాన్ గ్రూపు చైర్‌పర్సన్ కిరణ్ మజుమ్దార్ షా మాట్లాడుతూ, భారత్ డిజిటల్ హెల్త్ స్టాక్, ఏఐల సంయుక్తంగా మార్పును తీసుకురావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఒక గ్లోబల్ రెఫరెన్స్ నమూనాను తీర్చిదిద్దాల్సిన సామర్థ్యాన్ని అలవరుచుకోవాలని ఆమె అన్నారు. మేం ఆరోగ్య రంగంలో సమాచారాన్ని జోడిస్తున్న స్థాయిని బట్టి చూస్తే ఏఐని ఉపయోగించే విషయంలో భారత్ ఒక గ్లోబల్ రెఫరెన్స్ నమూనాను వెంటనే అందించగలుగుతుందని ఆమె చెప్పారు. దీర్ఘకాలిక పద్ధతిన విస్తృత స్థాయిలో అందరికీ ఆరోగ్య రక్షణ కవచాన్ని సమకూర్చడమే అంతిమ లక్ష్యమని షా అన్నారు.
ప్రపంచ బ్యాంక్ గ్రూపు డిజిటల్, ఏఐ విభాగ వైస్ ప్రెసిడెంటు శ్రీ సంగ్‌బూ కిమ్ మాట్లాడుతూ, నకలు చేయదగిన, విస్తరణకు అనువైన నమూనాల అవసరం అన్ని దేశాల్లో ఉందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దీనిని అవలంబించితీరాలని ఆయన అంటూ, ‘‘ప్రభుత్వాల్లోనూ, దేశాల్లోనూ ఏయే అంశాల్ని అనుకరించవచ్చు, వాస్తవంలో అవసరమైన కాంపొనెంట్స్ ఏమిటి అనే విషయాలపైన దృష్టిని కేంద్రీకరించాలి’’ అని ఉద్ఘాటించారు. భారత్ నుంచి అందిన పాఠాలను ఇప్పటికే అనేక ప్రాంతాల్లో అనుసరిస్తున్నారని ఆయన తెలిపారు.
వాధ్‌వానీ ఏఐ వ్యవస్థాపకుడు శ్రీ సునీల్ వాధ్‌వానీ మాట్లాడుతూ, సామాజిక రంగంలో విస్తరణయోగ్య ఏఐ సేవలను ప్రవేశపెట్టడానికి డిజిటల్ సార్వజనిక సేవల కల్పన ఎంతో కీలకమన్నారు. ఆచరణాత్మకత ప్రధానం అని ఆయన చెప్తూ, ‘‘మీరు డీపీఐ అందించే డేటా, సేవల ఆలంబన లేనిదే సామాజిక రంగం కోసం ఏఐని రూపొందించనే లేరు’’ అన్నారు. అలాంటి మౌలిక సదుపాయాల ఊతం లేకుండా, పెద్ద ఎత్తున సేవలను అందించాలనుకోవడం ‘‘మనం ఇవాళ గమనిస్తున్న స్థాయులకు ఎప్పటికీ చేరుకో జాలదు’’ అని కూడా ఆయన అన్నారు.
గూగుల్, ఆల్ఫాబెట్‌లకు చెందిన రిసర్చ్ ల్యాబ్స్, టెక్నాలజీ, సొసైటీ ప్రెసిడెంటు శ్రీ జేమ్స్ మనికా చర్చను ఒక విశాల ప్రపంచ నవకల్పన సందర్భంలోకి తీసుకుపోయారు. లభ్యతకు ప్రాధాన్యాన్ని ఇవ్వవలసి ఉందని ఆయన చెబుతూ, ‘‘ఏఐ లభ్యత అవకాశాలను అందించాల్సిన, ప్రతి చోటా ప్రజలకు నవకల్పన సామర్థ్యాన్ని విస్తరించాల్సిన అవసరం ఎంతయినా ఉంది’’ అన్నారు. ఏఐ అభివృద్ధి వేగాన్ని ఆయన ‘‘సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రజలకు సాధికారతను కల్పించే ఒక అసాధారణ అవకాశం’’గా వర్ణించారు.
ఏఐని ప్రయోగాల దశ మొదలు జనాభాకంతటికీ సేవలను అందించగలిగే స్థాయికి తీసుకుపోవడానికి అవసరమైన సంస్థాగత, సాంకేతిక పునాదులను ఓపెన్ నెట్‌వర్కులు, డీపీఐ కలిసి ఏర్పరుస్తాయన్న భావనను ఈ కార్యక్రమం ముగింపులో వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చుతో కూడి ఉండేదీ, అనేక భాషల్లో లభ్యమయ్యేదీ, వెంటనే ఉపయోగించడానికి అనువైన నూతన ప్రణాళికల్ని కలబోసి, దేశాలు కేవలం తమ ప్రాంతాల్లో అన్ని వర్గాలను కలుపుకొని పోవడంతో పాటు ప్రపంచం అంతటా కూడా అనుకరించ దగిన వ్యవస్థల్ని నిర్మించగలుగుతాయి. దీంతో ఏఐని ఒక కేంద్రీకృత ప్రయోజనంగా పరిమితం చేయడం కాకుండా, సమష్టి అభివృద్ధి శక్తిగా మలచడం సాధ్యపడుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2231072)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6