ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం సమ్మిళిత, బహుభాషా కృత్రిమ మేధకు ప్రోత్సాహం.. న్యూఢిల్లీ ఫ్రాంటియర్ ఏఐ నిబద్దతలను ఆవిష్కరించిన భారత్‌


ఏఐ ప్రాప్యత, ఆవిష్కరణలను ప్రజాస్వామ్యీకరించడమే న్యూఢిల్లీ ఫ్రాంటియర్ ఏఐ నిబద్దతల లక్క్ష్యం

‘మనుషుల ద్వారా, మనుషుల కోసం కృత్రిమ మేధ భవిష్యత్తు రూపకల్పన’: కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2026 3:08PM by PIB Hyderabad

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 ప్రారంభోత్సవంలో భాగంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ‘న్యూఢిల్లీ ఫ్రాంటియర్ ఏఐ ఇంపాక్ట్ కమిట్‌మెంట్స్‌’ను ప్రకటించారు. సదస్సులో తీసుకున్న ముఖ్య నిర్ణయాల్లో ఈ నిబద్ధతలు ఒకటిగా నిలిచాయి. సమగ్ర, బాధ్యతాయుత కృత్రిమ మేధను ప్రోత్సహించేందుకు అగ్రగామి అంతర్జాతీయ కృత్రిమ మేధ సంస్థలను, దేశీయ ఆవిష్కర్తలను ఒక వేదికపైకి తీసుకువస్తుంది.

ఈ సదస్సులో శ్రీ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యీకరణ, విస్తృతి, సార్వభౌమాధికారం ప్రాతిపదికన భారత ఏఐ వ్యూహం రూపొందించినట్లు పేర్కొన్నారు. ఏఐ స్టాక్ లోని అయిదు కీలక అంశాలైన అప్లికేషన్లు, మోడల్స్, కంప్యూట్, ప్రతిభ, శక్తిపై భారత్‌ అనుసరిస్తున్న సమగ్ర విధానాన్ని ఆయన వివరించారు. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్య, ప్రజా సేవలో ఏఐ వినియోగానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.

‘‘కృత్రిమ మేధ అనేది ఒక ప్రాథమిక సాంకేతికత. మనం పనిచేసే విధానాన్ని, నేర్చుకునే పద్ధతిని,నిర్ణయాలు తీసుకునే తీరును ఇది ఇప్పటికే మార్చేస్తోంది. సాంకేతికత   సామాన్య ప్రజలకు చేరువైనప్పుడే దానికి నిజమైన విలువ ఉంటుందని మన  ప్రధానమంత్రి నమ్ముతారు. సాంకేతికతను ప్రజాస్వామ్యీకరించడం, దానిని భారీ స్థాయిలో విస్తరించడం, అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే మన ప్రధానమంత్రి గారి దార్శనికత. అందుకే దేశంలో మేం ఏఐ స్టాక్ అయిదు స్థాయిలపై పనిచేస్తున్నాం. మనం ఏఐ ప్రయోజనాలను నిజాయితీగా వినియోగించుకోవడంతో పాటు దాని వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి సమష్టి పరిష్కారాలను కూడా కనుగొనాలి. మానవ భద్రత, గౌరవానికి పెద్దపీట వేయడం ద్వారానే మనం నమ్మకంతో ముందుకు సాగగలం. మనుషుల ద్వారా, మనుషుల కోసం పనిచేసే కృత్రిమ మేధ భవిష్యత్తును మనం నిర్మిద్దాం’’ అని శ్రీ అశ్విని వైష్ణవ్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఈ స్వచ్ఛంద నిబద్దతలు, కృత్రిమ మేధ వ్యవస్థల అభివృద్ధి, విస్తరణ.. సమానత్వం, సాంస్కృతిక వైవిధ్యం. వాస్తవ ప్రపంచ అవసరాలకుముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలకు అనుగుణంగా ఉండాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ కార్యక్రమంలో ప్రపంచస్థాయి ఏఐ సంస్థలతో పాటు భారత్‌కు చెందిన సర్వం, భారత్‌జెన్, జ్ఞాని.ఏఐ, సాకెట్  వంటి అగ్రగామి సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.

‘‘వాస్తవ ప్రపంచ కృత్రిమ మేధ వినియోగంపై అవగాహనను పెంపొందించడం” మొదటి నిబద్దత. ఇది అజ్ఞాతంగా సేకరించిన సమాచారం ద్వారా ఏఐ వినియోగంపై దృష్టి సారిస్తుంది. ఉద్యోగాలు, నైపుణ్యాలు, ఉత్పాదకత, ఆర్థిక మార్పులపై కృత్రిమ మేధ చూపే ప్రభావం గురించి విధాన నిర్ణేతలకు అవసరమైన ఆధారాలను రూపొందించడానికి భాగస్వామ్య సంస్థలు కృషి చేస్తాయి. వివిధ రంగాలలో కృత్రిమ మేధను ఎలా ఉపయోగించాలో డేటా ఆధారిత విశ్లేషణ ప్రారంభించడం ద్వారా సాంకేతిక మార్పుల వల్ల కలిగే నష్టాలను తగ్గిస్తూ, ప్రయోజనాలను పెంచేలా ప్రభుత్వాలు, సంస్థలు సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించుకోవడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుంది.

“బహుభాషా, సందర్భోచిత మూల్యాంకనాలను బలోపేతం చేయడం”..రెండవ నిబద్దత. వివిధ భాషలు, సంస్కృతులు, వాస్తవ వినియోగ సందర్భాలలో ఏఐ వ్యవస్థల ప్రభావాన్ని నిర్ధారించడం దీని ముఖ్య ఉద్దేశం. తక్కువ ప్రాతినిధ్యం ఉన్న భాషలు, సాంస్కృతిక నేపథ్యాలలో ఏఐ పనితీరును పరీక్షించడానికి అవసరమైన డేటాసెట్‌లు, బెంచ్‌మార్క్‌లు, నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ సంస్థలు ప్రభుత్వాలతో, స్థానిక వ్యవస్థలతో కలిసి పనిచేస్తాయి. ఈ ప్రయత్నం వివిధ వర్గాల ప్రజల కోసం కృత్రిమ మేధ పనితీరును మెరుగుపరుస్తుంది. సాధనాలు, మూల్యాంకన పద్ధతుల ఎంపికలో స్వేచ్ఛను కొనసాగిస్తూనే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన కృత్రిమ మేధ అనుభవాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి సహాయపడుతుంది.

కృత్రిమ మేధ మానవాళికి విస్తృతంగా సేవ చేయాలంటే ప్రభుత్వాలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థల మధ్య సమన్వయ చర్యలు అత్యవసరమని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి పునాదిగా ఈ ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వామ్యం కావాలని ఆయన వివిధ సంస్థల నాయకులను ఆహ్వానించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2230284) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Kannada , Malayalam