భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ‘ఏఐ ఫర్ ఓషన్స్ ఆఫ్ టుమారో: డేటా, మాడల్స్ అండ్ గవర్నెన్స్’ అంశంపై చర్చకు మార్గదర్శకత్వం వహించిన భూ విజ్ఞానశాస్త్రాల మంత్రిత్వ శాఖ
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 12:01PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026ను న్యూ ఢిల్లీలో 2026 ఫిబ్రవరి 16 మొదలు 20 వరకు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ‘ఏఐ ఫర్ ఓషన్స్ ఆఫ్ టుమారో: డేటా, మాడల్స్ అండ్ గవర్నెన్స్’ అంశంపై ఒక ఉన్నత స్థాయి బృంద చర్చను కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎస్) ఏర్పాటు చేసింది.
భారత సముద్ర ప్రాంత నిర్వహణలో, విపత్తులకు ఎదురొడ్డి నిలవడంలో, సముద్ర జీవనోపాధుల్లో, నీలి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని పటిష్ఠపరచడంలో కృత్రిమ మేధ (ఏఐ) ఒక గొప్ప పాత్రను పోషించగలుగుతుందని నిపుణులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ ప్రముఖులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమ రంగ ప్రముఖులు, అంకుర సంస్థలు, ఆర్థిక నిపుణులు పాల్గొని మహాసాగర విజ్ఞానంతోనూ, విధానాలతోనూ ఏఐని ఏకీకరించడంపై చర్చించారు.
భారత వాతావరణ విజ్ఞాన విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎమ్. మహాపాత్రా కీలకోపన్యాసాన్ని ఇస్తూ, వాతావరణ నియంత్రణ, వైపరీత్యాల నష్ట భయ నివారణ, ఆహార భద్రత, జీవనోపాధులలో మహాసాగరాలు పోషిస్తున్న ముఖ్య పాత్రను వివరించారు. మహాసాగర పరిశీలన, తుపానులను ముందుగా అంచనా వేయడం, సముద్ర జలాలకు సంబంధించిన సమాచార వ్యవస్థలు, ముందస్తు హెచ్చరిక సేవల్లో భారత్ పటిష్ఠమైన జాతీయ సామర్థ్యాల్ని కలిగి ఉందని చెబుతూ, విపత్కర వాతావరణ స్థితుల వేళ వాటిల్లే ప్రాణ, ఆస్తి నష్టాలను సాంకేతిక పురోగతి చాలావరకూ తగ్గించి వేసిందన్నారు. మహాసాగరాలు వెచ్చబడడం, ఆమ్లీకరణం, సముద్ర నీటి మట్టం వృద్ధి వంటి వాతావరణ మార్పు ప్రభావాలు ఏర్పడిన సందర్భంలో సాంప్రదాయిక భౌతిక నమూనాలకు పూరకంగా డేటా-ఆధారిత, ఏఐ- ఆధారిత నమూనాలు ప్రాధాన్యాన్ని సంతరించుకొంటాయని ఆయన తన ప్రసంగంలో తెలిపారు. సముద్ర అంతర్భాగంలోకి పోయి అన్వేషణను కొనసాగించడం, సముద్ర తీరానికి ఆవల ఇంధన వసతుల ఏర్పాటు, జీవ వైవిధ్య సంరక్షణ, సముద్ర వనరుల్ని నిరంతర ప్రాతిపదికన ఉపయోగించుకోవడం వంటి వాటిపై దృష్టిని కేంద్రీకరించిన ఒక ప్రధాన జాతీయ కార్యక్రమమే డీప్ ఓషన్ మిషన్ అని వర్ణించారు.
భారత్‌లో నార్వే రాయబారి మే-ఎలిన్ స్టేనర్ కార్యక్రమంలో మాట్లాడుతూ మహాసాగరాల రంగంలోనూ, నీలి ఆర్థిక వ్యవస్థలోనూ భారత్, నార్వేల సహకారం అంతకంతకూ పెరుగుతోందన్నారు. కృత్రిమ మేధని ఆంక్షలకు తావు ఉండని (ఓపెన్), అంతర నిర్వహణీయ (ఇంటరాపరబుల్) తరహా, విశ్వసనీయ డిజిటల్ పునాదులతో అభివృద్ధిపరిచినప్పుడు.. మత్స్య పరిశ్రమ నిర్వహణ, షిపింగ్ సామర్థ్యం, నౌకాశ్రయ కార్యకలాపాలు, కోస్తా తీరాన్ని బలోపేతం చేసుకోవడం సాధ్యపడుతుందని ఆమె చెప్పారు. డిజిటల్ సార్వజనిక సేవల కల్పనలో భారత్ అగ్రగామిగా రూపొందడంతో ఓపెన్ డేటా, ఉమ్మడి ప్రమాణాలు, బాధ్యతాయుత డిజిటల్ పరిపాలనలపై ఆధారపడ్డ ఒక ప్రపంచ డిజిటల్ మహాసాగర సంబంధిత మౌలిక సదుపాయాల ప్రణాళికకు రూపురేఖలను అందించే స్తోమతను కల్పిస్తుందనీ, ఇది ఒక్క భారత్‌కే కాకుండా అంతర్జాతీయ సమాజానికి కూడా మేలు చేసేదే అవుతుందన్నారు.
కార్యక్రమంలో రెండో సగ భాగంలో ప్రభుత్వం, విద్యా జగతి, పరిశ్రమ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన నిపుణులతో ఓ బృంద చర్చను చేపట్టారు. భారత్ ఆంక్షలకు సమాచారనిధి (ఓపెన్ డేటా), కృత్రిమ మేధ (ఏఐ) చోదకశక్తిగా నిలిచే సమాచారం, పటిష్ఠ పాలన ప్రణాళికలను ఏకీకరించే డిజిటల్ మహాసాగర మౌలిక సదుపాయాల కల్పనకు నడుం బిగించి అభివృద్ధి చెందుతున్న దేశాల (గ్లోబల్ సౌత్)కు నాయకత్వం వహించడానికి ఎంతో సమర్ధమైందిగా ఉందని బృందం అభిప్రాయపడింది.
సముద్ర సంబంధిత జీవనోపాధులను ప్రోత్సహించేందుకు, నిర్వహణ కార్యకలాపాల ఖర్చులను తగ్గించేందుకు, నీలి ఆర్థిక వ్యవస్థకు చెందిన అన్ని రంగాల్లో కాలానుగుణ డేటా-ఆధారిత నిర్ణయాల్ని తీసుకోవడంలో కృత్రిమ మేధ ఎంతయినా అవసరమవుతుంది. డేటాసెట్లు అంతకంతకూ వృద్ధి చెందుతున్నప్పటికీ, మహాసాగరాలు అత్యంత సంక్లిష్టమైన, డేటా కొరవడిన రంగంగా మిగిలాయి. ఈ నేపథ్యంలో భౌతికతపై ఆధారపడ్డ ఏఐ, భౌతిక ఇంటెలిజెన్సులను అభివృద్ధిపరచక తప్పదు. మహాసాగరాలకు సంబధించిన ఏఐలో పురోగతి కోసం ఉన్నత స్థాయి అంతర్జాతీయ సహకారం, ఓపెన్, ఇంటర్ ఆపరబుల్ ఫ్రేంవర్కులతో పాటు ఉమ్మడి డిజిటల్ సార్వజనిక వస్తువులు అవసరపడతాయి. ఇది ఎల్లలు లేనటువంటి మహాసాగరాల స్వభావాన్ని కళ్లకు కడుతుంది. సహాయం ప్రధానంగా రూపొందించే విధానాలు, డేటా మార్పిళ్లు, నిధుల కలబోత, నష్టభయాన్ని పంచుకొనే ఏర్పాట్లు జరిగాయంటే వీటితో నీలి ఆర్థిక వ్యవస్థ ఒక స్థిర ప్రాతిపదికను కలిగివుండే దీర్ఘకాలిక అభివృద్ధి ఇంజనుగా మారగలుగుతుంది. అప్పుడు ఒక్క భారత్‌కే కాక, అభివృద్ధి కోసం తపిస్తున్న దేశాల (గ్లోబల్ సౌత్)కు కూడా ఉపాధి, పెట్టుబడి అవకాశాలు పెద్ద ఎత్తున లభిస్తాయి.
జీ కేటగిరీ శాస్త్రవేత్త, భూ విజ్ఞానశాస్త్రాల మంత్రిత్వ శాఖకు సలహాదారు డాక్టర్ (కమాండర్) పి.కె. శ్రీవాస్తవ ప్రసంగంతో కార్యక్రమాన్ని ముగించారు. ఆయన మహాసాగరాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కృత్రిమ మేధను ఏకీకరించడానికి ఒక బాటను పరచడంలో మంత్రిత్వ శాఖ నిబద్దతను పునరుద్ఘాటించారు.

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ‘‘ఏఐ ఫర్ అవర్ ఓషన్స్ ఆఫ్ టుమారో: డేటా, మాడల్స్ అండ్ గవర్నెన్స్’’ అంశంపై 2026 ఫిబ్రవరి 17న న్యూఢిల్లీలో నిర్వహించిన బృంద చర్చ కార్యక్రమంలో వక్తలు (చిత్రంలో ఎడమవైపున), పాలుపంచుకున్నవారు (చిత్రంలో కుడివైపున).
***
(రిలీజ్ ఐడి: 2230239)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4