ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఫ్రాన్స్ అధ్యక్షుడితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 6:44PM by PIB Hyderabad

మహాశయా, నా మిత్రుడు, అధ్యక్షుడు మాక్రోన్‌కు

రెండు దేశాలకు చెందిన ప్రతినిధులకు,

పాత్రికేయ మిత్రులకు,

నమస్కారం!

బోన్‌జూర్!

ముంబయికి నా ప్రియ మిత్రుడు, అధ్యక్షుడు మాక్రోన్‌ను స్వాగతించడం నాకు అమితానందాన్ని కలిగిస్తోంది. గతేడాది, ఏఐ యాక్షన్ సదస్సులో పాల్గొనేందుకు ఆయన నన్ను ఫ్రాన్స్‌కు ఆహ్వానించారు.

ఆ సమయంలో ఫ్రాన్స్‌లో అతి పెద్ద నౌకాశ్రయం, ఫ్రాన్స్‌‌కు, యూరోప్‌కు ప్రవేశ ద్వారమైన మార్సెయ్‌ను మేం సందర్శించాం. మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికులు ఐరోపాలో మొదటిసారి అడుగుపెట్టిన ప్రదేశం మార్సెయ్. ఐరోపాలోని అనేక ప్రాంతాల్లో వారి ధైర్యం ఇప్పటికీ చిరస్మరణీయంగా ఉంది.

బ్రిటిష్ చెర నుంచి తప్పించుకోవడానికి స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ సముద్రంలోకి దూకిన నగరం కూడా ఇదే. స్వాతంత్ర్యం పట్ల భారతదేశానికున్న అచంచలమైన సంకల్పానికి ఈ చర్య చిహ్నంగా ఉంది. గతేడాది మార్సెయ్ ఆయనకు నివాళులు అర్పించే అవకాశం నాకు లభించింది.

ఇప్పుడు ఏఐ ఇంపాక్ట్ సదస్సు కోసం అధ్యక్షుడు మాక్రోన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయనకు భారత్‌కు స్వాగత తోరణమైన ముంబయిలో స్వాగతం పలకడం మాకు దక్కిన గౌరవం.

 

స్నేహితులారా,

భారత్, ఫ్రాన్స్ మధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. భారత్‌కున్న అత్యంత పురాతన వ్యూహాత్మక భాగస్వామ్యుల్లో ఫ్రాన్స్ ఒకటి. అధ్యక్షుడు మాక్రోన్‌తో కలసి ఈ భాగస్వామ్యానికి అపూర్వమైన బలాన్ని శక్తిని అందించాం. ఈ నమ్మకం, ఉమ్మడి దార్శనికత ఆధారంగా దీనిని ప్రత్యేకమైన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంగా మారుస్తున్నాం.

ఈ భాగస్వామ్యం వ్యూహాత్మకం మాత్రమే కాదు. ప్రస్తుతమున్న అనిశ్చిత పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థిరత్వానికి, ప్రపంచ పురోగతికి సంబంధించిన భాగస్వామ్యం ఇది.

స్నేహితులారా,

ఈ రోజు భారత్‌లో ప్రారంభమైన హెలికాప్టర్ అసెంబ్లీ లైన్, ఈ విశ్వాసానికి మరో ఉదాహరణ. ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు ఎగిరే సామర్థ్యమున్న ఏకైక హెలికాప్టర్‌ను భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా తయారు చేసి, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయనుందనే విషయాన్ని మేం గర్వకారణంగా పరిగణిస్తున్నాం.

భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి ఎల్లలు లేవు. అది మహా సముద్రాల లోతుల నుంచి ఎత్తయిన పర్వత శిఖరాల వరకు విస్తరించింది.

స్నేహితులారా,

భారత్-ఐరోపా మధ్య సంబంధాల్లో వచ్చిన ప్రధాన మలుపును 2026 సూచిస్తుంది. కొన్ని రోజుల క్రితమే, యూరోపియన్ యూనియన్‌తో కలసి భారతదేశ చరిత్రలోనే అతిపెద్దదైన, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాం. భారత్-ఫ్రాన్స్ సంబంధాలకు సైతం అపూర్వమైన వేగాన్ని ఈ ఒప్పందం అందిస్తుంది.

పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించడానికి, మన ప్రజలు, సంస్థలకు ద్వంద్వ పన్నులను తొలగించడానికి ఈ రోజు మేం ఒక ఒప్పందంపై సంతకం చేశాం. ఇవి వాణిజ్యాన్ని, పెట్టుబడులను, ప్రజల రాకపోకలను బలోపేతం చేస్తాయి. ఉమ్మడి సంక్షేమానికి బాటలు వేస్తాయి.

స్నేహితులారా,

భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం ప్రారంభంతో, మన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రజల భాగస్వామ్యంగా మారుస్తున్నాం. ఒంటరిగా ఉంటే ఆవిష్కరణలు సాధ్యం కావు. సహకారంతోనే అది వృద్ధి చెందుతుంది.

ఆవిష్కరణల సంవత్సరంలో ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే మా లక్ష్యం. అది రక్షణ, స్వచ్ఛ ఇంధనం, అంతరిక్షమైనా లేదా నూతనంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలైనా, మన సంస్థలు, ఆవిష్కర్తలను మేం అనుసంధానిస్తాం. అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల మధ్య బలమైన వ్యవస్థను మేం నిర్మిస్తున్నాం. విద్యార్థులు, పరిశోధకుల పరస్పర మార్పిడిని సులభతరం చేస్తున్నాం. సంయుక్త ఆవిష్కరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.

స్నేహితులారా,

కీలకమైన ఖనిజాలు, బయోటెక్నాలజీ, అధునాతన సామగ్రిలో కూడా సహకారాన్ని మేం విస్తరిస్తున్నాం. ఆరోగ్యంలో ఏఐ కోసం ఇండో-ఫ్రెంచ్ సెంటర్, హెల్త్, డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండో-ఫ్రెంచ్ సెంటర్, ఏరోనాటిక్స్‌లో నైపుణ్యాల కోసం జాతీయ ఎక్సలెన్స్ సెంటర్‌ను మేం ప్రారంభిస్తున్నాం. ఈ సంస్థలు భవిష్యత్తును నిర్మించే పునాదులు.

స్నేహితులారా,

ప్రస్తుతం ప్రపంచం అనిశ్చిత పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి సమయంలో అంతర్జాతీయ స్థిరత్వానికి భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం శక్తిగా నిలుస్తుంది. భారత్‌కున్న విస్తృత సామర్థ్యాన్ని ఫ్రాన్స్ నైపుణ్యాలతో మేం మిళితం చేస్తున్నాం. విశ్వసనీయమైన సాంకేతికతలను మేం అభివృద్ధి చేస్తున్నాం. అంతర్జాతీయ సౌర కూటమి, ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ), ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా మానవాళి అభివృద్ధికి మేం కృషి చేస్తున్నాం. స్థిరత్వం, సంక్షేమ ప్రయత్నాలను బహుపాక్షిక విధానం, చర్చలు, దౌత్యం ద్వారా మరింత బలోపేతం చేస్తాం.

స్నేహితులారా,

ప్రజాస్వామ్య విలువలు, చట్టం, బహుపాక్షిక ప్రపంచంపై భారత్, ఫ్రాన్స్‌ దేశాలకు విశ్వాసం ఉంది. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ సంస్థలను సంస్కరించడం అవసరమని మేము దృఢంగా నమ్ముతున్నాం.

అది ఉక్రెయిన్, పశ్చిమాసియా అయినా లేదా ఇండో-పసిఫిక్ అయినా.. శాంతి ప్రయత్నాలకు మేం సహకరిస్తాం. అన్ని రూపాల్లోని, వ్యక్తీకరణల్లోని ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే మా ఉమ్మడి సంకల్పం.

స్నేహితులారా,

భారత్, ఫ్రాన్స్ దేశాలు రెండూ అత్యంత పురాతనమైన, గొప్ప నాగరికతలు. సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు మేం అత్యంత ప్రాధాన్యమిస్తాం. యుగే యుగిన్ భారత్ మ్యూజియంలో సహకారానికి సంతోషిస్తున్నాం. ఇప్పుడు, లోథాల్‌లోని నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్‌ నిర్మాణంలో ఫ్రాన్స్‌తో కలసి పనిచేస్తున్నాం.

భారతీయ సంస్కృతిని ఫ్రాన్స్ ప్రజలకు చేరువ చేయడం కోసం త్వరలోనే ఆ దేశంలో స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్‌ను ప్రారంభిస్తాం.

మహాశయా,

భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం పట్ల మీ అంకితభావం ఎల్లప్పుడూ స్పష్టంగా కనిపిస్తుంది. మన సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని ఈ రోజు మనం కలసి ప్రారంభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

స్థిరత్వం, సంక్షేమం కోసం మనం కలసి పనిచేద్దాం.

ధన్యవాదాలు.

 

***


(రిలీజ్ ఐడి: 2229572) సందర్శకుల సూచీ సంఖ్య : : 79