ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
వినియోగదారు స్థాయి నుంచి ప్రపంచ కృత్రిమ మేధ సృష్టికర్తగా భారత్ ఎదగడానికి సార్వభౌమ ఏఐ కీలకం
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో... “దేశ సార్వభౌమ కృత్రిమ మేధ, డేటా ప్రభావం అంశంపై చర్చ ప్రపంచ కృత్రిమ మేధ నాయకత్వానికి మార్గాన్వేషణ
నియంత్రణ, సమ్మిళిత వృద్ధి, భారత్ ఎదుర్కొంటున్న వాస్తవ సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడమే సార్వభౌమ ఏఐ: ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అభిషేక్ సింగ్
దీర్ఘకాలిక పరిశోధనా వ్యవస్థను పెంపొందించడానికి, జాతీయ సహకారానికి పిలుపునిచ్చిన నాయకులు
प्रविष्टि तिथि:
17 FEB 2026 4:29PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సందస్సు 2026లో భాగంగా నిర్వహించిన ‘భారతదేశ సార్వభౌమ కృత్రిమ మేధ డేటా ద్వారా ప్రభావాన్ని విస్తరించడం’ అన్న అంశంపై జరిగిన చర్చ…. భారత్ కృత్రిమ మేధ వినియోగదారుగా మాత్రమే ఉండిపోకుండా ప్రపంచ స్థాయి ప్రాముఖ్యత కలిగిన ఏఐ వ్యవస్థల సృష్టికర్తగా ఎలా మారగలదన్న దానిపై దృష్టి సారించింది.

ఈ చర్చలో లోతైన పరిశోధనా నైపుణ్యం, దీర్ఘకాలిక ఆవిష్కరణల పెట్టుబడుల్లో ఉన్న అంతరాలను పరిష్కరించాల్సిన అవసరాన్ని వివరించారు. నిజమైన ఏఐ సామర్థ్యం స్వల్పకాలిక జోక్యాల ద్వారా కాకుండా, నిరంతర పరిశోధనా వ్యవస్థలు, బలమైన మార్గదర్శకత్వం ద్వారానే నిర్మితమవుతుందని బృంద సభ్యులు స్పష్టం చేశారు. ఏఐ సార్వభౌమాధికారానికి సంబంధించి వక్తలు మూడు కీలక విషయాలను పేర్కొన్నారు. అవి భారతీయ భాషలు, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా స్వదేశీ నమూనాల అభివృద్ధి, పటిష్టమైన దేశీయ మౌలిక సదుపాయాల కల్పన, ప్రాథమిక పరిశోధనలను బలోపేతం చేయడం.
ఈ సమావేశంలో అధునాతన కృత్రిమ మేధ పరిశోధనను ఆర్థిక సమ్మిళితం, వ్యవసాయం, వైద్యం, విద్య వంటి జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానించారు. అర్ధవంతమైన, సమగ్రమైన ఫలితాలను అందించడానికి ఏఐను తప్పనిసరిగా దేశ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
సార్వభౌమ ఏఐ అంటే ఒంటరిగా పనిచేయడం కాదని జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) డైరెక్టర్ జనరల్, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అభిషేక్ సింగ్ పేర్కొన్నారు. కృత్రిమ మేధ వ్యవస్థల రూపకల్పన, అమలు, నిర్వహణపై నియంత్రణ కలిగి ఉండటమే ఏఐ సార్వభౌమాధికారం అని ఆయన వివరించారు. ప్రజలు తమ సొంత భాషల్లో సేవలను పొందేలా, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునేలా.. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, ఆర్థిక రంగాల్లోని వాస్తవ సవాళ్లను పరిష్కరించడానికి కృత్రిమ మేధను ఉపయోగించాలని సూచించారు.

కృత్రిమ మేధ స్వీకరణ అన్ని రంగాల్లో జరుగుతుందని.. అయితే పాలన, పౌర సేవలు, ఆర్థికం వంటి ప్రాధాన్యత కలిగిన, సున్నితమైన రంగాలతో ప్రారంభించి దశలవారీగా జాగ్రత్తగా అమలు చేయాలని భారత్‌జెన్ ముఖ్య కార్యనిర్వహక అధికారి శ్రీ రిషి బాల్ అన్నారు. కృత్రిమ మేధ అభివృద్ధిని కేవలం రంగాల వారీగా చేపట్టే ప్రక్రియగా కాకుండా నిరంతర ప్రయాణంగా ఆయన అభివర్ణించారు. ఆవిష్కర్తలు వేగంగా, సురక్షితమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి వీలుగా ఉమ్మడి నమూనాలు, ఇన్ఫరెన్స్ ఆర్కిటెక్చర్లు, ఇతర భాగాలతో కూడిన భాగస్వామ్య డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ఏఐ సార్వభౌమత్వం సాధించాలంటే విస్తృతంగా ఉపయోగించగల నమూనాలు, మౌలిక సదుపాయాలతో కూడిన జాతీయ వ్యవస్థను సృష్టించడం అవసరముందని తెలిపారు. అంకుర సంస్థలు కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుందని, అటువంటి వ్యవస్థకు దేశవ్యాప్తంగా సమష్టి కృషి అవసరమని పేర్కొన్నారు.
ఏఐ వ్యూహాత్మక ప్రాముఖ్యతను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ, సమాచార వ్యవస్థలు- నిర్వహణ విభాగం డైరెక్టర్ శ్రీ రాజీవ్ రతన్ చేత్వానీ వివరించారు. ఇస్రో దృష్టిలో సార్వభౌమ ఏఐ ఒక వ్యూహాత్మక అవసరమని, అంతరిక్ష పరిశీలన, జాతీయ స్వయంప్రతిపత్తి కోసం ఇది కీలకమైన మౌలిక సదుపాయమని పేర్కొన్నారు. వ్యూహాత్మక రంగాల్లో ఉపయోగించే కృత్రిమ మేధ వ్యవస్థలు ఇంటర్నెట్‌పై నేరుగా ఆధారపడకుండా ఆఫ్‌లైన్‌లో పనిచేయగలగాలని తెలిపారు. ఈ వ్యవస్థలు పారదర్శకంగా ఉండటమే కాకుండా వాటి పనితీరును తనిఖీ చేసేందుకు వీలుగా ఉండాలన్నారు. వివరించదగిన నమూనాలు, స్పష్టమైన డేటా మూలాలు, జాతీయ చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉండే శిక్షణా విధానాలు అవసరమని స్పష్టం చేశారు. భారత్ వద్ద ఉన్న అపారమైన భూగోళ సమాచారాన్ని ఏఐ ద్వారా వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయం, విపత్తు నిర్వహణ, వాతావరణ అంచనా, పట్టణ ప్రణాళిక వంటి రంగాలను బలోపేతం చేయవచ్చని తెలిపారు. దీని ద్వారా అటు భద్రతను, ఇటు సమాజానికి ప్రయోజనాలను అందించవచ్చని వెల్లడించారు.
2026 ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రధాన లక్ష్యాలైన నిరంతర పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంస్థాగత సహకారం ద్వారా దేశ ఏఐ వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ సమావేశం దోహదపడింది. ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడానికి, జాతీయ ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి దీర్ఘకాలిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉమ్మడి నిబద్ధతను చర్చలు ప్రతిబింబించాయి.
***
(रिलीज़ आईडी: 2229318)
आगंतुक पटल : 67