పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో మంత్రిత్వశాఖ సందర్శన కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్
గ్రామీణ పరిపాలనను బలోపేతం చేసేందుకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో
ఏఐ సాధనాలను ప్రదర్శించిన పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 4:31PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక సందర్శన కేంద్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీహార్ ఉపముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌదరి, బీహార్ పరిశ్రమలు, రహదారుల నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ దిలీప్ కుమార్ జైస్వాల్, ఐటీ, క్రీడల శాఖ మంత్రి కుమారి శ్రేయసి సింగ్, పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ సభ్యుడు) శ్రీ సంజయ్ కుమార్ ఝా, మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయి పాలనలో పారదర్శకత, కచ్చితత్వం, సమర్థతను పెంపొందించేందుకు మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత వేదికలను మంత్రిత్వశాఖ ప్రదర్శిస్తోంది. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, ఎక్స్పో 2026 ద్వారా సభాసార్, ప్రమాణ్, ఈ-గ్రామసాథి ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహిస్తారు.
ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన "సర్పంచ్ కి చౌపాల్, ఏఐ కా కమాల్" పేరుతో జరిగిన నుక్కడ్ నాటక్.. క్రమబద్ధమైన డాక్యుమెంటేషన్, పారదర్శక ప్రక్రియల ద్వారా గ్రామసభల పనితీరును కృత్రిమ మేథ ఎలా మెరుగుపరుస్తుందో ఇది వివరించింది. "సర్వజన హితాయ, సర్వజన సుఖాయ" ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సులో గ్రామసభల కార్యక్రమాలను డిజిటల్ రూపంలో భద్రపరచటం, ఆస్తుల పర్యవేక్షణలో కచ్చితత్వాన్ని నిర్ధారించటం, రియల్-టైమ్ గవర్నెన్స్ మద్దతును అందించటంపై మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది.
ఏఐ సహాయంతో గ్రామసభ సమావేశాలను రికార్డు చేయటం, స్థానిక భాషల్లో లిఖితపూర్వక ప్రతిని సిద్ధం చేయటం, సమావేశ నిర్ణయాలను క్రమబద్ధంగా రూపొందించటానికి సభాసార్ సహకరిస్తుంది. వివిధ పథకాల ద్వారా నిర్మించిన ఆస్తుల ఛాయాచిత్రాలను ఇమేజ్ అనలిటిక్స్ ద్వారా తనిఖీ చేసి, నాణ్యతను ధ్రువీకరించటానికి ప్రమాణ్ ఉపయోగపడుతుంది. పంచాయతీ ప్రతినిధులకు, పౌరులకు అవసరమైన సమాచారాన్ని ఏఐ ద్వారా ఎప్పటికప్పుడు అందించేందుకు ఈ-గ్రామసాథి సహకరిస్తుంది. డిజిటల్ ఆవిష్కరణల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే గౌరవ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ సాంకేతిక కార్యక్రమాలున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయటమే కాక, ప్రతి వ్యక్తికి పారదర్శకమైన సేవలను అందించటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ సందర్శన కేంద్రాన్ని భారత మండపం (హాల్ 5, బూత్ 5ఎఫ్5, 5ఎఫ్9)లో 20 ఫిబ్రవరి 2026 వరకు సందర్శించవచ్చు. "బీ ద సర్పంచ్" సంప్రదాయ నుక్కడ్ నాటక్ ద్వారా ఏఐ సాంకేతికతతో నిర్ణయాలను డాక్యుమెంట్ చేసే విధానాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. మంత్రిత్వ శాఖకు చెందిన ఏఐ వేదికల పనితీరుని నిపుణుల మార్గదర్శకత్వంలో ప్రత్యక్ష ప్రదర్శనల రూపంలో తెలుసుకోవచ్చు.
***
(రిలీజ్ ఐడి: 2229316)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2