ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్

సదస్సు-2026 ప్రారంభం: అపూర్వమైన అంతర్జాతీయ భాగస్వామ్యం

న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో పాల్గొంటున్న 20కి పైగా దేశాల అధిపతులు, 60 మంది మంత్రులు, 500 మంది అంతర్జాతీయ ఏఐ దిగ్గజాలు

న్యూఢిల్లీలో జరుగుతున్న మొదటి అంతర్జాతీయ ఏఐ చర్చలకు భారత్ నాయకత్వం:2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు గ్లోబల్ ఏఐ సదస్సు నిర్వహణ

నాడు పోస్టు చేయడమైనది: 16 FEB 2026 6:00PM by PIB Hyderabad

భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 ఈ రోజు భారత్ మండపంలో ప్రారంభమైంది. కృత్రిమ మేధకు సంబంధించి గ్లోబల్ సౌత్‌లో జరుగుతున్న తొలి అంతర్జాతీయ సమావేశం ఇది. విస్తృత స్థాయిలో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ దేశాల అధిపతులు, మంత్రులు, అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలు, ప్రముఖ పరిశోధకులు, బహుపాక్షిక సంస్థలు, పరిశ్రమ భాగస్వాములు పాల్గొంటున్నారు. సమ్మిళిత వృద్ధిని ముందుకు తీసుకెళ్లడం, ప్రజా వ్యవస్థలను బలోపేతం చేయడం, సుస్థిరాభివృద్ధిని సుసాధ్యం చేయడంలో ఏఐ పాత్ర గురించి వారు చర్చిస్తారు.

 

 

 

ఫిబ్రవరి 19న, ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం చేస్తారు. సమగ్రమైన, బాధ్యతాయుతమైన ఏఐలో అంతర్జాతీయ సహకారానికి, భారత దార్శనికతకు ఈ ప్రసంగం మార్గనిర్దేశం చేస్తుంది. 2026 ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు అయిదు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 100 మందికి పైగా ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారు. వీరిలో 20 కి పైగా దేశాల అధిపతులు, 60 మంది మంత్రులు, ఉప మంత్రులు ఉన్నారు. అలాగే సీఈవోలు, వ్యవస్థాపకులు, విద్యావేత్తలు, పరిశోధకులు, సీటీవోలు, దాతృత్వ సంస్థలతో సహా 500 మందికి పైగా అంతర్జాతీయ ఏఐ దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

 

మూడు ప్రధాన అంతర్జాతీయ పోటీలు - ఏఐ ఫర్ ఆల్, ఏఐ బై హర్, యువ్ఏఐ విజేతల ప్రకటన, గ్రాండ్ ఫినాలే ప్రదర్శన ఈ సదస్సులో ప్రధానాంశంగా నిలవనుంది. విజేతల ప్రకటనతో ఈ పోటీలు ముగుస్తాయి. సమగ్రమైన, బాధ్యతాయుతమైన, అభివృద్ధి ఆధారిత కృత్రిమ మేధను ముందుకు తీసుకెళ్లేలా వీటిని రూపొందించారు. అలాగే జాతీయ ప్రాధాన్యాలు, అంతర్జాతీయ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఆచరణీయమైన, అధిక ప్రభావం కలిగిన ఏఐ పరిష్కారాలను వేగవంతం చేసేందుకు ఈ పోటీలను ప్రారంభించారు. దాదాపు 60కి పైగా దేశాల నుంచి 4,650కి పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇది బలమైన అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే విశ్వసనీయమైన, ఆచరణీయమైన ఏఐ ఆవిష్కరణలకు నమ్మకమైన అంతర్జాతీయ కేంద్రంగా భారత్ ఎదిగేందుకు సహకరిస్తుంది.

 

డొమైన్ నిపుణులు, విధాన రూపకర్తలు, పారిశ్రామిక దిగ్గజాలు చేపట్టిన కఠినమైన, బహుళ దశ వడపోత అనంతరం మూడు విభాగాల్లో 70 బృందాలను తుది పోటీలకు ఎంపిక చేశారు. గ్రాండ్ ఫినాలే, బహుమతి ప్రదానోత్సవంలో తమ పరిష్కారాలను న్యూఢిల్లీలోని భారత్ మండపం, సుష్మా స్వరాజ్ భవన్లో ఫిబ్రవరి 16, 17 తేదీల్లో ప్రదర్శిస్తారు. విధాన రూపకర్తలు, పారిశ్రామిక దిగ్గజాలు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలతో ఫైనలిస్టులు భేటీ అవుతారు. అదే సమయంలో వారి ఆవిష్కరణలను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా గుర్తింపును, వ్యవస్థ తోడ్పాటును పొందుతారు.

 

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భాగస్వామ్యంతో ఫిబ్రవరి 18న ఏఐ, దాని ప్రభావంపై రీసెర్చి సింపోజియం జరుగుతుంది. ఇది ఈ సదస్సులో ముఖ్యమైన విద్యా వేదికగా పనిచేస్తుంది. ఈ సింపోజియంకు ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల నుంచి 250కి పైగా పరిశోధనలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా అధ్యక్షుడు శ్రీ అలార్ కరీస్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్వనీ వైష్ణవ్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద పాల్గొంటారు. ఏఐ ఆధారిత శాస్త్రీయ పరిశోధన, భద్రత, పరిపాలనా విధానాలు, కంప్యూట్ మౌలిక వసతులు, పరిశోధనా సహకారంలో గ్లోబల్ సౌత్ అంతటా సమాన అవకాశాలపై చర్చించడానికి ప్రముఖ అంతర్జాతీయ ఏఐ నిపుణులు, ప్రధాన పరిశోధనా సంస్థలను ఒక్కచోట చేరుస్తుంది.

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు గురించి

 

అంతర్జాతీయ ఏఐ అజెండాను తీర్చిదిద్దడంలో భారత్ పాత్రను ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 బలోపేతం చేస్తుంది. ఏడు చక్రాలు... ప్రజలు, పృథ్వి, ప్రగతి అనే మూడు సూత్రాల కృత్రిమ మేధ కోసం అభివృద్ధి ఆధారిత విధానాన్ని ఈ సదస్సు ముందుకు తీసుకెళుతుంది.

 

ప్రజలు, పృథ్వి, ప్రగతి అనే మూడు ప్రధాన ఆధారాలపై ఈ సదస్సు జరుగుతోంది. అలాగే ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రయోజనం కోసం ఏఐ, ఏఐ వనరుల ప్రజాస్వామ్యీకరణ, సామాజిక సాధికారతకు సమ్మిళిత్వం, సురక్షితమైన, విశ్వసనీయమైన ఏఐ, మానవ మూలధనం, సైన్సు, స్థిరత్వం, ఆవిష్కరణ, సామర్థ్యం అనే ఏడు నేపథ్య వర్కింగు గ్రూపులు ఈ సదస్సును ముందుకు నడిపిస్తాయి. ఈ వర్కింగు గ్రూపులు విధాన చర్చలను అమలు మార్గాలకు అనుసంధానిస్తూ.. ఫలితాల ఆధారిత సిఫారసులను అందిస్తాయి. సమ్మిళితమైన ఆర్థిక వృద్ధికి, అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి, గ్లోబల్ సౌత్ కోసం బాధ్యతాయుతమైన ఆవిష్కరణల విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఏఐ విస్తరణపై చర్చలతో ఈ సదస్సు ముగుస్తుంది.

 

విధానాన్ని అమలుతో, ఆవిష్కరణను ప్రజా ప్రయోజనంతో అనుసంధానించడం ద్వారా బాధ్యతాయుతమైన ఏఐ అమలుకు నిర్మాణాత్మక విధానాన్ని ఈ సదస్సు ఏర్పాటు చేస్తుంది. ఇది సమ్మిళిత వృద్ధి, సుస్థిరాభివృద్ధికి అనుగుణంగా సాంకేతిక పురోగతి ఉండేలా చూస్తుంది.

 

అంతర్జాతీయ ఏఐ సహకారంలో, ఉమ్మడి ప్రమాణాలు, సహకారాత్మక విధానాలు, ప్రజా ప్రయోజనం కోసం ఆచరణాత్మకమైన పరిష్కారాలకు మద్దతు ఇవ్వడంలో సమన్వయకర్తగా, భాగస్వామిగా భారత్‌ను ఈ సదస్సు నిలబెడుతుంది. ఇది చర్చల నుంచి ఫలితాల సాధనకు మార్పును సూచిస్తుంది. అలాగే బాధ్యతాయుతమైన, సమగ్రమైన, అభివృద్ధి ఆధారిత ఏఐ మార్గాల పట్ల భారతదేశానికున్న అంకితభావాన్ని బలోపేతం చేస్తుంది.

***

 


(రిలీజ్ ఐడి: 2229069) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Odia , Malayalam