రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

‘ఓల్ చికి’ లిపి శతాబ్ది వేడుకలకు రాష్ట్రపతి శ్రీకారం

నాడు పోస్టు చేయడమైనది: 16 FEB 2026 7:24PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘ఓల్ చికి’ లిపి శతాబ్ది వేడుకలను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఇవాళ (2026 ఫిబ్రవరి 16) ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ- సంతాల్ సమాజానికి తనదైన భాష, సాహిత్యం-సంస్కృతి ఉన్నాయని ఆమె అన్నారు. కానీ, ఆ భాషకు లిపి లేనందువల్ల ఒకనాడు రోమన్, దేవనాగరి, ఒడియా, బెంగాలీ లిపులలో రాసేవారని పేర్కొన్నారు. నేపాల్, భూటాన్, మారిషస్‌ వంటి దేశాల్లో నివసించే సంతాల్ తెగ వారు కూడా అక్కడ ప్రాబల్యంగల భాషల లిపిలోనే రాసేవారని రాష్ట్రపతి గుర్తుచేశారు. అయితే, ఈ భాషలలో సంతాలీ పదాల ఉచ్చారణ అసమగ్రంగా ఉండేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పండిట్ రఘునాథ్ ముర్ము 1925లో ఈ భాష కోసం ‘ఓల్ చికి’ లిపిని రూపొందించారని తెలిపారు. దీనికి బాగా ప్రాచుర్యం లభించడంతో వినియోగం విస్తృతం కావడంతోపాటు ఈ లిపి ద్వారా ప్రపంచవ్యాప్త సంతాలీ సమాజానికీ శక్తిమంతమైన గుర్తింపు లభించిందని తెలిపారు. ముఖ్యంగా ఆ తెగలో ఐక్యతను ప్రోది చేయడంలో ఇదొక ప్రభావశీల మాధ్యమంగా రూపొందిందని చెప్పారు.

‘ఓల్ చికి’ లిపిని ప్రోత్సహించడంలో ఈ శతాబ్ది ఉత్సవాలు ఎంతో అనువైన సందర్భం కావాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. నేటి సంతాలీ బాలలు హిందీ, ఆంగ్లం, ఒడియా, బెంగాలీ లేదా మరే ఇతర భాషలో విద్యాభ్యాసం చేసే వీలున్నప్పటికీ, మాతృభాష సంతాలీని ‘ఓల్ చికి’ లిపితో నేర్చుకోవడం అవశ్యమని పేర్కొన్నారు.

ఈ భాషకు ఒక లిపి ఏర్పడటంతో అనేకమంది రచయితలు సంతాలీ భాషా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తుండటంపై తానెంతో సంతోషిస్తున్నానని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. వారందరూ తమ రచనల ద్వారా ప్రజలలో అవగాహన పెంచి, చైతన్యం రగల్చాలని పిలుపునిచ్చారు.

భారత్‌ అనేక భాషల ఉద్యానం వంటిదని రాష్ట్రపతి అన్నారు. భాష, సాహిత్యం ఆయా సమాజాల మధ్య ఐక్యతను ప్రోదిచేసే సూత్రాలని చెప్పారు. సాహితీ ఆదానప్రదానంతో భాషలు సుసంపన్నం కాగలవని తెలిపారు. రచన, అనువాదం తదితర మార్గాల్లో సంతాలీ సాహిత్యాన్ని ఇతర భాషల విద్యార్థులకూ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు.

‘ఓల్ చికి’ లిపి 100 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా- ఒక స్మారక నాణెం, తపాలా బిళ్లను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. సంతాలి ప్రజలు ఈ లిపిని విస్తృతంగా వాడే విధంగా ప్రోత్సహించడంపై ఆ సామాజిక వర్గంలోని 10 మంది కార్యసాధకులను ఆమె సత్కరించారు.


(రిలీజ్ ఐడి: 2229064) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Malayalam