ఉప రాష్ట్రపతి సచివాలయం
ఏఐ ఇండియా సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించిన ఉప రాష్ట్రపతి
నాడు పోస్టు చేయడమైనది:
16 FEB 2026 2:01PM by PIB Hyderabad
నేడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభం సందర్భంగా ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధకృష్ణన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో.. ప్రజా ప్రయోజనాలే కీలకంగా, ప్రజాస్వామ్య ఆధారిత కృత్రిమ మేధ భవిష్యత్తును రూపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయాత్నాల్లో భారత్ అగ్రగామిగా నిలుస్తోందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ సదస్సు ఇతివృత్తమైన ‘‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’’లో ఈ దార్శనికత స్పష్టంగా ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఇది అందరి సంక్షేమం, అందరి సంతోషం కోసం ఏఐ అనే భావనకు అద్దం పడుతోందని ఆయన అన్నారు.
కృత్రిమ మేధ పట్ల భారత్ దృక్పథాన్ని వివరిస్తూ.. ప్రజా శ్రేయస్సు, అందుబాటు, అంతర్జాతీయ సహకారాన్ని ఏఐ పరిణామక్రమంలో కేంద్ర బిందువులుగా ఉంచడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సాంకేతిక బలాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల సామర్థ్యంతో అనుసంధానించాలని భారత్ భావిస్తోందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా సమగ్రమైన, సమష్టి పురోగతిని సాధించవచ్చని అన్నారు.
గత ఏడాది పారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘యంత్రాలు మనుషుల కంటే తెలివైనవిగా మారుతాయని కొందరు ఆందోళన చెందుతున్నారు. కానీ మన ఉమ్మడి భవిష్యత్తు, విధికి సంబంధించిన తాళంచెవి మనుషులైన మన వద్ద తప్ప మరెవరి వద్ద లేదని’’ అన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కృత్రిమ మేధ ఎప్పుడూ మానవ కేంద్రంగా ఉండాలని బాధ్యతాయుతమైన మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలని ఆయన తెలిపారు.
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ఘనవిజయం సాధించాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.
(రిలీజ్ ఐడి: 2228686)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21