సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఈఎఫ్ఎం బెర్లిన్ 2026లో 'ఫిల్మ్ ఫెసిలిటేషన్ ఫ్రేమ్‌వర్క్', పర్యాటక రంగ విశేషాలను ప్రదర్శించిన ఢిల్లీ ప్రభుత్వం
భారత్ పర్వ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఢిల్లీ ప్రభుత్వ
‘సింగిల్-విండో ఫిల్మ్ ఫెసిలిటేషన్, సులభతర వాణిజ్య సంస్కరణలు’
నాడు పోస్టు చేయడమైనది:
15 FEB 2026 5:07PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్‌డీసీ).. భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా బెర్లిన్‌లో జరిగిన యూరోపియన్ ఫిల్మ్ మార్కెట్‌లో (ఈఎఫ్ఎం) ఢిల్లీ ప్రభుత్వం పాల్గొనేలా, రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రదర్శించేలా సహకరించింది. 'వేవ్స్ బజార్' కింద నిర్వహించిన 'భారత్ పర్వ్' వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. అంతర్జాతీయ చలనచిత్ర పరిశ్రమకు భారతదేశపు సృజనాత్మక, సినిమా వ్యవస్థను తెలియజేసేందుకు భారత్ పర్వ్ అనేది ఒక కీలక వేదికగా పనిచేస్తుంది.
ఢిల్లీ ప్రతినిధి బృందంలో ఢిల్లీ పర్యాటక, కళా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ కపిల్ మిశ్రా.. ఢిల్లీ పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఐఏఎస్ శ్రీ సునీల్ అంచిపాక.. మంత్రి కార్యదర్శి డ్యానిక్స్ శ్రీ వినయ్ కుమార్ జిందాల్.. ఫిల్మ్ షూటింగ్ ప్రమోషన్ సెల్ మేనేజర్ కుమారి మనీక్షా బక్షి ఉన్నారు
ఈ ప్రతినిధి బృందం అంతర్జాతీయ నిర్మాతలు, స్టూడియోలు, చలనచిత్ర ఉత్సవాల నిర్వాహకులు, మార్కెట్ భాగస్వాములతో ముఖాముఖి చర్చలు జరిపింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీకి ఉన్న చారిత్రక వారసత్వం, సాంస్కృతిక వైభవం, ఆధునిక మౌలిక సదుపాయాలను ఉపయోగించుకుంటూ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి 'సినిమా షూటింగ్‌లకు అనుకూలమైన’ నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వివరించారు. పెద్ద ఎత్తున దేశీయ, అంతర్జాతీయ చలనచిత్ర నిర్మాణాలను ఆకర్షించడానికి చురుకైన విధానపరమైన మద్దతు, సంస్థాగత సమన్వయం ఎంతో కీలకమని ఆయన ప్రధానంగా చెప్పారు.
'భారత్ పర్వ్' వేదికగా రాష్ట్ర చలనచిత్ర నిర్మాణ సహాయక ఫ్రేమ్‌వర్క్, పర్యాటక రంగ సామర్థ్యాలు, సులభతర వాణిజ్య నిర్వహణ కార్యక్రమాలను ఢిల్లీ ప్రభుత్వం ప్రదర్శించింది. ఎన్ఎఫ్‌డీసీ, ఢిల్లీ పర్యాటక - రవాణా అభివృద్ధి సంస్థ (డీటీటీడీసీ) మధ్య సమన్వయం ద్వారా షూటింగ్ అనుమతులను క్రమబద్ధీకరించడం, ఏక గవాక్ష అనుమతులను బలోపేతం చేయడం, నిర్ణీత కాలపరిమితిలోగా ఆమోదాలు లభించేలా చూస్తున్న ప్రయత్నాలను ఈ ప్రదర్శనలో ప్రముఖంగా వివరించారు.
ఢిల్లీకి ఉన్న పటిష్ఠమైన పర్యాటక వ్యవస్థ ఆ రాష్ట్ర చలనచిత్ర పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ప్రధాన ఉత్ప్రేరకంగా నిలిచింది. 2024 సంవత్సరంలో ఢిల్లీ 46.25 మిలియన్ల స్వదేశీ పర్యాటక సందర్శనలను నమోదు చేసింది. పర్యాటక రంగం కేంద్రపాలిత ప్రాంత జీడీపీకి దాదాపు 5 శాతం తోడ్పాటును అందిస్తోంది. ఢిల్లీలోని విభిన్న షూటింగ్ లొకేషన్లను ఈ ప్రతినిధి బృందం ప్రముఖంగా ప్రదర్శించింది. ఇందులో పురాతన కట్టడాలు, చారిత్రక ప్రాంతాలు, ప్రభుత్వ భవనాలు, మార్కెట్లు, ఉద్యానవనాలు, కన్వెన్షన్ సెంటర్లు, అత్యుత్తమ ఆతిథ్య మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
అంతర్జాతీయ చలనచిత్ర మార్పిడికి ఒక ముఖ్యమైన వేదికగా 'ఢిల్లీ అంతర్జాతీయ చలనచిత్ర వేడుక' పాత్రను కూడా ఈ సందర్భంగా ప్రధానంగా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర నిర్మాతలు, పరిశ్రమ నిపుణులు, ప్రేక్షకులను ఒకే చోటకు చేర్చే ఒక అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ కార్యక్రమంగా ఈ చలనచిత్ర వేడుకను వివరించారు. ఇది వివిధ సంస్కృతుల మధ్య చర్చలను ప్రోత్సహించడమే కాకుండా చలనచిత్ర నిర్మాతలకు అంతర్జాతీయ గుర్తింపు, నెట్‌వర్కింగ్ అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు.
భారతదేశాన్ని సినిమా షూటింగ్‌ల ప్రధాన గమ్యస్థానంగా ప్రోత్సహించడంలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న ఎన్‌ఎఫ్‌డీసీ.. బెర్లిన్‌లోని 'ఈఎఫ్ఎమ్' ప్రదర్శనలో ఢిల్లీ ప్రభుత్వం పాల్గొనేలా ప్రణాళికను రూపొందించి తగిన ఏర్పాట్లు చేసింది. ప్రాంతీయ చలనచిత్ర వ్యవస్థలను భారతదేశ ప్రపంచ స్థాయి విస్తరణలో విలీనం చేయడానికి, అంతర్జాతీయ పరిశ్రమలతో సంబంధాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి పని చేస్తామనే నిబద్ధతను ఈ సందర్భంగా ఎన్ఎఫ్‌డీసీ పునరుద్ఘాటించింది.
ఈఎఫ్ఎమ్ బెర్లిన్‌లో జరిగిన ఈ భాగస్వామ్యం ఢిల్లీకి ఉన్న అంతర్జాతీయ ఉనికిని విస్తరించడం, చలనచిత్ర పర్యాటకాన్ని పెంపొందించడం, ప్రపంచ స్థాయి సహకారాలకు భారతదేశాన్ని ఒక పోటీతత్వంతో కూడిన, సినిమా షూటింగ్‌లకు అనుకూలమైన దేశంగా సుస్థిరం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది.
***
(రిలీజ్ ఐడి: 2228469)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5