ప్రధాన మంత్రి కార్యాలయం
సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1, 2 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
నాడు పోస్టు చేయడమైనది:
13 FEB 2026 8:36PM by PIB Hyderabad
గౌరవ కేంద్ర ప్రభుత్వ మంత్రులారా, పార్లమెంటు సభ్యులారా, ప్రభుత్వ ఉద్యోగులారా, విశిష్ట అతిథులారా నా ప్రియమైన సహచరులారా!
నూతన చరిత్రకు ఇవాళ మనం ప్రత్యక్ష సాక్షులం. విక్రమ సంవత్ 2082, ఫాల్గుణ కృష్ణ పక్షం, విజయ ఏకాదశి, శక సంవత్ 1947 మాఘ 24, నేటి సాధారణ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 13-ఈ శుభదినాన భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో నూతన అధ్యాయం ప్రారంభమవుతోంది. మన శాస్త్రాల ప్రకారం, విజయ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజున తీసుకునే ఏ సంకల్పమైనా తప్పక ఫలిస్తుంది. అభివృద్ధి చెందిన భారత్ సంకల్పంతో ఇవాళ మనం సేవా తీర్థ, కర్తవ్య భవన్‌లోకి అడుగుపెడుతున్నాం. మన లక్ష్య సాధనలో విజయమనే దైవిక ఆశీస్సులు మనకు తోడుగా ఉన్నాయి. సేవా తీర్థ, నూతన భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ, పీఎంఓ బృందానికి, కేబినెట్ సెక్రటేరియట్‌కు, వివిధ శాఖల ఉద్యోగులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. వీటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లకు, కార్మికులకూ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.
మిత్రులారా,
స్వాతంత్ర్యానంతరం ఎన్నో కీలక నిర్ణయాలు, విధానాలు ఉత్తర, దక్షిణ బ్లాక్ భవనాల్లో రూపుదిద్దుకున్నాయి. ఈ కట్టడాలు బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి చిహ్నాలుగా ఉన్నాయన్నది నిజం. భారతదేశాన్ని శతాబ్దాల పాటు బానిసత్వంలో బంధించాలన్నదే ఈ భవనాల ఉద్దేశం.
మిత్రులారా,
ఒకప్పుడు భారతదేశానికి రాజధానిగా కోల్‌కతా ఉండేదని మనందరికీ తెలుసు. 1905 నాటి బెంగాల్ విభజన సమయంలో బ్రిటీష్ వ్యతిరేక ఉద్యమాలకు కంచుకోటగా కోల్‌కతా మారింది. దీనివల్ల 1911లో బ్రిటీష్ వారు రాజధానిని కోల్‌కతా నుంచి ఢిల్లీకి మార్చారు. ఆ తర్వాత వలస పాలన అవసరాలకు, వారి ఆలోచనా దృక్పథానికి అనుగుణంగా ఉత్తర, దక్షిణ బ్లాక్ భవనాలు నిర్మించారు. రైసినా హిల్స్‌పై ఈ భవనాలను ప్రారంభించినప్పుడు, అప్పటి వైస్రాయ్ బ్రిటీష్ చక్రవర్తి ఆకాంక్షలకు ఇవి ప్రతిరూపాలని ప్రకటించారు. బానిసత్వంలో ఉన్న భారతదేశంపై రాజు ముద్రను వేయటానికి ఇవి సాధనాలుగా పనిచేశాయి. ఈ భవనాలు మిగతా అన్నింటికన్నా ఎత్తులో ఉండాలనే ఉద్దేశంతోనే రైసినా హిల్స్‌ను ఎంచుకున్నారు. సేవా తీర్థ ఏ కొండ పైనో లేదు. సామాన్యులకు అందుబాటులో, నేలతో అనుసంధానమై ఉంది. దక్షిణ బ్లాక్, ఉత్తర బ్లాక్ వలసవాద ఆలోచనలకు ప్రతీకలుగా నిలిస్తే... సేవా తీర్థ, కర్తవ్య భవన్ భారత ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపాలని నేడు నేను గర్వంగా చెబుతున్నా. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ఏ రాజు సంకల్పాన్నో కాదు.. 140 కోట్ల భారతీయుల ఆశలను ప్రతిబింబిస్తాయి. ఇదే స్ఫూర్తితో, నేను సేవా తీర్థ, కర్తవ్య భవన్‌ను భారత ప్రజలకు అంకితమిస్తున్నా.
మిత్రులారా,
21వ శతాబ్దంలో పావు భాగం ముగిసింది. కేవలం విధానాలు, పథకాల్లోనే కాక, కార్యాలయాలు, సంస్థల్లోనూ అభివృద్ధి చెందిన భారత్ దార్శనికత ప్రతిబింబించాలి. దేశ పరిపాలన సాగే ప్రదేశాలు ప్రభావవంతంగా, స్ఫూర్తిదాయకంగా, ప్రతిష్ఠాత్మకంగా ఉండాలి. కొత్త సాంకేతికతలు మన పరిసరాలని వేగవంతం చేయాలి. పాత భవనాలు ఈ మార్పులకు అనుగుణంగా లేవు. ఉత్తర బ్లాక్, దక్షిణ బ్లాక్ భవనాలు దాదాపు శతాబ్దం నాటివి కావడం వల్ల స్థల సమస్యలు, పరిమిత వసతులతో శిథిలావస‌్థకు చేరుతున్నాయి. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా, మంత్రిత్వ శాఖలు ఢిల్లీలోని 50కి పైగా వేర్వేరు ప్రాంతాల నుంచి కార్యకలాపాలను సాగించటం వల్ల ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ భవనాల అద్దె కోసమే ఏటా రూ.1,500 కోట్లకు పైగా ఖర్చు అవుతోంది. సుమారు 8,000 నుంచి 10,000 మంది ఉద్యోగులు రోజూ ఈ కార్యాలయాలకు తిరగడం వల్ల అదనపు ఖర్చులతో పాటు సమయం కూడా వృథా అవుతోంది. ఇప్పుడు సేవా తీర్థ, కర్తవ్య భవన్ నిర్మాణంతో ఈ ఖర్చులు తగ్గటంతో పాటు సమయం ఆదా అయి, పని ఉత్పాదకత పెరుగుతుంది.
మిత్రులారా,
ఈ విప్లవాత్మక మార్పులో పాత భవనాల జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే, ఆ ప్రాంగణాల్లో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ భవనాలు దేశానికి దిశానిర్దేశం చేయడమే కాక, అనేక సంస్కరణలకు సాక్ష్యంగా నిలిచాయి. అవి భారత చరిత్రలో చిరస్మరణీయ భాగం. అటువంటి భవనాలను మ్యూజియాలుగా మార్చి దేశానికి అంకితం చేయాలని మేం నిర్ణయించాం. అవి 'యుగే యుగీన్ భారత్' మ్యూజియంలో భాగంగా మారి, రాబోయే తరాలకు స్ఫూర్తి కేంద్రాలుగా నిలుస్తాయి. యువత వాటిని సందర్శించినప్పుడు, చారిత్రక వారసత్వం వారికి సరైన మార్గదర్శకత్వం వహిస్తుంది.
మిత్రులారా,
అభివృద్ధి చెందుతున్న భారత్ దిశగా సాగుతున్న ప్రయాణంలో బానిసత్వ మసస్తత్వాన్ని మనం వీడాలి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు వలస పాలన నాటి జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. గతంలో ప్రధానమంత్రి నివాసాన్ని రేస్ కోర్స్ రోడ్ అని పిలిచేవారు. ఉపరాష్ట్రపతికి ప్రత్యేక అధికార నివాసం ఉండేది కాదు. ప్రజాస్వామ్య దేశంలో రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే దారిని రాజ్‌పథ్ అని పిలిచేవారు. స్వాతంత్యానంతరం సైనికుల కోసం కానీ, విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కోసం కానీ ఎలాంటి స్మారక చిహ్నాలు నిర్మించలేదు. స్వతంత్ర భారత రాజధానిలోని భవనాలు, బహిరంగ ప్రదేశాలు వలసపాలన నాటి బానిసత్వ చిహ్నాలతో నిండిపోయి, ఆ మనస్తత్వంలోనే ఉండిపోయాయి.
కానీ మిత్రులారా,
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వలసవాద మనస్తత్వం ఇకపై కొనసాగకూడదని 2014లో దేశం నిర్ణయించుకుంది. ఆ ఆలోచనా విధానాన్ని మార్చేందుకు మేం ఒక ప్రచారాన్ని ప్రారంభించాం. అమరవీరుల గౌరవార్థం జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించాం. పోలీసుల శౌర్యాన్ని స్మరించుకోవటానికి పోలీసు స్మారకాన్ని నిర్మించాం. రేస్ కోర్స్ రోడ్‌ను లోక్ కళ్యాణ్ మార్గ్‌గా మార్చాం. ఇది కేవలం పేరు మార్పు కాదు.. పాలనలోని స్ఫూర్తిని సేవగా మార్చటానికి చేసిన పవిత్రమైన ప్రయత్నం.
మిత్రులారా,
ఈ నిర్ణయాల వెనుక లోతైన భావం, గొప్ప దార్శనికత ఉన్నాయి. ఇది మన వర్తమానాన్ని, గతాన్ని, భవిష్యత్తును భారత అస్తిత్వంతో అనుసంధానిస్తుంది. రాజ్‌పథ్ ప్రాంతంలో పౌరులకు తగిన సౌకర్యాలు, ఏర్పాట్లు ఉండేవి కావు. మేం దాన్ని కర్తవ్య పథ్‌గా పునర్నిర్మించాం. దేశవ్యాప్తంగా కుటుంబాలు, పిల్లలు, సందర్శకులతో కళకళలాడే ఒక ప్రజా ప్రదేశంగా ఇది మారింది. ఇదే సముదాయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని మేం ప్రతిష్టించాం. చాలా కాలంగా మన రాజధానిలో వీరులకు ఇటువంటి నివాళులు కరువయ్యాయి. మన రాజధాని నడిబొడ్డు నుంచి భవిష్యత్ తరం స్ఫూర్తిని పొందాలని మేం సంకల్పించాం. రాష్ట్రపతి భవన్ సముదాయంలోనూ మార్పులు జరిగాయి: మొఘల్ గార్డెన్స్ పేరును అమృత్ ఉద్యాన్‌గా మార్చాం. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించినప్పుడు మేం పాత దాన్ని మరచిపోకుండా, దానికి సంవిధాన్ సదన్ అని కొత్త గుర్తింపును ఇచ్చాం. మంత్రిత్వ శాఖలన్నీ ఒకే సముదాయంలోకి తీసుకువచ్చి, ఆ భవనాలకు కర్తవ్య భవన్ అని పేరు పెట్టాం. పేర్లు మార్చే ఈ కార్యక్రమాలు కేవలం మాటల ఆట కాదు. అవి ఒక స్థిరమైన సైద్ధాంతిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. వలసవాద గుర్తుల నుంచి విముక్తి పొంది, స్వతంత్ర భారతం కోసం ఒక స్వతంత్ర అస్తిత్వాన్ని చాటుకోవటం.
మిత్రులారా,
కొత్త ప్రధానమంత్రి కార్యాలయానికి సేవా తీర్థ అని పేరు పెట్టాం. సేవా భావమే భారతదేశపు ఆత్మ, అదే మన దేశపు అసలైన గుర్తింపు. శ్రీ రామకృష్ణ పరమహంస తరచుగా ఇలా అనేవారు: "శివ జ్ఞానే జీవ సేవ" అంటే మానవ సేవయే మాధవ సేవ. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక చింతన మాత్రమే కాదు.. ఒక దేశ నిర్మాణ తత్వశాస్త్రం. పాలన అంటే సేవ అని, బాధ్యత అంటే అంకితభావమని ఈ భవనం మనకు ప్రతిక్షణం గుర్తుచేస్తుంది. సేవా పరమో ధర్మః అంటే సేవయే అత్యున్నతమైన ధర్మం అని మన శాస్త్రాలు చాటిచెప్పాయి. ఇదే ప్రధానమంత్రి కార్యాలయానికి, ప్రభుత్వానికున్న దార్శనికత. సేవా తీర్థ కేవలం ఒక పేరు మాత్రమే కాదు, అదొక సంకల్పం. సేవా తీర్థ అంటే పౌరులకు చేసే సేవతో పునీతమైన ప్రదేశం, సేవ అనే సంకల్పం నెరవేరే చోటు అని అర్థం. తీర్థ అంటే "లక్ష్యాన్ని చేరుకోవటానికి, దాటటానికి సహాయపడేది" అని అర్థం. అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే, స్వావలంబన సాధించాలనే లక్ష్యం భారత్ ముందున్నది. మనం కోట్లాది మందిని పేదరికం నుంచి, బానిసత్వ మనస్తత్వం నుంచి దేశాన్ని విముక్తం చేయాలి. ఇది సేవ అనే శక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
మిత్రులారా,
నేడు భారత్ సంస్కరణల వేగంతో దూసుకుపోతోంది. అంతర్జాతీయ సంబంధాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. నూతన వాణిజ్య ఒప్పందాలు అవకాశాలను కల్పిస్తున్నాయి. ప్రతి పథకం ప్రజలకు వంద శాతం చేరాలనే లక్ష్యం దిశగా దేశం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో మీ పని వేగం, మీలోని నూతన ఆత్మవిశ్వాసం దేశ లక్ష్యాలను సాధించటంలో సేవా తీర్థ, కర్తవ్య భవన్ కీలక పాత్ర పోషిస్తాయి.
మిత్రులారా,
ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు ఆశీస్సులు తీసుకోవటం, లోకకళ్యాణాన్ని కోరుకోవటం, ఒక మంచి సంకల్పాన్ని స్వీకరించటం మన సంస్కృతి నేర్పిన పాఠం. "ఆ నో భద్రాః క్రతవో యంతు విశ్వతః" అంటే అన్ని దిశల నుంచి మనకు ఉదాత్తమైన ఆలోచనలు రావాలని వేద మంత్రం దిశానిర్దేశం చేస్తోంది. ఈ భవనానికి ఇదే ప్రాణవాయువు కావాలి. భారతదేశపు గొప్ప ప్రజాస్వామ్యంలో ప్రజల ఆలోచనలే శక్తి, వారి కలలే పెట్టుబడి, వారి ఆకాంక్షలే ప్రాధాన్యత, వారి ఆశయాలే మార్గదర్శకాలు. ఈ భావాలకు, ఈ వ్యవస్థకు మధ్య ఎటువంటి అడ్డుగోడలు కానీ, దూరం కానీ ఉండకూడదు. ప్రజల కలలను అర్థం చేసుకున్నప్పుడే విధానాలు సఫలమవుతాయి. ప్రజల ఆశయాలను అనుభూతి చెందినప్పుడే నిర్ణయాలు ప్రభావవంతంగా మారతాయి. గత 11 ఏళ్లలో మనం చూసిన నూతన పరిపాలనా నమూనాలో ప్రతి నిర్ణయానికి పౌరుడే కీలకం. "నాగరిక్ దేవో భవ" కేవలం ఒక నినాదం మాత్రమే కాదు.. మా పని సంస్కృతి. మీరు ఈ కొత్త భవనాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఇదే స్ఫూర్తితో ఉండాలి. ఈ సేవా తీర్థలో తీసుకునే ప్రతి నిర్ణయం, ఇక్కడ కదిలే ప్రతి ఫైలు, గడిపే ప్రతి క్షణం 140 కోట్ల భారతీయుల జీవితాలను మెరుగుపరచటానికే అంకితం కావాలి. నేను ప్రతి అధికారిని, ప్రతి ఉద్యోగిని, ప్రతి కర్మయోగిని కోరుతున్నాను. మీరు ఈ భవనంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ ఒక్క క్షణం ఆలోచించండి. ఈరోజు నేను చేసే పని లక్షలాది మంది పౌరుల జీవితాలను సులభతరం చేస్తుందా? అని ప్రశ్నించుకోండి. ఈ ఆత్మపరిశీలనే ఈ ప్రదేశానికి గొప్ప బలమవుతుంది.
మిత్రులారా,
మనం ఇక్కడ అధికారాన్ని ప్రదర్శించటానికి కాదు.. బాధ్యతను నెరవేర్చటానికి ఉన్నాం. సేవా భావంతో పాలన సాగినప్పుడు అసాధారణ ఫలితాలుంటాయని మనం చూశాం. ఈ విధంగానే 250 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. ఆర్థిక వ్యవస్థ నూతన వేగాన్ని పుంజుకుంది.
మిత్రులారా,
2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. ప్రపంచం ముందు భారత్ చేసిన ప్రతిజ్ఞ. కాబట్టి, ఇక్కడ రూపొందించే ప్రతి విధానం, తీసుకునే ప్రతి నిర్ణయం నిరంతర సేవా భావన స్ఫూర్తినివ్వాలి. పదవీ విరమణ చేసినా, ఈ భవనం నుంచి వేరే బాధ్యతల్లోకి వెళ్లినా గడిచిన ఈ రోజులను మీరు ఎంతో గర్వంగా స్మరించుకుంటారు. అవును, నేను సేవా తీర్థ, కర్తవ్య భవన్‌లో ఉన్నప్పుడు రోజూ పౌరుల సేవకే అంకితమయ్యాను. తీసుకున్న ప్రతి నిర్ణయం దేశ హితం కోసమే అని సగర్వంగా చెప్పుకోగలరు. ఆ క్షణం మీకు ఎనలేని ప్రశాంతతనిస్తుంది. అదే మీ గొప్ప విజయంగా మారుతుంది. అది మీ వ్యక్తిగత నిధిగా మిగిలిపోతుంది. ఆ నిధే మీ జీవితాన్ని గౌరవంతో నింపుతుంది.
మిత్రులారా,
బాధ్యత పునాదిపైన హక్కులనే మహోన్నత సౌధం నిర్మితమవుతుందని మహాత్మాగాంధీ నమ్మేవారు. మన విధులను సక్రమంగా నిర్వహించినప్పుడు, ఎంతటి సవాలునైనా ఎదుర్కోగలం. పరిష్కారాలను కనుక్కోగలం. విధులకు మన రాజ్యాంగ నిర్మాతలు అంతటి ప్రాముఖ్యతనివ్వటానికి ఇదే కారణం. కోట్లాది మంది ప్రజల కలలు సాకారమవటం మన కర్తవ్య నిర్వహణపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. కర్తవ్యమే ఆరంభం. చైతన్యవంతమైన ఈ దేశానికి కర్తవ్యమే ప్రాణాధారం. కర్తవ్యం అంటే కరుణ, కష్టపడే తత్వాల కలయిక. కర్తవ్యం అంటే సంకల్పాల ఆశ, కఠోర శ్రమకు శిఖరం వంటిది. ప్రతి సమస్యకు పరిష్కారం, అభివృద్ధి చెందిన భారత్ పట్ల మనకున్న విశ్వాసం. కర్తవ్యం అంటే సమానత్వం, కర్తవ్యం అంటే అనురాగం, కర్తవ్యం విశ్వవ్యాప్తం.. కర్తవ్యం సర్వవ్యాపకం. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్‌తో పెనవేసుకున్న సూత్రమే కర్తవ్యం. దేశం పట్ల అంకితభావానికి ప్రతీక కర్తవ్యం. ప్రతి జీవితంలో వెలుగులు నింపే సంకల్ప బలమే కర్తవ్యం. స్వావలంబన భారత్ ఇచ్చే అసలైన ఆనందమే కర్తవ్యం. రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్తుకు కర్తవ్యమే అసలైన గ్యారెంటీ. భారతమాత ప్రాణశక్తికి ధ్వజవాహిక ఈ కర్తవ్యం. దేశభక్తితో చేసే ప్రతి పనీ ఒక కర్తవ్యమే. నాగరిక్ దేవో భవ అనే భావనను ఆచరించే జాగృత మార్గమే కర్తవ్యం.
మిత్రులారా,
కర్తవ్యాన్ని పరమావధిగా భావిస్తూ, పూర్తి బాధ్యతాయుతమైన దృక్పథంతో సేవా తీర్థలో, నూతనంగా నిర్మించిన భవన సముదాయాల్లోనూ అడుగు పెట్టాలి.
మిత్రులారా,
నేడు భారతదేశం సరికొత్త శిఖరాల వైపు, నవశకం దిశగా శరవేగంతో దూసుకుపోతోంది. రాబోయే కాలంలో కేవలం ఆర్థిక వ్యవస్థ ద్వారానే కాదు.. మన పరిపాలనా దక్షత, విధానపరమైన స్పష్టత, కర్మయోగుల అంకితభావం ద్వారా మనకి గుర్తింపు లభిస్తుంది. సేవా తీర్థ, కర్తవ్య భవన్‌లో తీసుకునే ప్రతి నిర్ణయం కేవలం ఒక ఫైలు పరిష్కారం మాత్రమే కాదు.. అభివృద్ధి చెందిన భారత్-2047 దిశను నిర్దేశిస్తుంది. గుర్తుంచుకోండి. 2047 ఒక తేదీ మాత్రమే కాదు.. 140 కోట్ల మంది భారతీయుల కలలకు గడువు. ఈ ప్రయాణంలో ప్రతి సంస్థా, ప్రతి అధికారీ ముఖ్యమే.. ప్రతి ఉద్యోగి, ప్రతి కర్మయోగి అత్యంత కీలకమైనవారే. సేవా తీర్థ సునిశిత పాలనకు చిహ్నంగా, పౌర-కేంద్రీకృత పరిపాలనకు నమూనాగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. అధికారం కాదు.. సేవ కనిపించేలా, హోదా కాదు.. అంకితభావం ఉట్టిపడేలా, ఆధిపత్యం కాదు.. బాధ్యత ప్రధానంగా ఉండేలా ఆ ప్రదేశం ఉండాలి. మన దృఢ సంకల్పం చరిత్రను తిరగరాస్తుందని, మన కష్టం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎర్రకోట నుంచి నేను చెప్పినట్లుగా "ఇదే సమయం, సరైన సమయం" ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేశమే ప్రథమమనే స్ఫూర్తితో ముందుకు సాగుదాం. భారతదేశ విధిని పునర్నిర్మించుకున్న కాలం ఇదే. సరికొత్త శక్తితో, వేగంతో వేల ఏళ్ల ఉజ్వల భవిష్యత్తు వైపు భారతదేశం సాహసోపేతమైన అడుగులు వేసిన సమయం ఇదేనని భవిష్యత్ తరాలు చెప్పుకోవాలి. ఈ విశ్వాసంతో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.
వందేమాతరం!
(రిలీజ్ ఐడి: 2228221)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7