|
మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
భారత్ మండపంలో ‘భారత్ బోధన్ ఏఐ సదస్సు-2026’ ప్రారంభం: దేశవ్యాప్త ‘ఎడ్యుఏఐ’ సహకారానికి వేదిక సిద్ధం
· ‘బోధన్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి · విద్యలో అనుసరణీయ ఏఐ పరిష్కారాలు సహా బాధ్యతాయుత ఏఐ అనుసరణకు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పిలుపు · పాఠశాల.. ఉన్నత విద్య స్థాయి సహా నైపుణ్య కల్పనకు ఉద్దేశించిన ఏఐ ఆవిష్కరణలను ప్రస్ఫుటం చేసిన సదస్సు · ఐఐటీ-బాంబే ప్రాంగణంలో తయారీ రంగ ఏఐ కేంద్రం ఏర్పాటుపై కొలంబియా విశ్వవిద్యాలయంతో ఐఐటీ-బాంబే అవగాహన ఒప్పందం
నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2026 4:47PM by PIB Hyderabad
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇవాళ ‘భారత్ బోధన్ ఏఐ సదస్సు-2026’ను ఉద్దేశించి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగించారు. ఆ శాఖ సహాయ మంత్రి శ్రీ సుకాంత మజుందార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘బోధన్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను శ్రీ ప్రధాన్ ప్రారంభించారు. భారత విద్యా వ్యవస్థ అంతటా కృత్రిమ మేధ (ఏఐ) ఏకీకరణను విస్తరించడంలో ఈ సదస్సు కీలక మలుపు కానుంది. పాఠశాల విద్య-అక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్; ఉన్నత విద్య కార్యదర్శి డాక్టర్ వినీత్ జోషి; ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్; ఐఐటీ-మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి; విద్యా రంగంలో ‘ఏఐ’ని ఉపయోగిస్తున్న ప్రముఖ అగ్రగామి అంకుర సంస్థల ప్రతినిధులు, పరిశోధకులు, వ్యవస్థాపకులు దీనికి హాజరయ్యారు. ‘ఏఐ’ ఆధారిత విద్యకు రంగం సిద్ధం చేయడం, వ్యూహాత్మక సంధానం, భాగస్వామ్యాల ఏర్పాటు తదితరాలకు జాతీయ వేదికగా ఈ సదస్సుకు రూపకల్పన చేశారు.
సదస్సు ప్రధాన లక్ష్యం:
· అంతరాలు-అవకాశాలను గుర్తించే రంగం ఆవిష్కరణ, సముచిత వ్యవస్థ గుర్తింపు
· ప్రభుత్వం, విద్యా సంస్థలు, అంకుర సంస్థలు, పారిశ్రామిక రంగమంతటా వ్యూహాత్మక భాగస్వామ్యాలకు మద్దతు
· దేశవ్యాప్తంగా ఏఐ-ఆధారిత అభ్యసన పరిష్కారాల రూపకల్పన, ఏకీకరణ సహా అనుసరణీయత, సార్వత్రిక-పరస్పర నిర్వాహక వేదికైన ‘భారత్ ఎడ్యుఏఐ (EduAI) స్టాక్ రూపకల్పనకు శ్రీకారం.
విద్యా రంగంలో 4 ప్రాధాన్య శ్రేణులు- పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యం-కార్మికశక్తి సంసిద్ధత, పరిశోధన-విస్తృత సాంకేతికతల సంబంధిత పరిష్కారాలను ఈ సదస్సు అన్వేషిస్తుంది.
ఈ సందర్భంగా శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ- రెండు రోజులపాటు సాగే ఈ సమావేశంలో విద్యారంగం, పరిశ్రమలు, విధాన నిర్ణేతలు, అంకుర సంస్థలు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, నైపుణ్యావరణ వ్యవస్థ తదితరాలను ఒకే వేదికపైకి తెస్తుందన్నారు. దీనిపై మేధో మథనం ద్వారా విద్యలో ‘ఏఐ’ని ఏకీకృతం చేస్తూ ‘భారత్ ఎడ్యుఏఐ స్టాక్’ను రూపొందిస్తుందని చెప్పారు. భారత్‌ను ఏఐ సంసిద్ధం చేయాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విస్పష్టంగా పిలుపునిచ్చారని పేర్కొన్నారు. ఆ మేరకు నైతిక, బాధ్యతాయుత, సమగ్ర ‘ఏఐ’ రూపకల్పన-అమలు అవసరాన్ని ఆయన స్పష్టం చేశారని తెలిపారు.
రూపకల్పన రీత్యా భారత్ ఏఐ సార్వజనీనంగా ఉంటుందని, స్వరూపం రీత్యా పరస్పర సమన్వయంతో పనిచేయగలదని, సామర్థ్యం రీత్యా స్వతంత్రంగా ఉంటుందని శ్రీ ప్రధాన్ వివరించారు. విద్యార్థులకు సాధికారత, బోధకులకు మద్దతు లక్ష్యంగా విద్యారంగంలో ‘ఏఐ’ ఏకీకరణ ప్రాధాన్యాన్ని ఆయన స్పష్టం చేశారు. విద్యను పరిణామశీలం చేయడానికి, వికసిత భారత్ లక్ష్య సాధనకు అనుసరణీయ, బాధ్యతాయుత, నైతిక, భారత-కేంద్రక స్వతంత్ర ‘ఏఐ’ నమూనాలను రూపొందించాలని భాగస్వాములందరికీ పిలుపునిచ్చారు. సమష్టి మేధతో భారత ఏఐ సామర్థ్యం పెంపు, ‘ఏఐ’లో భారత అగ్రస్థానం బలోపేతం, విద్యలో సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాల రూపకల్పన, అందరికీ ‘ఏఐ’ సౌలభ్యం దిశగా ఈ సదస్సు మార్గం సుగమం చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ సుకాంత మజుందార్ ప్రసంగిస్తూ- భారత దేశం ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’ దిశగా పయనిస్తున్నందున “సురక్షిత, జవాబుదారీ, నిష్పాక్షిక, సాధికార (సెక్యూర్, అకౌంటబుల్, ఫెయిర్, ఎంపవరింగ్ ఏఐ- S.A.F.E. AI) ‘ఏఐ’కి కట్టుబడి ఉందామని పిలుపునిచ్చారు. తద్వారా సమ్మిళిత పురోగమనం దిశగా భారత్ సాంకేతికతకు రూపమిస్తుంది.
ఈ సదస్సులో భాగంగా పాఠశాల విద్య, ఉన్నత విద్య, నైపుణ్యంలో ఏఐ-ఆధారిత ఆవిష్కరణలను చాటే ప్రదర్శనను కూడా ప్రారంభించారు. విధాన రూపకర్తలు, ఆవిష్కర్తల మధ్య పరస్పర చర్చలకు ఇదొక వేదికను సమకూరుస్తుంది.
ఈ సదస్సులో ప్రారంభించనున్న కీలక కార్యక్రమాలు, భాగస్వామ్యాలు కిందివిధంగా ఉన్నాయి:
· తయారీ రంగం కోసం ఐఐటీ-బాంబే ప్రాంగణంలో ఏఐ కేంద్రం ఏర్పాటుపై కొలంబియా విశ్వవిద్యాలయంతో ఐఐటీ-బాంబే అవగాహన ఒప్పందం.
· ఐఐఎం-లక్నో ఏఐ కార్యక్రమానికి శ్రీకారం
· ఐఐఎం-జమ్మూ, ఏఐటీ-బ్యాంకాక్‌ల భాగస్వామ్యంలో సంస్థాగత సహకార కార్యకలాపాలు.
· ఐఐఎం-రాంచీ కార్యక్రమం.. ఏఐ ద్వారా బోధన
ఈ సదస్సులో ‘బోధన్.ఏఐ’ సహా ఐఐటీ-మద్రాస్‌లో ‘ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్’ ఏర్పాటుపై ప్రత్యేక గోష్ఠి నిర్వహించారు. ఓపెన్ భారత్ ఎడ్యుఏఐ స్టాక్ రూపల్పన ఆవశ్యకత సహా ఈ కార్యక్రమంపై సమగ్ర ప్రదర్శన నిర్వహించారు. ‘సర్వం ఏఐ’ సీఈవో శ్రీ ప్రత్యూష్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో ప్రసంగించగా, గోష్ఠిలో భాగంగా విద్యలో ఏఐ భవిష్యత్తుపైనా చర్చించారు.
అనంతరం కింద పేర్కొన్న 2 సాంకేతిక గోష్ఠులు నిర్వహించారు:
సాంకేతిక చర్చా గోష్ఠి 1: పాఠశాల విద్య-తరగతుల్లో కార్యక్రమాలు
దీనికి ‘ఇన్‌ఫ్లెక్షన్ ఏఐ’ సీటీవో విభు మిట్టల్ సమన్వయకర్తగా వ్యవహరించారు. రాకెట్ లెర్నింగ్ పాలసీ లీడ్ రాధిక మాథుర్; సీకే-12 ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నీరు ఖోస్లా; ఖాన్ అకాడమీ కంట్రీ డైరెక్టర్ స్వాతి వాసుదేవన్; వేదాంతు సహ వ్యవస్థాపకుడు పుల్కిత్ జైన్; ఐడ్రీమ్ ఎడ్యుకేషన్ సహ వ్యవస్థాపకుడు పునీత్ గోయల్; లీడ్ గ్రూప్ సీఈవో సుమిత్ మెహతా; అరివిహాన్ సీఈవో రితేష్ సింగ్ చందేల్; లెర్నింగ్ మ్యాటర్స్ సహ వ్యవస్థాపకుడు-సీఈవో జి.రామమూర్తి; ఎకోవేషన్ వ్యవస్థాపకుడు-సీఈవో రితేష్ సింగ్ ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు.
సాంకేతిక చర్చా గోష్ఠి 2: బోధకుల సామర్థ్య వికాసం-ఎఫ్‌ఎల్‌ఎన్.. సిస్టమిక్ రిఫార్మ్
ఈ గోష్ఠికి ‘వాధ్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్’ సీఈవో ప్రకాష్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఎక్‌స్టెప్ ఫౌండేషన్ సీఓఓ జగదీష్ బాబు; ఐఐటీ-బాంబే (టీఏఆర్‌ఏ) ప్రొఫెసర్ డాక్టర్ ప్రీతి రావు; లాంగ్వేజ్ అండ్ లెర్నింగ్ ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్ ఉద్దాలక్ దత్తా; సంపర్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు-ఛైర్మన్ వినీత్ నాయర్; మాధి ఫౌండేషన్ సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్ గోకుల్ కుమార్; టీసీఎస్ ఫౌండేషన్ గ్లోబల్ హెడ్-ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ విపుల్ షా; విద్యాశక్తి ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగరాజన్ పిచుమణి తదితరులు కీలక వక్తలుగా పాల్గొన్నారు.
తరగతి గదిలో అభ్యాసం, ఉపాధ్యాయ మద్దతు వ్యవస్థలు సహా ప్రాథమిక అభ్యసన కార్యక్రమాలు, పాలన చట్రాల మెరుగుదల లక్ష్యంగా అనుసరణీయ ఏఐ ఆధారిత పరిష్కారాల ప్రదర్శనలో భాగంగా ప్రముఖ సంస్థలు, అంకుర సంస్థలను ఈ సదస్సు ఒక వేదికపైకి తెచ్చింది.
సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఏఐ వేదికలు, ఆధునిక సాంకేతికతలు, నైపుణ్యాలు, ఉన్నత విద్య వగైరాలపై దృష్టి సారిస్తూ ఈ నెల 13 వరకూ సదస్సు కొనసాగుతుంది.
***
(రిలీజ్ ఐడి: 2227202)
|