హోం మంత్రిత్వ శాఖ
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ‘ఛత్తీస్‌గఢ్ @ 25: షిఫ్టింగ్ ద లెన్స్’ పుస్తకంపై జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
· ఆంగ్ల పాత్రికేయ రంగంలో భారత్ మౌలిక సిద్ధాంతాన్ని నిర్భయంగా, స్పష్టతతో చాటడంలో ‘ఆర్గనైజర్’ పాత్ర అవిస్మరణీయం
· మోదీజీ నేతృత్వంలో భారత్ సాధిస్తున్న విజయాలు.. అంతర్జాతీయ స్థిరత్వానికీ, సమృద్ధికీ దోహదపడతాయని నేడు ప్రపంచమంతా అంగీకరిస్తోంది
· ఛత్తీస్‌గఢ్‌ను ‘ఎరుపు భీభత్సం’ నుంచి నిశ్చితంగా విముక్తం చేసిన ప్రభుత్వం.. అతి త్వరలో దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్
· అభివృద్ధిలో నిర్లక్ష్యం వల్లే నక్సలిజం సమస్య పుట్టిందనేవారు దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు
· తుపాకీ ద్వారా సమస్యల పరిష్కారమన్నది మావోయిస్టు భావజాలం... కానీ చర్చలు, సంప్రదింపులు, సామరస్యపూర్వక పరిష్కారమే అసలైన రాజ్యాంగ స్ఫూర్తి
· మావోయిస్టు హింసకు లోనుకాకపోయుంటే.. అపార ఖనిజ సంపద ఉన్న బస్తర్ ప్రాంతం దేశంలో అత్యంత సంపన్నంగా తులతూగేది
· ఎవరినో చంపడం కాదు.. ఆయుధాలు చేతబట్టి అమాయకులను చంపే
నక్సలైట్లను నిలువరించడం మా కర్తవ్యం
· ప్రస్తుత ప్రతిపక్ష హయాంలో కుంభకోణాలు, అక్రమాలు, అవినీతి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌కు పేరు.. వారి హయాంలో నక్సలైట్లకు ఆశ్రయంగా మారిన రాష్ట్రం
· చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియను పక్కదారి పట్టించిన ప్రస్తుత ప్రతిపక్షం... జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌ల ఏర్పాటుతో వివాదాలకు తావులేని, శాంతియుత పరిష్కారాన్ని అందించిన అటల్ జీ
నాడు పోస్టు చేయడమైనది:
08 FEB 2026 9:02PM by PIB Hyderabad
‘ఆర్గనైజర్’ వారపత్రికకు చెందిన ‘భారత్ ప్రకాశన్’ ప్రచురించిన ‘ఛత్తీస్‌గఢ్ @ 25: షిఫ్టింగ్ ద లెన్స్’ పుస్తకంపై ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఈ రోజు నిర్వహించిన జాతీయ సదస్సులో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి, ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ శర్మ, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంగ్ల పత్రికా రంగంలో భారతదేశ మూల సిద్ధాంత భావజాలానికి ఆర్గనైజర్ పత్రిక ఎల్లవేళలా కట్టుబడి ఉందనీ, ఆ సిద్ధాంతంపై దృఢంగా నిలబడి దానిలోని వివిధ కోణాలను దేశ ప్రజల ఎదుట నిలిపేలా కృషి చేసిందని శ్రీ అమిత్ షా అన్నారు. అదే క్రమంలో ఈ రోజు ‘ఛత్తీస్‌గఢ్ @ 25: షిఫ్టింగ్ ద లెన్స్’ అనే ఇతివృత్తంతో భద్రత, సమృద్ధి, స్థిరత్వం అంశాలపై ఈ సదస్సును నిర్వహించడం అభినందనీయమన్నారు.
భద్రత, సమృద్ధి, స్థిరత్వం.. ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా ఇవి చాలా కీలకమైనవనీ, మరీముఖ్యంగా స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రానికి ఇవి మరింత ప్రధానమైనవనీ కేంద్ర హోం మంత్రి అన్నారు. శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానమంత్రి బాధ్యతను స్వీకరించిన సమయంలో.. చిన్న రాష్ట్రాల ఏర్పాటును కేవలం ఒక ప్రయోగంగా మాత్రమే కాక, అక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిగా భావించారని శ్రీ అమిత్ షా చెప్పారు. వాజ్‌పేయీ గారి హయాంలో జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను ఏకకాలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. శ్రీ మోదీ నాయకత్వంలో భారత్ సాధించిన విజయాలు అంతర్జాతీయ స్థిరత్వానికీ, సమృద్ధికీ దోహదపడతాయని ఇప్పుడు ప్రపంచమంతా గుర్తిస్తోందన్నారు.
అటల్ జీ హయాంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాష్ట్రాల మధ్య ఎలాంటి చేదు అనుభవాలు, విద్వేషాలు తలెత్తలేదనీ.. కానీ గత కేంద్ర ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తీవ్రమైన చేదు అనుభవాలు చోటుచేసుకున్నాయనీ శ్రీ అమిత్ షా అన్నారు. దశాబ్దానికి పైగా అవి కొనసాగుతూనే ఉన్నాయన్నారు. నేటికీ ఆ రెండు రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు పరిష్కారం కాకుండానే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీ, భావజాలం నుంచి వచ్చిన వ్యక్తులు అత్యంత సమన్వయంతో పనిచేస్తారనీ, కానీ కేవలం పాలనపరమైన ప్రక్రియలోనే వ్యవహారాలను నడిపిస్తే- ఈ రాష్ట్రాల మధ్య చేదు అనుభవాలు తలెత్తుతాయనీ శ్రీ అమిత్ షా చెప్పారు. రాజకీయాల్లో భావజాలం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందని, పాలనను నడిపించేది అదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఒక సైద్ధాంతిక భావజాలమంటూ లేని రాజకీయ పార్టీ నిజంగా రాష్ట్రం లేదా దేశ సంక్షేమం కోసం పనిచేయలేదని శ్రీ అమిత్ షా అన్నారు.
పత్రికా రంగంలో ‘ఆర్గనైజర్’ ఎల్లవేళలా జాతీయ అంశాలపై సైద్ధాంతిక ప్రాతిపదికన సరైన, సమతౌల్యంతో కూడిన విశ్లేషణలు అందించిందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి చెప్పారు. భావాలను ఎటువంటి సంకోచం లేకుండా, నిర్భయంగా ప్రజల ఎదుట నిలపడమే జర్నలిజం కర్తవ్యమనీ, ఆ నిర్భీతిని ఆర్గనైజర్ పత్రిక ఎన్నడూ విడనాడలేదనీ ఆయన పేర్కొన్నారు. గతంలో ఆర్గనైజర్‌ను ఎగతాళి చేశారనీ, విస్మరించారనీ, వ్యతిరేకించారనీ.. అయినప్పటికీ తన సైద్ధాంతిక దృక్పథాన్ని దృఢంగా నిలబెట్టుకోవడానికి ఆర్గనైజర్ ఎన్నడూ వెనుకాడలేదని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యానికి ముందూ, స్వాతంత్ర్యానంతరమూ భారత్ ప్రస్థానంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కృషి అత్యంత కీలకమనీ, ఏ చరిత్రకారుడూ దీనిని కాదనలేరని శ్రీ అమిత్ షా అన్నారు. ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు గొప్ప కృషి చేయని జాతీయ, సామాజిక రంగమంటూ ఏదీ లేదన్నారు.
ఛత్తీస్‌గఢ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయ్యాయనీ, ఈ 24 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు జరిగాయనీ హోం మంత్రి అన్నారు. గతంలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లను బిమారు రాష్ట్రాలుగా పిలిచేవారని ఆయన గుర్తుచేశారు. కానీ నేడు మధ్యప్రదేశ్ - ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ - ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్‌లు బిమారు ముద్రను చెరిపేసుకుని, అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా ఎదిగే దిశగా.. ప్రగతి ముంగిట్లో నిలబడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఈ రాష్ట్రాల్లో చాలా కాలంపాటు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే దీనికి ప్రధాన కారణమనీ, ఆ సమయంలో అభివృద్ధి దశ కొనసాగిందనీ శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. తమ పార్టీ ప్రభుత్వాలు సుపరిపాలనలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాయని ఆయన అన్నారు. 25 ఏళ్ల కిందట ఛత్తీస్‌గఢ్‌ను బిమారు రాష్ట్రంగా, నక్సలిజం ప్రభావిత రాష్ట్రంగా భావించేవారన్న శ్రీ అమిత్ షా.. నేడు ఆ రాష్ట్రం బిమారు ముద్రను చెరిపేసుకుని, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారే దిశలో ఉందన్నారు. ఇక్కడ నక్సలిజం పూర్తిగా అంతమయ్యే దశకు చేరుకుందని స్పష్టం చేశారు. భావజాల ప్రాతిపదికన పనిచేసే తమ పార్టీ ప్రభుత్వాల వల్లే ఈ గుణాత్మక మార్పు సాధ్యపడిందన్నారు.
ఛత్తీస్‌గఢ్ 25 ఏళ్ల ప్రస్థానంలో మొదటి కొన్నేళ్లపాటు ప్రస్తుత ప్రతిపక్షం అధికారంలో ఉందని, ఆ సమయంలో రాష్ట్రం అరాచకాలు, అల్లర్లు, ఉద్యమాలు చెలరేగాయని శ్రీ అమిత్ షా అన్నారు. ఆ తర్వాత 15 ఏళ్లపాటు తమ పార్టీ అధికారంలోకి వచ్చిందనీ, ఈ 15 ఏళ్ల కాలంలో అభివృద్ధిలోని ప్రతి కోణంలోనూ ఛత్తీస్‌గఢ్‌ను ముందుకు తీసుకెళ్లామనీ ఆయన పేర్కొన్నారు. నాటి బీజేపీ ముఖ్యమంత్రి నక్సలిజంపై పోరాడారని, దానిపై అలుపెరగని పోరాటం చేశారనీ చెప్పారు. అయితే ఆ సమయంలో ఎక్కువ భాగం కేంద్రంలో ప్రస్తుత ప్రతిపక్షం అధికారంలో ఉందన్నారు. అనంతరం ప్రస్తుత ప్రతిపక్షం అయిదేళ్లపాటు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనీ, ఆ కాలంలో ఛత్తీస్‌గఢ్ ప్రజలు కుంభకోణాలు, అక్రమాలు, అవినీతి బారిన పడ్డారనీ శ్రీ అమిత్ షా పేర్కొన్నారు. ఆ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంత చిన్న రాష్ట్రంలోనూ రకరకాల అక్రమాలు బయటపడ్డాయని శ్రీ అమిత్ షా అన్నారు. అంతేకాకుండా ఛత్తిస్‌గఢ్ నక్సల్ ఉద్యమానికి ఆశ్రయంగా మారేలా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. అనంతరం మళ్ళీ తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనీ, దీంతో ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో నూతన అధ్యాయం మొదలైందనీ అన్నారు.
2000, 2025 సంవత్సరాల ఛత్తీస్‌గఢ్ బడ్జెట్లను పోల్చి చూస్తే... 2025లో రాష్ట్ర బడ్జెట్ 30 రెట్లు పెరిగిందనీ, అలాగే ఛత్తీస్‌గఢ్ తలసరి ఆదాయం 17 రెట్లు, రాష్ట్ర జీఎస్డీపీ 25 రెట్లు పెరిగాయనీ శ్రీ అమిత్ షా తెలిపారు.
గత 25 ఏళ్లలో సాగునీటి సౌకర్యం రెట్టింపైందన్నారు. ఖరీఫ్ పంటల ఉత్పత్తి మూడు రెట్లు పెరగగా, రబీ పంటల ఉత్పత్తి దాదాపు ఆరు రెట్లు పెరిగిందని శ్రీ అమిత్ షా తెలిపారు. గతంలో కేవలం 7 జిల్లా ఆసుపత్రులు ఉండగా.. ఇప్పుడు అవి 30కి పెరిగాయనీ, అప్పట్లో ఒకే మెడికల్ కాలేజీ ఉండగా.. నేడు వాటి సంఖ్య 16కు పెరిగిందనీ ఆయన చెప్పారు. అలాగే అంగన్‌వాడీ భవనాల సంఖ్య 18 రెట్లు పెరిగిందని వివరించారు. గతంలో పోషకాహార లోపం వల్ల సంభవించే మరణాల రేటు 61గా ఉండేదని, ఇప్పుడది 15కి తగ్గిందని శ్రీ అమిత్ షా చెప్పారు. ప్రసవ సమయంలో తల్లుల మరణాల రేటు ప్రతి లక్ష మందికి 365గా ఉండేదనీ, ప్రభుత్వ కృషి ఫలితంగా అది 146కి తగ్గిందని పేర్కొన్నారు. అలాగే శిశు మరణాల రేటు 79 నుంచి 37కి తగ్గిందన్నారు. గత ప్రతిపక్ష ప్రభుత్వాలు నిరక్షరాస్యులైన కొత్త తరాన్ని సృష్టించాయనీ.. కానీ నేడు అక్షరాస్యత రేటు 65 శాతం నుంచి 79 శాతానికి పెరిగిందనీ ఆయన వివరించారు. గతంలో రాష్ట్రంలో ఒక్క ఏకలవ్య ఆవాస పాఠశాల కూడా ఉండేది కాదన్న హోం మంత్రి.. నేడు వాటి సంఖ్య 75కి చేరిందన్నారు. అలాగే హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లల సంఖ్య కూడా మూడు రెట్లు పెరిగిందన్నారు. గ్రామీణ రహదారుల నిర్మాణం 98 రెట్లు పెరిగిందనీ, పెట్టుబడుల్లో 247 రెట్ల వృద్ధి నమోదైందనీ ఆయన వివరించారు.
నేడు ఛత్తీస్‌గఢ్ అనూహ్యంగా దాదాపు 7.5 శాతం వృద్ధి రేటుతో ముందుకు సాగుతోందని హోం మంత్రి అన్నారు. వ్యవసాయ రంగంలో 17 శాతం, పారిశ్రామిక రంగంలో 48 శాతం, సేవా రంగంలో 35 శాతం వృద్ధిని ఛత్తీస్‌గఢ్ నమోదు చేసిందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాల్లో.. గత 25 ఏళ్లలో గిరిజన సంక్షేమం కోసం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమంగా పనిచేసిందంటే, అది ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.
నక్సలిజం సమస్య అభివృద్ధికి సంబంధించినదనో లేదా అది శాంతిభద్రతల సమస్యే అనో చాలామంది మేధావులు ఒక అపోహను వ్యాప్తి చేశారని శ్రీ అమిత్ షా అన్నారు. నక్సలైట్ సమస్య మొదలైనప్పుడు దేశంలో బస్తర్ కన్నా బాగా వెనుకబడిన జిల్లాలు వందకు పైగా ఉండేనీ, మరి అక్కడ నక్సలిజం ఎందుకు పాతుకుపోలేదనీ ఆయన ప్రశ్నించారు. ఈ సమస్య శాంతిభద్రతలకో లేదా అభివృద్ధికో సంబంధించినది కాదనీ, ఇది భావజాల సంబంధిత అంశమనీ శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. మావోయిస్టు హింసకు గురికాకపోయి ఉంటే.. అపారమైన ఖనిజ సంపదతో సమృద్ధిగా ఉన్న బస్తర్ ప్రాంతం దేశంలో అత్యంత సంపన్న ప్రాంతంగా ఎదిగి ఉండేదన్నారు. తుపాకీ ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మావోయిస్టు సిద్ధాంతం నమ్ముతుందన్నారు. అమాయక, నిరక్షరాస్యులైన పేద గిరిజన యువత చేతుల్లో మావోయిస్టులు ఆయుధాలను పెట్టారనీ, తిరుపతి నుంచి పశుపతినాథ్ వరకు రెడ్ కారిడార్ నెలకొల్పాలన్న నినాదంతో దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు ఈ ప్రాంత అభివృద్ధిని వెనక్కి నెట్టేశారని శ్రీ అమిత్ షా విమర్శించారు. ఈ ప్రాంత అభివృద్ధిని మావోయిస్టులు అణచివేశారన్నారు. పదేళ్ల తర్వాత బస్తర్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన జిల్లాగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. తుపాకీ ద్వారానే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నది మావోయిస్టు భావజాలమనీ... కానీ చర్చలు, సంప్రదింపులు, సామరస్యంతో కూడిన పరిష్కారమే మన రాజ్యాంగ స్ఫూర్తి అనీ శ్రీ అమిత్ షా వ్యాఖ్యానించారు.
వామపక్ష ఉగ్రవాదానికి మద్దతు పలికిన వారు దశాబ్దాలుగా ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారని కేంద్ర హోం మంత్రి అన్నారు. నేడు ఇక్కడ పాఠశాలలు, ఆసుపత్రులను తిరిగి నిర్మించామనీ, రోడ్లు వేశామనీ, రైలు సదుపాయాన్నీ అందిస్తున్నామనీ ఆయన తెలిపారు. అలాగే ఏడు లక్షల హెక్టార్ల భూమికి సాగునీటిని అందించే పథకాన్ని కూడా భారత ప్రభుత్వం ఆమోదించబోతోందని చెప్పారు. వేలాది మంది గిరిజన పిల్లలు మృత్యువాత పడ్డారనీ, వారి జీవితాలు నాశనమయ్యాయనీ.. అయినప్పటికీ ప్రభుత్వం బుల్లెట్లు కురిపిస్తోందంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీ అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వంగానీ, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంగానీ ఎవరిపైనా కాల్పులు జరపాలని కోరుకోవడం లేదనీ, ఒకవేళ నక్సలైట్లంతా ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోతే వారికి ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతామని శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు. చేతిలో తుపాకులు పట్టుకుని ఉన్న యువతులు తక్షణమే లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ జీవితం వారి కోసం వేచిచూస్తోందన్నారు. ఇప్పటికే 90 శాతం ప్రాంతం నక్సలిజం నుంచి విముక్తి పొందిందనీ, 2026 మార్చి 31లోగా దేశంలో మావోయిస్టు సమస్యను సమూలంగా పెకిలించి, నిర్మూలిస్తామనీ శ్రీ అమిత్ షా స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2225568)
సందర్శకుల సూచీ సంఖ్య : : 28