ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత సంతతికి చెందిన ప్రముఖులతో ప్రధాని సంభాషణ

నాడు పోస్టు చేయడమైనది: 08 FEB 2026 2:48PM by PIB Hyderabad

మలేషియాలోని పలువురు ఎంపిక చేసిన భారత సంతతి ప్రముఖులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. వీరిలో మంత్రులు, సెనెటర్లు, పార్లమెంటు సభ్యులతోపాటు ఆజాద్ హింద్ ఫౌజ్ (భారత జాతీయ సేన - ఐఎన్ఏ)కు చెందిన వీర యోధులు కూడా ఉన్నారు. డిజిటల్ శాఖ మంత్రి తువాన్ గోబింద్ సింగ్ దేవ్, మానవ వనరుల శాఖ మంత్రి దాతో శ్రీ రమణన్ రామకృష్ణన్, ప్రధానమంత్రి విభాగంలో డిప్యూటీ మంత్రి తువాన్ ఎం. కులశేఖరన్, దేశ ఐక్యత డిప్యూటీ మంత్రి తువాన్ ఆర్. యునేశ్వరన్ తదితరులు భారత ప్రధానమంత్రితో భేటీ అయ్యారు.

మలేషియా పురోగతి, అభివృద్ధితోపాటు ఇరుదేశాల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడంలో భారత సంతతి ప్రజలు విశేష సేవలందించారని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్నీ, భారత్ - మలేషియా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిన కార్యక్రమాలను భారత సంతతి ప్రముఖులు ప్రశంసించారు. భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి చేపట్టిన వివిధ కార్యక్రమాలను కూడా వారు ప్రశంసించారు.

మలేషియాలోని భారతీయ సమాజం సంక్షేమం కోసం తీసుకున్న చర్యలపై భారత సంతతి ప్రముఖులు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఆ చర్యలు ఇవే: (i) మలేషియాలో మొదటి కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు భారత్ నిర్ణయం, (ii) మలయా విశ్వవిద్యాలయంలో తిరువళ్ళువర్ కేంద్రం ఏర్పాటు ప్రకటన, (iii) తిరువళ్లువర్ ఉపకారవేతనాలను ప్రారంభించడం, (iv) మలేషియాలో నివసిస్తున్న భారత సంతతి ప్రజలకు ఆరో తరం వరకు ఓసీఐ కార్డు సౌకర్యాన్ని పొడిగించడం, (v) మలేషియాలోని భారతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం ఇండియన్ స్కాలర్‌షిప్స్ ట్రస్ట్ ఫండ్ (ఐఎస్టీఎఫ్)కు 30 లక్షల మలేషియా రింగిట్‌లను (ఆర్ఎం) కేటాయించి పునరుద్ధరించడం.

ఆజాద్ హింద్ ఫౌజ్‌కు చెందిన బాలక్ సేన వీర యోధులు దాతో జయరాజ్ రాజా రావు, నేతాజీ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీ రాధాకృష్ణన్‌లతో కూడా ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఐఎన్‌ఏ, ఆ సేనల వీర యోధుల ధైర్యసాహసాలు, త్యాగాలు మరువలేనివని ఆయన కొనియాడారు. బలమైన, ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలన్న నేతాజీ ఆశయ సాధనకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2225180) సందర్శకుల సూచీ సంఖ్య : : 101
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam