సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
2026 గణతంత్ర దినోత్సవ కవాతులో సాంస్కృతిక శాఖ వందేమాతరం శకటానికి మొదటి బహుమతి
‘‘వందేమాతరం: భారతీయ శాశ్వత ప్రతిధ్వని’’ సాంస్కృతిక నృత్య ప్రదర్శనకు ప్రత్యేక బహుమతి
నాడు పోస్టు చేయడమైనది:
30 JAN 2026 2:51PM by PIB Hyderabad
గణతంత్ర దినోత్సవ కవాతు 2026లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రెండు అవార్డులను దక్కించుకుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల విభాగంలో ‘‘వందేమాతరం-150 ఏళ్ల ప్రయాణం’’ శీర్షికతో ప్రదర్శించిన శకటం ప్రథమ బహుమతిని గెలుచుకుంది. ‘‘వందేమాతరం: భారతీయ శాశ్వత ప్రతిధ్వని నాదం’’ అనే పేరుతో అందించిన అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనకు, దాని విశిష్ట కళాత్మకత, నేపథ్య ప్రతిభకు గానూ ప్రత్యేక బహుమతి లభించింది.

అవార్డు గెలుచుకున్న వందేమాతరం శకటం వందే మాతరం గీతం 150 సంవత్సరాల ప్రయాణాన్ని శక్తిమంతంగా ఆవిష్కరించింది. జాతీయ చైతన్యాన్ని మేల్కొలిపిన గీతంగా...ఆవిర్భావం నుంచి భారత స్వాతంత్ర్య ఉద్యమం, జాతీయ ఐక్యత, నాగరికతా స్పృహను పెంపొందించడం వరకూ పోషించిన శాశ్వత పాత్రను ఈ శకటం కళ్లకు కట్టినట్లు చూపించింది. ఉద్వేగభరిత దృశ్యాలు, ప్రతీకల ద్వారా ఈ శకటం దేశ సామూహిక జాతీయ గుర్తింపులో వందేమాతారానికి ఉన్న శాశ్వత ప్రాముఖ్యతను చాటిచెప్పింది.

ప్రత్యేక బహుమతి గెలుచుకున్న ‘‘వందేమాతరం-భారత శాశ్వత ప్రతిధ్వని’’ సాంస్కృతిక నృత్య ప్రదర్శనను పాటియాలాలోని ఉత్తర ప్రాంత సాంస్కృతిక కేంద్రం సహకారంతో సంగీత నాటక అకాడమీ రూపొందించింది. భారత స్వాతంత్య్ర ఉద్యమానికి గొంతుకగా నిలిచిన కవి బంకిం చంద్ర ఛటర్జీ రచనకు ఈ ప్రదర్శన నివాళి అర్పించింది. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన 2,500 మంది కళాకారులు పాల్గొని.. శాస్త్రీయ, జానపద, గిరిజన కళారూపాల ద్వారా సుసంపన్నమైన దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.

ఈ నృత్య రూపకల్పన భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక మూలాల నుంచి ప్రారంభమై, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, సాయుధ దళాల శౌర్యం, అంకితభావం వరకు విస్తరించిన ప్రయాణాన్ని ఆవిష్కరించింది. సంస్కృత మంత్రాలు, భావోద్వేగాలను రేకెత్తించే సంగీతం, చురుకైన విన్యాసాలతో కూడిన ఈ ప్రదర్శన.. వందే మాతరం గీతానికి సంబంధించిన సంపూర్ణ భావోద్వేగ, తాత్విక ప్రయాణాన్ని సజీవంగా ప్రతిబింబించింది. చివరిగా ఐక్యత, భక్తి, జాతీయ గర్వానికి ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకానికి శక్తమంతమైన నివాళి ఇవ్వడంతో ఈ ప్రదర్శన ముగిసింది.
ఈ సాంస్కృతిక ప్రదర్శనకు సంగీత నాటక్ అకాడమీ అధ్యక్షురాలు డాక్టర్ సంధ్యా పురేచా సృజనాత్మక దర్శకురాలిగా నాయకత్వం వహించగా, ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీ ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు. అదనపు సాహిత్యాన్ని శ్రీ సుభాష్ సెహగల్ అందించారు. జాతీయ అవార్డు విజేత, నటుడు శ్రీ అనుపమ్ ఖేర్ వాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే శ్రీ సంతోష్ నాయర్ నృత్య రూపకల్పన చేయగా, శ్రీమతి సంధ్యా రామన్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.
***
(రిలీజ్ ఐడి: 2221049)
సందర్శకుల సూచీ సంఖ్య : : 58