ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) రంగంలో పనిచేస్తున్న సీఈఓలు, నిపుణులతో ప్రధానమంత్రి సమావేశం


ఏఐ సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యానికి బలమైన మద్దతును ప్రకటించిన సీఈఓలు

ప్రపంచ వేదికపై ఏఐ రంగంలో భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రశంసించిన సీఈఓలు

పారదర్శకమైన, నిష్పాక్షికమైన సురక్షితమైన ఏఐ వ్యవస్థ ఏర్పాటు దిశగా పని చేయాలన్న ప్రధానమంత్రి

ఏఐ వినియోగంలో నైతిక విలువలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేసిన ప్రధానమంత్రి

యూపీఐ ద్వారా భారత్ తన సాంకేతిక పటిమను ప్రపంచానికి చాటినట్టే ఏఐ రంగంలో కూడా రాణించాలి: ప్రధానమంత్రి

మన సాంకేతికతతో సానుకూల ప్రభావం చూపడమే కాకుండా, ప్రపంచానికి కూడా స్ఫూర్తినివ్వాలి: ప్రధానమంత్రి
కీలక రంగాలలో స్వదేశీ సాంకేతికతను వినియోగించాలని ప్రధానమంత్రి పిలుపు

प्रविष्टि तिथि: 29 JAN 2026 5:51PM by PIB Hyderabad

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏఐ)  రంగ నిపుణులు,  సీఈఓలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని తమ లోక్ కళ్యాణ్ మార్గ్‌ నివాసంలోముచ్చటించారు. వచ్చే నెలలో (ఫిబ్రవరి 2026) జరగనున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

ఫిబ్రవరిలో జరగనున్న  ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు అనుగుణంగా జరిగిన ఈ సమావేశం, వ్యూహాత్మక సహకారాన్ని పెంపొందించడం, ఏఐ ఆవిష్కరణలను ప్రదర్శించడం, భారత ఏఐ మిషన్ లక్ష్యాలను వేగవంతం చేయడం లక్ష్యంగా జరిగింది.  ఈ చర్చల సందర్భంగా, ఏఐ సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యానికి సీఈఓలు తమ పూర్తి మద్దతును తెలిపారు. భారత్‌ను ప్రపంచ ఏఐ పటంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం వెచ్చిస్తున్న వనరులను, చేస్తున్న కృషిని కూడా వారు ఈ సందర్భంగా కొనియాడారు. 

ప్రధానమంత్రి మాట్లాడుతూ, అన్ని రంగాలలో నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, దానిని జాతీయ వృద్ధికి ఊతంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కీలక రంగాల్లో స్వదేశీ సాంకేతికతను ప్రోత్సహించడం ద్వారా విదేశీ ఆధారితాన్ని తగ్గించాలని ఆయన ఆకాంక్షించారు.  

రాబోయే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, వ్యక్తులు, సంస్థలన్నీ ఈ సదస్సును కొత్త అవకాశాలను అన్వేషించడానికి వృద్ధి పథంలో దూసుకుపోవడానికి ఒక వేదికగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.   యూపీఐ  ద్వారా భారతదేశం తన సాంకేతిక పటిమను ఇప్పటికే ప్రపంచానికి చాటి చెప్పిందని, అదే తరహా విజయగాథను ఏఐ రంగంలో కూడా పునరావృతం చేయవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

భారత్ కు గల ఉన్నత  స్థాయి, వైవిధ్యం ప్రజాస్వామ్య  విశిష్ట కలయిక కారణంగానే ప్రపంచం మన డిజిటల్ మౌలిక సదుపాయాలను విశ్వసిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ‘అందరికీ ఏఐ’ అనే తన దార్శనికతకు అనుగుణంగా, మన సాంకేతికతతో ప్రపంచంపై ప్రభావం చూపడమే కాకుండా, ఇతర దేశాలకు స్ఫూర్తినివ్వాలని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రపంచవ్యాప్త ఏఐ ప్రయత్నాలన్నింటికీ భారత్‌ను ఒక అత్యుత్తమ వేదికగా తీర్చిదిద్దాలని సీఈఓలు,  నిపుణులను కోరారు.  

డేటా భద్రత, సాంకేతికతను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పారదర్శకమైన, నిష్పాక్షికమైన, సురక్షితమైన ఏఐ  వ్యవస్థను నిర్మించడానికి మనం కృషి చేయాలని ఆయన సూచించారు.   ముఖ్యంగా, ఏఐ వినియోగంలో నైతిక విలువల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేస్తూనే, ఏఐ నైపుణ్యాభివృద్ధి ప్రతిభను పెంపొందించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారతీయ ఏఐ వ్యవస్థ మన దేశ విశిష్ట స్వభావాన్ని, విలువలను ప్రతిబింబించాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.  

ఈ ఉన్నత స్థాయి రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రముఖ ఏఐ సంస్థలైన విప్రో,, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, జోహో కార్పొరేషన్,, ఎల్టీఐ మైండ్‌ట్రీ, జియో ప్లాట్‌ఫారమ్స్, అదానీ కనెక్స్,, ఎక్స్‌ట్రా డేటా, నెట్‌వెబ్ టెక్నాలజీస్ సీఈఓలు పాల్గొన్నారు. ఐఐఐటి హైదరాబాద్, ఐఐటీమద్రాస్ ఐఐటీ బాంబేకి చెందిన నిపుణులు కూడా ఈ చర్చల్లో భాగస్వాములయ్యారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2220493) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Odia , Kannada , Malayalam