రాజ్యసభ సచివాలయం
రాజ్యసభ 270వ సమావేశాలు మొదలైన సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ ప్రారంభోపన్యాసం పాఠం
प्रविष्टि तिथि:
29 JAN 2026 12:50PM by PIB Hyderabad
రాజ్యసభ 270వ సమావేశాలు మొదలైన సందర్భంగా ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ తన ప్రారంభోపన్యాసంలో ఇలా అన్నారు:
‘‘గౌరవ సభ్యులారా, రాజ్యసభ 270వ సమావేశాలు మొదలవుతున్న సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు. ఇవి పార్లమెంట్ బడ్జెటు సమావేశాలు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందడంతో పాటు మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే స్థితిలో ఉండటం నిజంగా సంతోషం కలిగిస్తోంది. ఈ సమావేశాలు మొదలవుతున్న తరుణంలో, మనం ఒక సంకల్పాన్ని చెప్పుకొందాం, రండి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ప్రభావమూ, భారత్ స్థాయీ అంతకంతకూ పెరుగుతున్న వేళ దేశానికి ఆర్థిక దిశానిర్దేశం చేయడంలో చట్టసభల సభ్యులుగా మనం పోషించవలసిన పాత్ర ఎంతో కీలకం.
పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగం మనకు మార్గదర్శకత్వం వహించింది.. మన జాతీయ ప్రాధాన్యాలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో, ఈ సభ మౌలిక చట్టపరమైన కర్తవ్యాల్నీ, ప్రధానంగా చర్చోపచర్చల పరమైన కర్తవ్యాల్నీ నిర్వహిస్తూ తన వంతు తోడ్పాటును అందిస్తుంది. 30 సార్లు సమావేశమై, మనం 2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెటునూ, ప్రభుత్వ శాసన సంబంధిత ప్రతిపాదనలనూ క్షుణ్నంగా పరిశీలిద్దాం. దీనికి తోడు, మంత్రిత్వ శాఖలు, విభాగాల గ్రాంట్లకు సంబంధించిన డిమాండ్లను విభాగాల వారీ పార్లమెంటరీ స్థాయీ సంఘాలు విరామ కాలంలో కూలంకషంగా పరిశీలిస్తాయి. అందువల్ల, సభతో పాటు కమిటీల్లో కూడా చర్చలకు సార్థక తోడ్పాటును అందించాల్సిందిగా గౌరవ సభాసభ్యులను నేను కోరుతున్నాను.
ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెటు ప్రతిపాదనలపై లోతైన అవగాహనతో కూడిన చర్చోపచర్చలు జరపడంతో పాటు అనేక ముఖ్య బిల్లులు కూడా మన ముందుకు వస్తాయి. వాటిపై సభా కార్యకలాపాల నిర్వహణకు చాలా సమయం పడుతుంది. శాసన సంబంధిత వివిధ పనులు అంటేనే.. మనం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే క్రమంలో నిర్ణీత సభా కార్యకలాపాల కాలంలోని ప్రతి ఒక్క నిమిషాన్నీ సద్వినియోగపరుచుకోవాల్సిన పవిత్రమైన బాధ్యత మన మీద ఉందన్న అంశాన్ని గ్రహించి మసలుకోవడం.
గౌరవ సభ్యులు పటిష్ఠ పార్లమెంటరీ పర్యవేక్షణతో పాటు, సభలో అనుమతించిన కార్యకలాపాలు సార్థకంగా పూర్తి అయ్యేటట్లుగా చూడడానికీ, అత్యున్నత స్థాయి పార్లమెంటరీ మర్యాదను కాపాడడానికీ తోడ్పడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భిన్నమైన ఆలోచనలు, ఉత్సాహవంతమైన వాదనల ద్వారానే మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అభిప్రాయాల్ని గౌరవపూర్వకంగా తెలియజేసుకోవడం, ఫలప్రదమైన చర్చలను చేపట్టడం మన చట్టసభల చర్చలకు ప్రమాణాల్ని ఏర్పరచాలి. మర్యాద, క్రమశిక్షణ, హుందాతనంతో కూడిన నడవడికలతో పరిపూర్ణ సమావేశాల నిర్వహణకు కట్టుబడి ఉంటామని మనమంతా సంకల్పం చెప్పుకొందాం.
జాతి పిత మహాత్మాగాంధీ గారు కలలుగన్న ప్రజాస్వామ్యం, క్రమశిక్షణ, జ్ఞానోదయం అనే విలువలను పరిరక్షించాల్సిందిగా కూడా గౌరవ సభ్యులను నేను కోరుతున్నాను. ‘‘క్రమశిక్షణతోనూ, జ్ఞానోదయంతోనూ పరిఢవిల్లే పరిపూర్ణ ప్రజాస్వామ్యమే ప్రపంచంలో అత్యంత శ్రేష్ఠమైన వ్యవస్థ’’ అని చెప్పిన మహాత్ముని మాటలను నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. సభలో మనం నడుచుకునే తీరు ఈ క్రమశిక్షణనీ, ఈ జ్ఞానోదయాన్నీ ప్రతిబింబించాలి.
సౌభాగ్యవంతమైన, స్వయంసమృద్ధమైన, వికసిత్ భారత్ సాధన దిశగా అడుగులు వేసేటట్లుగా ఈ సమావేశాల్ని తీర్చిదిద్దడంలో పార్లమెంటరీ పార్టీలన్నింటికీ చెందిన నేతలూ, సభ్యులూ వారి పూర్తి సహకారాన్ని అందిస్తారని నేను ఆశిస్తున్నాను. రండి, మనమందరం కలిసి ఈ బడ్జెట్ సమావేశాలను పార్లమెంటరీ ప్రజాస్వామ్య అత్యున్నత ప్రమాణాలకు అద్దం పట్టేటట్లు ఫలప్రదం చేద్దాం’’.
***
(रिलीज़ आईडी: 2220318)
आगंतुक पटल : 41