పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్‌గా భారత్ వృద్ధిని ప్రదర్శించనున్న వింగ్స్ ఇండియా 2026


భారత విమానయాన వృద్ధిని, ప్రపంచ విమానయాన రంగ భవిష్యత్తును ప్రదర్శించనున్న ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం

प्रविष्टि तिथि: 25 JAN 2026 2:42PM by PIB Hyderabad

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత పౌర విమానయాన రంగ వృద్ధిని ప్రదర్శించేందుకు 2026 జనవరి 28–31 వరకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం వింగ్స్ ఇండియా 2026ను నిర్వహిస్తున్నారు.

నాలుగు రోజుల పాటు జరిగే ఈ మెగా ఈవెంట్‌ను దేశవిదేశాల నుంచి వచ్చిన సీనియర్ ప్రముఖుల సమక్షంలో గౌరవనీయ పౌర విమానయాన మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ ప్రారంభం భారత కనెక్టివిటీ, తయారీ, సేవలు, ఆవిష్కరణలు, సుస్థిరతల కేంద్రంగా భారత విమానయాన రంగ పరివర్తనను ప్రదర్శించే ఒక ప్రపంచ విమానయాన రంగ కీలక సమావేశానికి నాంది పలుకుతుంది.

"భారత విమానయాన రంగం: భవిష్యత్తును సుగమం చేయడం - డిజైన్ నుంచి విస్తరణ దాకా... తయారీ నుంచి నిర్వహణ దాకా... సమగ్రత నుంచి ఆవిష్కరణ దాకా... భద్రత నుంచి సుస్థిరత దాకా" అనే ఇతివృత్తంతో సాగే ఈ వింగ్స్ ఇండియా 2026 కార్యక్రమం... భారత విమానయాన రంగం ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ అభివృద్ధి, ప్రపంచ ఏకీకరణకు శక్తిమంతమైన చోదకశక్తిగా ఎలా అభివృద్ధి చెందిందో హైలైట్ చేస్తుంది.

ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన భారత విమానయాన రంగ వృద్ధి

గత దశాబ్దంలో భారత పౌర విమానయాన రంగంలో సాధ్యమైన అపూర్వ విస్తరణ:

·         ప్రయాణికుల రద్దీ అనేక రెట్లు పెరిగిన క్రమంలో భారత్ ప్రపంచంలోనే అగ్ర విమానయాన మార్కెట్లలో ఒకటిగా నిలిచింది.

·         భారతీయ విమానయాన సంస్థలు వందలాది కొత్త విమానాలను చేర్చుకున్నాయి. రికార్డు స్థాయిలో విమాన ఆర్డర్లు భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద భవిష్యత్ విమాన మార్కెట్లలో ఒకటిగా నిలిపాయి.

·         ఉడాన్ వంటి ప్రధాన కార్యక్రమాలతో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, ఆధునికీకరించిన టెర్మినల్స్, మెరుగైన ప్రాంతీయ అనుసంధానంతో విమానాశ్రయ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరించాయి.

·         విమాన నిర్వహణ, మరమ్మత్తు, ఓవర్‌హాల్ (ఎంఆర్వో), పైలట్ శిక్షణ, ఏరోస్పేస్ తయారీ, కార్గో లాజిస్టిక్స్, అధునాతన వైమానిక రవాణాలకు బలమైన కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోంది.

·         సుస్థిర విమానయాన ఇంధనం (ఎస్ఏఎఫ్), హరిత విమానాశ్రయాలు, డిజిటల్ ఎయిర్ నావిగేషన్ సహా సుస్థిరమైన విమానయానం దిశగా కీలక ప్రయత్నాలు విమానయాన రంగ భవిష్యత్తును పునర్నిర్మిస్తున్నాయి.

వింగ్స్ ఇండియా 2026 ఈ అసాధారణ వృద్ధి ప్రయాణాన్ని వివరిస్తూ... ప్రపంచ విమానయాన రంగంలో తిరుగులేని శక్తిగా అవతరించాలనే భారత్ ఆశయాన్ని ప్రదర్శిస్తుంది.

విమానయాన రంగ శ్రేష్ఠతకు ప్రపంచస్థాయి వేదిక

వింగ్స్ ఇండియా 2026 లో ప్రదర్శించునవి:

• విస్తృతమైన, ప్రపంచ స్థాయి అంతర్జాతీయ ప్రదర్శన

• నిలిపి ఉంచిన విమానాల ప్రదర్శన, ఏరోబాటిక్ ఫ్లయింగ్ షోలు

• ప్రపంచ విమానయాన రంగ ఉన్నత స్థాయి సమావేశం

• మంత్రివర్గ ప్లీనరీ, ప్రపంచ సీఈవోల సదస్సు

• సీఈవో రౌండ్‌టేబుల్స్... బీ2బా, బీ2జీ సమావేశాలు

• విమానయాన రంగ ఉద్యోగ మేళా, విద్యార్థుల ఆవిష్కరణల పోటీ

• ప్రతిష్టాత్మక పురస్కారాల ప్రదానోత్సవం

• భారత వారసత్వాన్ని ప్రతిబింబించే ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ కార్యక్రమం విధాన నిర్ణేతలు, ప్రపంచ సీఈవోలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, ఓఈఎమ్‌లు, ఎంఆర్వోలు, అద్దెదారులు, సాంకేతిక ప్రదాతలు, శిక్షణ సంస్థలు, అంకురసంస్థలను ఒకచోట చేర్చడం ద్వారా దీనిని ప్రపంచంలోని అత్యంత సమగ్రమైన విమానయాన వేదికల్లో ఒకటిగా మారుస్తుంది. 

బలమైన ప్రపంచ, దేశీయ భాగస్వామ్యం

 వింగ్స్ ఇండియా 2026 ఆతిథ్యం ఇస్తున్నవి: 

·         20 దేశాల నుంచి (కంబోడియా, ఘనా, రష్యా, సీషెల్స్, ట్రినిడాడ్ - టొబాగో, సింగపూర్, అల్జీరియా, డొమినికన్ రిపబ్లిక్, ఇరాన్, మాల్దీవులు, మంగోలియా, మొజాంబిక్, ఒమన్, ఖతార్, యూరోపియన్ యూనియన్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూఎస్ఏ) మంత్రిత్వ స్థాయి, అధికారిక ప్రతినిధులు

·         ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రదర్శనలు, సమావేశాలకు హాజరు కానున్న భారత రాష్ట్రాల మంత్రులు, అధికారులు.

·         జీఎమ్ఆర్, అదానీ, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, ఎతిహాద్ ఎయిర్‌వేస్, థాయ్ ఎయిర్‌వేస్, ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్‌లతో పాటు ఎయిర్‌బస్, బోయింగ్, ఎంబ్రేర్, హెచ్ఏఎల్, డస్సాల్ట్, బెల్ టెక్స్ట్రాన్, ఏటీఆర్, పిలాటస్, డి హావిలాండ్, ఆర్టీఎక్స్, రోల్స్-రాయిస్, యునైటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్, సీఎస్ఐఆర్-ఎన్ఏఎల్ వంటి ప్రముఖ ప్రపంచస్థాయి విమానయాన రంగ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ధ్రువీకరించాయి.

ప్రపంచ విమానయాన రంగంలో పెరుగుతున్న భారత వ్యూహాత్మక ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తూ... అగ్రశ్రేణి విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు, ఓఈఎమ్‌ల గ్లోబల్ సీఈవోలు హాజరవుతారని భావిస్తున్నారు.

అద్భుతమైన వైమానిక ప్రదర్శనలు, విమానాల ప్రదర్శనలు

ఈ కార్యక్రమంలో ఇవి ఉంటాయి:

• విస్తృత శ్రేణి విమానాల ప్రదర్శన, ఫ్లయింగ్ ప్రదర్శనలు

• భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం, మార్క్ జెఫరీస్ ఏరోబాటిక్ బృందంచే ఏరోబాటిక్ ప్రదర్శనలు

• విమానయాన నైపుణ్యం, ఆవిష్కరణలు, ప్రజా భాగస్వామ్యాల వేడుక

నైపుణ్యం గల నాయకత్వం, భవిష్యత్తును రూపొందించే చర్చలు 

ఈ అంతర్జాతీయ సమావేశంలో 13 థీమాటిక్ సెషన్స్, మంత్రివర్గ ప్లీనరీ, గ్లోబల్ సీఈవోల సదస్సులు ఉంటాయి. వీటిలో ఇవి కవర్ చేస్తారు:

• విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాలు

• విమానయాన సంస్థలు, విమానాల లీజింగ్

• హెలికాప్టర్లు, వాణిజ్య విమానాలు

• ఎంఆర్వో, విడి భాగాల తయారీ

• ఎయిర్ కార్గో, లాజిస్టిక్స్

• సుస్థిరమైన విమానయాన ఇంధనం (ఎస్ఏఎఫ్)

• అధునాతన వైమానిక రవాణా, డ్రోన్లు

• విమానయాన శిక్షణ, నైపుణ్యం, విమానయానంలో మహిళలు

వ్యాపారం, ప్రతిభ, ఆవిష్కరణల పోటీ

 వింగ్స్ ఇండియా 2026లో ఇవి కూడా భాగంగా ఉంటాయి: 

• ప్రత్యేక ప్రదర్శన మందిరాలు, చాలెట్లు

• నిర్మాణాత్మక బీ2బా, బీ2జీ సమావేశాలు

• నైపుణ్యం కలిగిన యువతతో పరిశ్రమను అనుసంధానించే విమానయాన రంగ ఉద్యోగ మేళా

• విమానయాన రంగంలో భవిష్యత్ నాయకులను పెంపొందించే విద్యార్థుల ఆవిష్కరణల పోటీ

కీలక ప్రకటనలు, అవగాహన ఒప్పందాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలతో పాటు, పౌర విమానయాన రంగంలో అత్యుత్తమ ప్రతిభను గుర్తిస్తూ 30కి పైగా పురస్కారాలను అందించే ప్రతిష్టాత్మక పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

వ్యాపారం, పాలసీలకు మించి... వింగ్స్ ఇండియా 2026 విమానయానాన్ని ప్రజా-కేంద్రిత పరిశ్రమగా ప్రదర్శిస్తుంది. విమానయాన రంగ ఉద్యోగ మేళా యువ నిపుణులు, నైపుణ్యం కలిగిన ప్రతిభతో పరిశ్రమ ప్రముఖులను అనుసంధానిస్తుంది. దేశంలోని అగ్రశ్రేణి సంస్థల విద్యార్థుల కోసం ఏరోస్పేస్, భవిష్యత్తు సాంకేతికత చుట్టూ కేంద్రీకృతమై ఉన్న సివిల్ ఏవియేషన్ ఇన్నోవేషన్ ఛాలెంజ్... తదుపరి తరం విమానయాన రంగ నిపుణులను, సమస్యలను పరిష్కారించే వారిని గుర్తించి, ప్రోత్సహిస్తుంది.

టార్గెట్ పార్టిసిపేషన్

150 మందికి పైగా ప్రదర్శనకారులు, 7,500 మంది వ్యాపారరంగ సందర్శకులు, లక్ష మంది సాధారణ సందర్శకులు, 200 మందికి పైగా విదేశీ ప్రతినిధులు, 500కి పైగా బీ2బీ, బీ2జీ సమావేశాలు, 31 కి పైగా విమానాల ప్రదర్శనలతో... ఈ వింగ్స్ ఇండియా 2026 భారతదేశానికే కాకుండా ప్రపంచ విమానయాన రంగంలోనే ఒక కీలక కార్యక్రమంగా నిలుస్తుంది. 

ప్రపంచ విమానయాన భవిష్యత్తు కోసం వ్యూహాత్మక ప్రణాళిక

అసమానమైన స్థాయి, ప్రపంచ భాగస్వామ్యం, వ్యూహాత్మక దృష్టితో ఈ వింగ్స్ ఇండియా 2026 ప్రపంచ విమానయాన సమాజం కోసం ఒక నిర్ణయాత్మక సందర్భంగా నిలుస్తుంది.

తయారీ, నిర్వహణ, కనెక్టివిటీ, స్థిరత్వం, డిజిటల్ ఆవిష్కరణల విస్తరణతో ప్రపంచ విమానయాన కేంద్రంగా మారుతున్న భారత అద్భుతమైన విమానయాన వృద్ధి కథను వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పౌర విమానయాన రంగ భవిష్యత్తు పథాన్నీ రూపొందిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2218535) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी