రైల్వే మంత్రిత్వ శాఖ
రైళ్లపై లారీల రవాణా: భారతీయ రైల్వే ప్రత్యేక సరకు రవాణా కారిడార్ నేతృత్వంలో రవాణా రంగంలో ఒక వ్యూహాత్మక మార్పు
రోడ్డు రవాణా, రైల్వే రవాణాలోని సామర్థ్యం కలయికతో బహుళ నమూనా అనుసంధానం ద్వారా
మెరుగపడనున్న సుదూర సరుకు రవాణా
తద్వారా తగ్గనున్న కర్బన ఉద్గారాలు, ట్రాఫిక్ రద్దీ, రవాణా ఖర్చులు
प्रविष्टि तिथि:
22 JAN 2026 5:46PM by PIB Hyderabad
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందటంతో పాటు వినియోగం వైవిధ్యభరితం అవుతున్న కొద్దీ సరకు రవాణా విపరీతంగా పెరిగింది. ఇది రహదారులపై ఒత్తిడిని పెంచడంతో పాటు ఇంధన వినియోగం, వాతావరణంలోని గాలి నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు దూరదృష్టితో కూడిన 'ప్రత్యేక సరకు రవాణా కారిడార్ (డీఎఫ్‌సీ)' ద్వారా భారతీయ రైల్వే.. లారీలను రైళ్లపై రవాణా చేసే (టీఓటీ- ట్రక్స్ ఆన్ ట్రైన్స్) సేవలను ప్రవేశపెట్టింది. భారతీయ రైల్వే దీర్ఘకాలిక సరకు రవాణా పరివర్తన వ్యూహంలో భాగంగా రూపొందించిన డీఎఫ్‌సీ నెట్‌వర్క్.. సరికొత్త తరానికి చెందిన బహుళ నమూనా రవాణాకు వీలు కల్పించే ప్రధాన విభాగంగా నిలుస్తోంది.
భారతీయ రైల్వేకు చెందిన ప్రత్యేక సరకు రవాణా కారిడార్‌లో భాగంగా చేపట్టిన విద్యుదీకరణతో కూడిన రైలు మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని, పర్యావరణ ప్రయోజనాలను రోడ్డు రవాణాలోని వెసులుబాటుతో ఈ టీఓటీ అనుసంధానిస్తుంది. ప్రత్యేకంగా మార్పులు చేసిన ఫ్లాట్ వ్యాగన్ల ద్వారా లోడ్ చేసిన లారీలను డీఎఫ్‌సీ మార్గాల్లో రవాణా చేయొచ్చు. సుదీర్ఘమైన, రద్దీగా ఉండే రహదారి ప్రయాణాలను నివారిస్తూ లారీలు.. ప్రధాన ప్రయాణాన్ని రైలు మార్గం ద్వారా పూర్తి చేస్తాయి. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత అవి కేవలం మొదటి, చివరి ప్రయాణాలను మాత్రమే రోడ్డు మార్గాల ద్వారా పూర్తి చేస్తాయి.

ఆర్థిక ప్రయోజనాలతో పాటు విశ్వసనీయత:
ప్రస్తుతం టీఓటీ సేవలు పశ్చిమ డీఎఫ్‌సీలో న్యూ రేవారీ, న్యూ పాలన్‌పూర్ మధ్య అందుబాటులోకి వచ్చాయి. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందే కొద్దీ ఈ సౌకర్యాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరించనున్నారు. న్యూ పాలన్‌పూర్–న్యూ రేవారీ కారిడార్‌లో సుమారు 636 కిలోమీటర్ల మేర టీఓటీ సేవలు అందుతున్నాయి. రోడ్డు మార్గంలో దాదాపు 30 గంటలు పట్టే ప్రయాణ సమయం ఈ సౌకర్యం ద్వారా సుమారు 12 గంటలకు తగ్గుతుంది. ఈ సమీకృత రోడ్డు-రైలు సేవల వల్ల రవాణా విశ్వసనీయతను పెరగటంతో పాటు లారీలు తిరిగి వెళ్లే సమయం, మొత్తం రవాణా ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా రహదారి రవాణాలో సహజంగా ఎదురయ్యే అనిశ్చితుల నుంచి సుదూర సరకు రవాణాకు ఉపశమనం కలుగుతుంది.
సరళమైన, పోటీతత్వంతో కూడిన ధరల విధానం టీఓటీకి ఉన్న ప్రధాన బలం. బరువు ఆధారంగా ఉన్న పారదర్శకమైన స్లాబ్‌ల ద్వారా సరకు రవాణా ఛార్జీలను నిర్ణయించారు. 25 టన్నుల వరకు ఉన్న లారీలకు ఒక వ్యాగన్‌కు రూ. 25,543.. 25-45 టన్నులకు రూ. 29,191.. 45-58 టన్నులకు రూ. 32,000లను వసూలు చేస్తున్నారు. ఖాళీ ట్రక్కులను కేవలం ఒక వ్యాగన్‌కు రూ. 21,894 ఖర్చుతో రవాణా చేస్తున్నారు. పాల రంగానికి మరింత మద్దతునిచ్చేందుకు మిల్క్ ట్యాంకర్లపై ఎటువంటి జీఎస్టీని విధించటం లేదు. దీనివల్ల త్వరగా పాడైపోయే సరకులకు ఈ సేవ ఎంతో ఆకర్షణీయంగా మారింది. నిర్వహణ సౌలభ్యాన్ని పెంచేందుకు 2024 జనవరి నుంచి 'ఓపెన్ ఇండెంట్ బుకింగ్' అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది ఎప్పటికప్పుడు మారే రవాణా అవసరాలకు అనుగుణంగా రవాణాను ప్రణాళిక చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు కార్యాచరణ గణాంకాలు ఈ సేవల పట్ల పెరుగుతున్న ఆదరణను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్-డిసెంబర్) టీఓటీ ద్వారా 545 రేక్‌లను రవాణా చేశారు. దీని ద్వారా 3 లక్షల టన్నులకు పైగా సరకును రవాణా చేయడమే కాకుండా రూ. 36.95 కోట్ల ఆదాయాన్ని భారతీయ రైల్వే ఆర్జించింది. టీఓటీ కేవలం ప్రయోగాత్మక దశలో ఉన్న ఆవిష్కరణ మాత్రమే కాదని.. వాణిజ్యపరంగా లాభదాయకమైన, విస్తరించదగిన రవాణా సేవగా అవతరించిందన్న విషయాన్ని ఈ భారీ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
ప్రాంతాల వారీ పనితీరును నిశితంగా పరిశీలిస్తే ఈ సేవల బలం స్పష్టంగా తెలుస్తోంది. న్యూపాలన్పూర్ ఒక్కటే 273 రేక్‌లతో 2 లక్షల టన్నులకు పైగా సరుకును రవాణా చేయటం ద్వారా రూ. 20.18 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది పశ్చిమ భారతదేశంలోని సరకు రవాణా క్లస్టర్ల నుంచి ముఖ్యంగా డైరీ, ఎఫ్ఎంసీజీ రంగాల నుంచి లభిస్తున్న బలమైన ఆదరణను తెలియజేస్తోంది. న్యూరేవారీ కూడా దాదాపు సమానమైన పనితీరు కనబరిచింది. ఇది 272 రేక్‌ల ద్వారా సుమారు 0.1004 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి రూ. 16.76 కోట్ల ఆదాయాన్ని పొందింది. నిరంతర బహుళ రవాణా మార్గాలను అనుసంధానించటంతో పాటు కారిడార్ ఆధారిత రవాణా సామర్థ్యాన్ని డీఎఫ్‌సీలోని వ్యూహాత్మక ప్రాంతాలు ఏ విధంగా పెంచుతాయన్న విషయాన్ని ఈ రెండు టెర్మినళ్లు తెలియజేస్తున్నాయి. ఈ సేవకు పశ్చిమ భారత్‌లోని సరకు రవాణా కేంద్రాల నుంచి ముఖ్యంగా పాలు, డైరీ ఉత్పత్తులకు సంబంధించిన అముల్ (గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్) వంటి ప్రధాన డైరీతో పాటు ఇతర సరకు రవాణా సంస్థల నుంచి బలమైన మద్దతు లభించింది. జూన్ 2023లో జీసీఎమ్‌ఎమ్‌ఎఫ్‌తో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా టీఓటీ సేవలను పునఃప్రారంభించడం వల్ల పరిశ్రమలో నమ్మకం పెరిగింది. ఇది డైరీ రంగానికి సంబంధించిన సరకు రవాణా క్రమబద్ధంగా పెరిగేందుకు దోహదపడింది.

రవాణా పద్ధతిలో మార్గదర్శకత్వం-
పశ్చిమ డీఎఫ్‌సీకి సంబంధించిన టీఓటీ సేవల ద్వారా సాధించిన అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ఫలితాలలో ఒకటి ఏంటంటే.. సుదూర సరకు రవాణాను రోడ్డు మార్గం నుంచి రైలు మార్గానికి విజయవంతంగా మళ్లించడం. లారీల ప్రయాణంలో అత్యంత సుదీర్ఘమైన, అధిక ఇంధనం ఖర్చయ్యే విభాగాన్ని విద్యుదీకరణతో ఉన్న అధిక సామర్థ్యం గల ప్రత్యేక సరకు రవాణా కారిడార్లకు బదిలీ చేయడం ద్వారా రహదారులపై రద్దీ, దిగుమతి చేసుకునే శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు జాతీయ సరకు రవాణా ఖర్చుల విషయంలో మరింత మెరుగుదలను సాధించేందుకు టీఓటీ విధానం సహాయపడుతుంది. డజన్ల కొద్దీ సుదూర ప్రాంతాలకు వెళ్లే ట్రక్కుల స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యాన్ని ఒక్క సరకు రవాణా రైలు కలిగి ఉంటుంది. దీని ఫలితంగా సులభతరమైన ట్రాఫిక్ కదలిక, తక్కువ ప్రమాదాల ముప్పు, డీజిల్ వినియోగం తగ్గుదల, రోడ్డు మౌలిక సదుపాయాలు పాడవటం తగ్గడం వంటి ప్రయోజనాలు చేకూరుతాయి.
రవాణాదారులకు కలిగే మరో ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం ఏంటంటే.. రహదారులపై ఉండే టోల్ ఖర్చులు తప్పడం. జాతీయ రహదారులపై సుదూరంగా నడిచే ట్రక్కులు టోల్ ప్లాజాల వద్ద భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది సరకు రవాణా ఖర్చులను పెంచడమే కాకుండా ప్రయాణ సమయంలో అనిశ్చితిని పెంచుతుంది. సుదూర ప్రయాణాన్ని రైలు మార్గానికి మళ్లించడం ద్వారా టీఓటీ విధానం ఈ పునరావృత టోల్ ఖర్చులను పూర్తిగా నివారించేలా చేస్తుంది. ఇది ముఖ్యంగా తరచుగా సుదూర ప్రయాణాలు చేసే వాహనాల ఖర్చుల అంచనా, లాభాలను మెరుగుపరుస్తుంది.

సురక్షితమైన హరిత రవాణా
డీఎఫ్‌సీ నెట్‌వర్క్ మొత్తం పూర్తిగా విద్యుదీకరించారు. దీనివల్ల పర్యావరణ ప్రయోజనాలు మరింత బలోపేతం అయ్యాయి. లారీలను రోడ్డు నుంచి రైలు మార్గానికి మార్చడం వల్ల కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ధూళి కణాల ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. భారతదేశ విద్యుత్ ఉత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వాటా క్రమంగా పెరుగుతున్నందున టీఓటీ నమూనాలో రైలు ఆధారిత సరకు రవాణాకు సంబంధించిన కార్బన్ ఫుట్‌ప్రింట్ భవిష్యత్తులో మరింత తగ్గుతుందని భావిస్తున్నారు. కేవలం వాహన ఉద్గారాలనే కాకుండా తరచుగా విస్మరణకు గురయ్యే రోడ్డు ధూళి కాలుష్య సమస్యను కూడా టీఓటీ పరిష్కరిస్తుంది. భారీ ట్రక్కుల రాకపోకలు రహదారులపై ధూళి పెరగడానికి ప్రధాన కారణంగా ఉన్నాయి. ఇది ప్రజారోగ్యం, వ్యవసాయం, రహదారి పరిసరాల్లోని వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ట్రక్కుల రాకపోకలను రైలు కారిడార్లకు మళ్లించడం ద్వారా ప్రధాన రవాణా మార్గాల్లో నివసించే ప్రజలకు అందుబాటులో ఉండే గాలి నాణ్యత పెరుగుతుంది. సుమారు 636 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న పాలన్‌పూర్–రేవారీ కారిడార్‌లో ఈ తరహా స్పష్టమైన ప్రభావం కనిపిస్తోంది. ఈ మార్గంలో టీఓటీ సేవల వల్ల దాదాపు 48,875 ట్రక్కుల ప్రధాన ప్రయాణం రైళ్ల ఆధారంగా సాగుతోంది. ఇప్పుడవి కేవలం మొదటి, చివరి మైలు డెలివరీ కోసం మాత్రమే రోడ్డుపై నడుస్తున్నాయి. ఈ మార్పు వల్ల సుమారు 88,81,285 లీటర్ల డీజిల్ ఆదా అవ్వడమే కాకుండా సుమారు 2,30,91,343 కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను నిరోధించినట్లు అంచనా ఉంది. కారిడార్ ఆధారిత రవాణా విధాన మార్పు.. పర్యావరణ, ఇంధన రంగాల్లో ఏ స్థాయిలో కొలవదగిన ప్రయోజనాలను అందిస్తుందో ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యం ఈ టీఓటీ సౌకర్యం ద్వారా కలిగే మరొక కీలకమైన ప్రయోజనం. భారత్‌లోని అనేక ప్రాంతాలలో రహదారి రవాణా అనేది పొగమంచు, భారీ వర్షపాతం, విపరీతమైన వేడి, తక్కువ దృశ్యమానత వంటి పరిస్థితుల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతోంది. ముఖ్యంగా శీతాకాలంలో ఉత్తర భారత దేశంలో దట్టమైన పొగమంచు కారణంగా రహదారి రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుంది. అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ, నియంత్రిత పద్ధతిలో రైళ్లను అనుమతించటం వంటి వాటిని కలిగి ఉన్న ప్రత్యేక సరకు రవాణా కారిడార్లలో రైల్వే కార్యకలాపాలకు ఇటువంటి అవాంతరాలు ఉండే అవకాశం చాలా తక్కువ. ప్రయాణంలోని అత్యంత సుదీర్ఘ భాగాన్ని రైలు మార్గానికి మళ్లించడం ద్వారా టీఓటీ సౌకర్యం సమయపాలన, విశ్వసనీయతను పెంచుతుంది. ఇది సవాళ్లతో కూడిన వాతావరణ పరిస్థితుల్లో కూడా సరఫరా వ్యవస్థ నిరంతరాయంగా కార్యకలాపాలు నిర్వహించేలా చూసుకుంటుంది.
సుదూర ప్రాంతాలకు లారీలను నడపడం ఎంతో శ్రమతో కూడుకున్నది. ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. నిరంతరాయంగా ఎక్కువ గంటలు నడిపే అవసరాన్ని తగ్గించడం ద్వారా టీఓటీ పద్ధతి డ్రైవర్ల అలసటను తగ్గిస్తుంది.. పని పరిస్థితులను మెరుగుపరుస్తుంది.. తక్కువ ప్రమాదాలతో కూడిన సురక్షితమైన రహదారుల నిర్మాణానికి దోహదపడుతుంది. రహదారులపై ట్రాఫిక్ తగ్గడం వల్ల మౌలిక సదుపాయాలు పాడవటం తగ్గడమే కాకుండా రోడ్ల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి అయ్యే వ్యయం కూడా తగ్గుతుంది.

రైల్వే ఆధారిత సరకు రవాణా విషయంలో కొత్త ఆదాయ మార్గం
వాణిజ్య దృక్పథంతో చూస్తే టీఓటీ సౌకర్యం రైలు ఆధారిత సరకు రవాణాలో ఒక కొత్త, స్థిరమైన ఆదాయ వనరుగా అవతరించింది. ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఇది 1,955 కంటే ఎక్కువ ట్రిప్పులను పూర్తి చేసింది. ఒక మిలియన్ టన్నుల కంటే ఎక్కువ సరకును రవాణా చేసింది. మొత్తం రూ. 131 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. డైరీ, వాహనాలు, నిత్యావసర వస్తువులు (ఎఫ్ఎంసీజీ), ఆహార శుద్ధి రంగాల నుండి లభిస్తున్న గొప్ప ఆదరణ.. ఈ విధానంపై పరిశ్రమకు పెరుగుతున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. జూన్ 2023లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌తో (జీసీఎంఎంఎఫ్) కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ద్వారా టీఓటీని పునఃప్రారంభించటం వల్ల ఈ సౌకర్యం పట్ల పెద్ద వ్యవస్థీకృత షిప్పింగ్ సంస్థలకు ఉన్న విశ్వసనీయత మరింత బలపడింది.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని లారీలను మరింత సమర్థవంతంగా, సురక్షితంగా, ఎక్కువ బరువుతో తీసుకెళ్లడానికి వీలుగా రూపొందించిన 'ఫ్లాట్ మల్టీపర్ఫస్ ప్లాట్‌ఫామ్' (ఎఫ్ఎంపీ) కింద కొత్త తరం వ్యాగన్‌లను తయారుచేయటం ద్వారా ఈ సేవల విస్తరణలను మరింత బలోపేతం చేస్తున్నారు. ఈ వ్యాగన్లు లోడింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా వివిధ రకాల ట్రక్కులకు అనుగుణంగా నిర్వహణ సౌలభ్యాన్ని పెంచుతాయి. డీఎఫ్‌సీ నెట్‌వర్క్ అంతటా అదనపు పాయింట్లు, టెర్మినళ్లను ప్రవేశపెట్టడం ద్వారా మొదటి, చివరి మైలు రవాణా ఖర్చులను తగ్గించి కొత్త పారిశ్రామిక క్లస్టర్లకు ఈ సేవను విస్తరించనున్నారు.
విశ్వసనీయమైన నిశ్చిత రవాణా సమయాలతో దేశవ్యాప్త మార్కెట్‌ను చేరుకోవాలనుకునే భారతీయ వ్యాపార సంస్థలకు మున్ముందు ఈ సౌకర్యం కొత్త అవకాశాలను అందిస్తుంది. త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార శుద్ధి పరిశ్రమల కోసం టీఓటీ.. మొదటి అంచె నుంచి చివరి అంచె వరకు నిజమైన అనుసంధానాన్ని అందిస్తుంది. మహారాష్ట్రలో పండించిన తాజా సపోటాలను ఉదాహరణగా తీసుకుంటే.. వీటిని తోటల నుంచి సమీపంలోని టీఓటీ టెర్మినళ్లకు తరలించి ప్రత్యేక సరకు రవాణా కారిడార్ ద్వారా వేగంగా రవాణా చేయటంతో గమ్యస్థానాలకు తక్కువ సమయంలో సరకు దెబ్బతినకుండా చేరవేయొచ్చు. భారత్‌లోని అతి ముఖ్యమైన ఉద్యానవన కేంద్రాలలో ఒకటైన నాసిక్ నుంచి ఉల్లిపాయలు ఉత్తర, తూర్పు మార్కెట్లకు సమర్థవంతంగా చేరుకోగలవు. ఇది సరకు వృథా కావడాన్ని, ధరల హెచ్చుతగ్గులను తగ్గిస్తుంది.
విస్తృతమైన బహుళ నమూనా దార్శనికతలో భాగం
టీఓటీ ఒక విడి ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ప్రత్యేక సరకు రవాణా కారిడార్ సంస్థకు (డీఎఫ్‌సీసీఐఎల్) సంబంధించిన విస్తృత బహుళ నమూనా రవాణా దార్శనికలో ఒక ప్రధాన భాగం ఇది. అధిక సామర్థ్యం గల సరకు రవాణా కారిడార్లు, బహుళ నమూనా సరకు రవాణా టెర్మినళ్లు, లాజిస్టిక్స్ పార్కులతో పాటు రోడ్డు, రైలు మార్గాలు ఒకదానికొకటి తోడ్పడేలా ఇది చేస్తుంది. తద్వారా ఏ రవాణా విధానం ఎక్కడ అత్యంత సమర్థవంతంగా, పొదుపుగా, పర్యావరణహితంగా ఉంటుందో అక్కడ దానిని వినియోగిస్తుంది.
భారతదేశపు సరకు రవాణా విధానంలో ఒక నిర్మాణాత్మక మార్పును ఈ టీఓటీ సేవ సూచిస్తుంది. ఆవిష్కరణ, విద్యుదీకరించిన మౌలిక సదుపాయాలు, పోటీతత్వ ధరలు, నిర్వహణ సామర్థ్యం, స్పష్టమైన పర్యావరణ- సామాజిక ప్రయోజనాలను మిళితం చేయడం ద్వారా సరకు రవాణా అనేది ఒకే సమయంలో సమర్థవంతంగా, నమ్మదగినదిగా, బాధ్యతాయుతంగా ఉండగలదని డీఎఫ్‌సీసీఐఎల్ నిరూపిస్తోంది.
***
(रिलीज़ आईडी: 2217488)
आगंतुक पटल : 5