విద్యుత్తు మంత్రిత్వ శాఖ
5 లక్షల సర్క్యూట్ కిలోమీటర్లు దాటిన భారత విద్యుత్ సరఫరా వ్యవస్థ
2014 ఏప్రిల్ నుంచి సరఫరా వ్యవస్థలో 71.6% వృద్ధి
పెరుగుతున్న శిలాజేతర విద్యుత్ పంపిణీ కోసం అదనంగా మరో 67,000 సర్క్యూట్ కిలోమీటర్లు... కొనసాగుతున్న పనులు
प्रविष्टि तिथि:
22 JAN 2026 2:05PM by PIB Hyderabad
దేశ జాతీయ విద్యుత్ ప్రసార వ్యవస్థ కీలక మైలురాయిని అధిగమించింది. 220 కేవీ, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గల ప్రసార మార్గాల పొడవు 5 లక్షల సర్క్యూట్ కిలోమీటర్లను దాటగా.. ట్రాన్స్‌ఫార్మేషన్ సామర్థ్యం 1,407 జీవీఏకు చేరింది.
ప్రపంచంలో అతిపెద్ద సింక్రోనస్ జాతీయ గ్రిడ్ 2026 జనవరి 14న ఈ ఘనతను సాధించింది. రాజస్థాన్ పునరుత్పాదక ఇంధన జోన్ నుంచి విద్యుత్తును తరలించడం కోసం.. భద్లా-II నుంచి సీకర్-II సబ్‌స్టేషన్ వరకు నిర్మించిన 765 కేవీ సామర్థ్యం గల 628 సర్క్యూట్ కిలోమీటర్ల ప్రసార మార్గాన్ని ప్రారంభించడంతో ఇది సాధ్యమైంది. ఈ ప్రసార మార్గం ప్రారంభంతో.. భద్లా, రామగఢ్, ఫతేగఢ్ సౌర విద్యుత్ కాంప్లెక్సుల పునరుత్పాదక ఇంధన జోన్ నుంచి అదనంగా 1,100 మెగావాట్ల విద్యుత్తును తరలించే వీలు కలిగింది.
2014 ఏప్రిల్ నుంచి దేశ విద్యుత్ ప్రసార వ్యవస్థ 71.6% వృద్ధిని సాధించింది. ఈ కాలంలో 220 కేవీ, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గల 2.09 లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల ప్రసార మార్గాలను కొత్తగా నిర్మించారు. అలాగే, ట్రాన్స్‌ఫార్మేషన్ సామర్థ్యం కూడా (220 కేవీ, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గలది) 876 జీవీఏ మేర పెరిగింది. ప్రస్తుతం 1,20,340 మెగావాట్లుగా ఉన్న అంతర ప్రాంతీయ విద్యుత్ బదిలీ సామర్థ్యం వల్ల దేశంలో వివిధ ప్రాంతాల మధ్య ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా సాధ్యమైంది. తద్వారా ‘ఒక దేశం - ఒకే గ్రిడ్ - ఒకే ఫ్రీక్వెన్సీ’ లక్ష్యం సాకారమైంది.
ప్రస్తుతం పనిచేస్తున్న అంతర్రాష్ట్ర ప్రసార ప్రాజెక్టులతో దాదాపు 40,000 సర్క్యూట్ కిలోమీటర్ల ప్రసార మార్గాలు, 399 జీవీఏ ట్రాన్స్‌ఫార్మేషన్ సామర్థ్యం పెరగబోతోంది. వీటితోపాటు పనిచేస్తున్న రాష్ట్రాల అంతర్గత ప్రసార ప్రాజెక్టులతో మరో 27,500 సర్క్యూట్ కిలోమీటర్ల ప్రసార మార్గాలు, 134 జీవీఏ ట్రాన్స్‌ఫార్మేషన్ సామర్థ్యం పెరుగుతాయని అంచనా. ఇవి గ్రిడ్ విశ్వసనీయతను, విద్యుత్ తరలింపు సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర విద్యుదుత్పత్తిని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పెరుగుతున్న ప్రసార సామర్థ్యం.. దేశంలో వేగంగా పెరుగుతున్న శిలాజేతర విద్యుత్తును తరలించేందుకు ఎంతో దోహదపడుతుంది.
5,00,000 సర్క్యూట్ కిలోమీటర్ల ప్రసార మార్గాల మైలురాయిని చేరుకోవడమన్నది.. దేశవ్యాప్తంగా నమ్మదగిన, చవకైన, సురక్షిత విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వ నిరంతర కృషికి నిదర్శనం. పునరుత్పాదక ఇంధన వనరుల వేగవంతమైన అనుసంధానానికి తోడ్పడుతూ ఇది దేశ ప్రగతికి బాటలు వేస్తోంది.
***
(रिलीज़ आईडी: 2217286)
आगंतुक पटल : 4